దీపావళి ఒక్కోచోట ఒక్కోలా..
జీవితాల్లో చీకటిని పోగొట్టి వెలుగులు నింపే దీపావళి పండుగను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకుంటారు. కొన్నిచోట్ల మూడు రోజులు.. మరికొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు కూడా సంబరాలు జరుగుతాయి.
దీపావళి పండునకు మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని మీకు తెలుసా? దీపాల పండుగను ఒక్కోచోట ఒక్కోరకంగా చేసుకుంటారు. అయితే పండుగ పేర్లు, సాంప్రదాయాలు మారుతుంటాయి. దీపావళి పండుగను ఏయే ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం.
జీవితాల్లో చీకటిని పోగొట్టి వెలుగులు నింపే దీపావళి పండుగను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకుంటారు. కొన్నిచోట్ల మూడు రోజులు.. మరికొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు కూడా దీపావళి సంబరాలు జరుగుతాయి. మనదేశం తర్వాత దీపావళిని ఎక్కువగా జరుపుకునే దేశాల్లో మారిషస్, నేపాల్, మలేసియా, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, కెన్యా, టాంజానియా, బ్రిటన్, మయన్మార్, సింగపూర్, శ్రీలంక, జపాన్, థాయ్‌లాండ్, ఆస్టేల్రియా దేశాలు ఉన్నాయి.
ఇకపోతే మనదేశంలోనే దీపావళిని ఒక్కోరాష్ట్రంలో ఒక్కోలా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ సమేతంగా నరకాసురుడ్ని వధించిన రోజుగా అలాగే 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా దీపావళిని చెప్పుకుంటారు.
పశ్చిమ బెంగాల్‌లో దీపావళికి కాళీ పూజలు చేస్తారు. దీన్నే శ్యామ పూజ అంటారు. కోల్‌కతాలోని దక్షిణేశ్వర్, కాళీఘాట్ ఆలయాల్లో కాళీ పూజను ఘనంగా నిర్వహిస్తారు. కాళీపూజకు ముందు రాత్రి బెంగాలీలు తమ ఇళ్లల్లో 14 దీపాలను వెలిగించి దుష్ట శక్తులను పారద్రోలాలని అమ్మవారిని వేడుకుంటారు.
వారణాసిలో దీపావళిని 'దేవ్ దీపావళి'గా జరుపుతారు. ఈ రోజున గంగానదిలో స్నానం చేసేందుకు దేవతలు భూమికి వస్తారని నమ్ముతారు. అందుకే గంగానది ఒడ్డున రంగవల్లికలు వేసి దీపాలు పెట్టి పూజలు చేస్తారు.
ఒడిశాలో దీపావళి రోజు 'కౌరియ కతి' అనే ఆచారాన్ని నిర్వహిస్తారు. ఇది స్వర్గంలో తమ పూర్వీకులను పూజించే ఆచారం. ఈ రోజున తమ పూర్వీకుల ఆత్మలను పిలిచేందుకు, వారి నుంచి ఆశీర్వాదం పొందేందుకు జనపనార కర్రలను ఇంటి ముందు కాలుస్తారు.
మహారాష్ట్రాలో దీపావళి రోజున 'వాసు బరస్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీపావళి రోజున ఆవులను పూజిస్తారు.అలాగే మరాఠీలు దీపావళికి వైద్యానికి దేవుడైన ధన్వంతరికి పూజలు చేస్తారు.
గుజరాతీలు దీపావళి రోజున కొత్త వ్యాపారాలు మొదలుపడుతుంటారు. దీపావళి మరుసటి రోజు నుంచి గుజరాతీల కొత్త సంవత్సరం మొదలవుతుంది.
గోవాలో దీపావళి రోజున నరకాసురుడి దిష్టిబొమ్మలను తయారు చేసి దహనం చేస్తారు. దీపావళి సందర్భంగా, గోవాలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు పాపం నుంచి విముక్తి కోసం శరీరాలపై కొబ్బరి నూనె పూసుకుని తర్వాత తలస్నానం చేస్తారు.