రిలేషన్‌షిప్ హ్యాపీగా సాగాలంటే
మనదేశంలోని పెళ్లయిన వాళ్లలో 60 శాతం మంది తమ బంధాల పట్ల సంతోషంగా లేరని ‘గ్లీడెన్’ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ చేసిన సర్వేలో తేలింది.
రిలేషన్‌షిప్ అనేది జీవితాన్ని అందంగా మార్చాలి. కానీ, చిక్కుల్లోకి నెట్టకూడదు. అయితే ఈమధ్య కాలంలో బంధాలనేవి మోయలేని బరువుగా మారిపోతున్నాయి. మనదేశంలోని పెళ్లయిన వాళ్లలో 60 శాతం మంది తమ బంధాల పట్ల సంతోషంగా లేరని ‘గ్లీడెన్’ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ చేసిన సర్వేలో తేలింది. బంధం సంతోషంగా సాగాలంటే ఎలాంటి ప్రవర్తనను అలవర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం
రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లు ఒకరికి ఒకరు ఎమోషనల్‌గా సపోర్ట్ ఇవ్వాలే కానీ, ఎమోషనల్ బర్డెన్‌గా తయారవ్వకూడదు. జీవితంలో ఆనందం కోసం, తోడు కోసమే బంధంలోకి అడుగుపెడతారు ఎవరైనా. తీరా కొత్త జీవితం మొదలుపెట్టాక అందులో ఇమడలేక ఇబ్బందిపడుతుంటారు. దీనిపై నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారంటే..
మార్చాలనుకోవద్దు
పార్ట్‌నర్ ను మీకు నచ్చినట్టు మార్చాలని ప్రయత్నించడం కరెక్ట్ కాదు. ఎదుటి వ్యక్తిని అలాగే అంగీకరించకుండా వాళ్లకి నచ్చే విధంగా మార్చాలని ట్రై చేసినప్పుడు.. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. మార్చలేకపోతున్నామన్న కోపం కూడా వెంటాడుతుంది. అందుకే ఎదుటివారిని మార్చాలనుకోవడం సరైన లక్షణం కాదని అర్థం చేసుకోవాలి.
ప్రైవసీ ఇస్తున్నారా?
సొంత విషయాల్లో ఎక్కువ జోక్యం కనిపిస్తే అది టాక్సిక్ లక్షణం కింద లెక్క. అంటే పార్ట్‌నర్ మొబైల్ చెక్ చేయడం, పాస్‌వర్డ్‌లు అడగడం లాంటివన్నమాట. ఎదుటి వాళ్లకి ప్రైవసీ ఇవ్వకుండా.. ‘నాకు తెలియకుండా ఎదీ చేయకూడదు’ అనే ధోరణి రిలేషన్‌కు మంచిది కాదు. ఒకరికొకరు స్పేస్ ఇచ్చిపుచ్చుకుంటేనే బంధం బలపడుతుంది.
అబద్ధాలు ప్రమాదం
ప్రతి విషయంలో ‘నువ్వు చెప్పేది అబద్ధం’ అన్నట్టు వ్యవహరిస్తే.. నమ్మకం నిలబడదు. రిలేషన్‌షిప్‌లో నమ్మకం లేకపోవడం అన్నింటికంటే ప్రమాదకరమైన విషయం. ఏది చెప్పినా నమ్మకపోవడం, అబద్దం అని కొట్టి పారేయడం లాంటివి పార్ట్‌నర్స్ మధ్య ఎమోషనల్ గ్యాప్‌ను పెంచుతాయి. రిలేషన్‌షిప్‌లో నమ్మకం ఉన్నప్పుడే అది ఎక్కువ కాలం నిలబడుతుంది.
చిన్నవి కూడా
అప్పుడప్పుడు చిన్నచిన్న విషయాలలో పెద్ద గొడవ అవుతుంటుంది. ఇది అన్ని ఇళ్లలో జరిగేదే. అయితే దీనికంటూ ఓ లిమిట్ ఉంటుంది. ఇష్యూ పెద్దదవుతున్నప్పుడు కొంతకాలానికి ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకు పోవడం సహజం. అయితే అలా సర్దుకుపోయినప్పటికీ ఇష్యూ క్లోజ్ అవ్వట్లేదంటే.. ఎక్కడో సమస్య ఉన్నట్టు. అర్ధం చేసుకోకుండా పదే పదే ఒకేలా బిహేవ్ చేస్తుంటే.. వాళ్లకి రిలేషన్‌ను కాపాడుకోవాలనే ఉద్దేశం లేదేమో అన్న అనుమానం వస్తుంది. ఇలాంటి బిహేవియర్ రిలేషన్‌షిప్‌కు ఏమాత్రం మంచిది కాదు.
ఈ పదాలు తరచుగా
సారీ, నో అన్న పదాలు ఎక్కువగా వస్తున్నపుడు రిలేషన్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని రిలేషన్ షిప్ నిపుణులు చెప్తున్నారు. ప్రతిసారి ‘సారీ’ చెప్పాల్సి రావడం, ఏది అడిగినా ‘నో’ అనడం లాంటివి మంచి సంకేతాలు కాదు. సారీ , నో అన్న పదాలు తక్కువగా ఉండే రిలేషన్స్ ఎక్కువ కాలం హ్యాపీగా ఉన్నట్టు పరిశోధనలు చెప్తున్నాయి.