మొన్న సుందరీకరణ.. నేడు పునరుజ్జీవనం

మూసీ ప్రక్షాళనపై మళ్లీ మాట మార్చిన ముఖ్యమంత్రి

Advertisement
Update:2024-10-17 22:53 IST

మూసీపై ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడుతున్నారు. మూసీ సుందరీకరణ కాదు.. నదీ పునరుజ్జీవనమని తాజాగా వెల్లడించారు. కేటీఆరే కాదు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు కూడా సీఎం రాసిన లేఖలో ముందు ప్రక్షాళన, తర్వాత సుందరీకరణ అన్నారు. మూసీ దుర్గంధంతో మగ్గిపోతున్నదని సీఎం వాపోతున్నారు. అలా కావడానికి కారణం దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్‌ పార్టీ తర్వాత టీడీపీల హయాంలోనే హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు మురికి కూపాలుగా మారాయి.

పదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ పాలకులు మీలా నిత్యం గత పాలకుల మీద నిందలు వేస్తూ కాలం వెళ్లదీయలేదు. మూసీ ప్రక్షాళనకు ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. మూసీలోకి వెళ్లే మురుగు నీటి వల్లే ఆ నదీ కాలుష్య కారకంగా మారింది. ఈ పరిస్థితిని మార్చడానికి అలాగే వర్షాలు పడినప్పుడు రోడ్లపై నీళ్లు నిలువకుండా డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దడానికి నగరం చుట్టూ ౩౦ పైగా ఎస్టీపీల నిర్మాణం చేపట్టారు. దశలవారీగా వాటిలో అనేకం పూర్తి చేశారు. ఇంకా కొన్ని తుది దశలో ఉన్నాయి. మూసీ నదీ పునరుజ్జీవంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉండి ఉంటే దానికి సంబంధించి ఒక ప్రణాళిక తయారుచేసుకుని, ఆ నదీ పరివాహక ప్రాంత ప్రజలతో చర్చించి ఒక నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్లేవారు. కానీ అవేవీ చేయకుండానే హైడ్రాకు అపరిమిత అధికారాలు కట్టబెట్టి కూల్చివేతలతోనే మూసీ దుర్గంధం మొత్తం పోతుంది. హైదరాబాద్‌లో రోడ్లపై పడిన వర్షపు నీళ్లు నిలువకుండా చెరువుల్లోకి, నదుల్లోకి చేరిపోతుంది అన్నట్లు వ్యవహరించారు. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో పాటు, మూసీ పరివాహ ప్రాంత ప్రజల నిరసనలు, రేవంత్‌ ఏకపక్ష వైఖరిపై సొంతపార్టీ నేతలే అధిష్టానికి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు మాట మార్చారు. మూసీ సుందరీకరణకు మొదట రూ. 50 వేల కోట్లు అన్నారు. తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు రూ. 70 వేల కోట్లు అవుతాయన్నారు. సీఎం రేవంత్‌ గోపన్‌పల్లి లో ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని బహిరంగంగానే ప్రకటించారు. అసెంబ్లీలోనూ ఈ అంశంపై చర్చకు వచ్చినప్పుడు మీ డిప్యూటీ సీఎం కేంద్రానికి మూసీ ప్రక్షాళన కోసం డీపీఆర్‌ పంపించామంటే అదేం లేదని శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి శ్రీధర్‌బాబు అన్నది రికార్డుల్లోనే ఉన్నది.

మూసీ సుందరీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్‌ అన్నది నిజం. కానీ మీలా గడికో మాట మాట్లాడలేదు. దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేసుకుంటూ వెళ్లారు. పదేళ్ల కిందటికి ఇప్పటికి నగరంలో ట్రాఫిక్‌ విషయంలో కావొచ్చు, డ్రైనేజీ వ్యవస్థలో కావొచ్చు, మూసీలోకి వచ్చే మురునీటిని శుద్ధి చేయడంలోనూ చాలా మార్పు వచ్చింది. ఇది నగరంలో ఉన్న ఎవరిని అడిగినా చెబుతారు. కానీ మూసీ పరివాహక ప్రజలను ఆవేదనను పట్టించుకోకుండా బుల్డోజర్‌ రాజ్‌ పేరుతో బెదిరింపులకు దిగింది ఎవరు? దశాబ్దాలుగా పైసా పైసా కూడబెట్టి వాళ్ల జీవిత కాలాన్ని పెట్టుబడిగా పెట్టి నిర్మించుకున్న ఇళ్లను నిమిషాల్లో కూల్చివేసింది ఎవరు? వాళ్ల కు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కంటే మెరుగైన పరిహారం ఏముంటుందని ఎద్దేవా చేసింది ఎవరు? ఇప్పుడు మూసీ పేరుతో జరుగుతున్న డ్రామాపై విపక్షాల నుంచే కాదు సొంత పార్టీలోనూ నిరసన స్వరం వినిపించగానే మాట మార్చి మూసీ బాధితులకు మెరుగైన జీవితం ఇవ్వాలనుకుంటున్నామని అంటే ఎవరూ విశ్వసించరు. ఈ విషయంలో మీరు ఎన్ని చెప్పినా ఆ బాధితులు మిమ్మల్ని విశ్వసించే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్లు మీ మొండి వైఖరితో వాళ్ల జీవితాలను రాత్రికి రాత్రే ధ్వంసం చేస్తామన్నట్టు భయాందోళలు సృష్టించిన మిమ్మల్ని ఎలా నమ్ముతారు? మూసీ సుందరీకరణ సారీ సీఎం తాజాగా మాట మార్చి అన్నట్టు నదీ పునరుజ్జీవనం అయినా ఆ పరివాహక ప్రజల సహకారం లేకుండా సాధ్యం కాదన్నది తెలుసుకోవాలి. ఈ వాస్తవాన్ని విస్మరించి మూడు నెలలు కేటీఆర్‌, హరీశ్‌, ఈటల మూసీ నది ఒడ్డున ఉంటారా? అని దబాయించినంత మాత్రానా నదీ ప్రక్షాళన జరగదు. ఆ బాధితుల బాధలు తీరవు. 

Tags:    
Advertisement

Similar News