గ్రామాల్లో మళ్లీ వీఆర్వో వ్యవస్థ.. సర్వీస్‌ రూల్స్‌పై అస్పష్టత

తెలంగాణలో మళ్లీ రెవెన్యూ వ్యవస్థ రానుంది.

Advertisement
Update:2024-12-24 10:48 IST

తెలంగాణలో మళ్లీ రెవెన్యూ వ్యవస్థ రానుంది. వీఆర్‌ఓ వ్యవస్థను వ్యవస్థ పునరుద్ధరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇతర శాఖల్లోకి బదిలీ అయిన వీఆర్వోలు, వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తోంది. గూగుల్ ఫామ్స్‌లో ఈ నెల 28లోగా వివరాలు సేకరించాలని కలెక్టర్లను ఆదేశించింది. దాదాపు 11 వేల మంది అధికారులను నియమించుండగా ఇందులో సగం మందిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా తీసుకోనునన్నట్లు టాక్. ఈ నూతన పోస్టుల నియమ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ధరణిని రద్దు చేస్తూ భూ భారతి చట్టం తీసుకొచ్చారు. ఈ చ‌ట్టంలో భాగంగా వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో సంస్కరణల పేరిట వీఆర్ఏ, వీఆర్వో లాంటి కీలక వ్యవస్థను రద్దు చేసింది. వాటి స్థానంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి భూములకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసి రిజిస్ట్రేషన్లు కొనసాగించారు.

వాస్తవానికి 2022కు ముందు రాష్ట్రంలో 5వేల మందికిపైగా ‘గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో)’గా పనిచేశారు. అయితే రెవెన్యూ శాఖలో పెరిగిపోయిన అవినీతిని నియంత్రించడం కోసమంటూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసింది. ఆ పోస్టుల్లో ఉన్నవారిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపింది. ఆ నిర్ణయంపై కోర్టుకు వెళ్లిన సుమారు 70 మంది కోర్టు తీర్పు ఆధారంగా రెవెన్యూ శాఖలోనే కొనసాగుతున్నారు. మిగతా వారంతా వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలలో వార్డు అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కూడా పొందారు. ఈ క్రమంలో మళ్లీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన వారిని మాత్రమే జూనియర్‌ రెవెన్యూ అధికారులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వీఆర్‌ఏల విషయానికొస్తే... 2023 జూలై నాటికి 22 వేల మందికిపైగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్నారు. అందులో 61 ఏళ్లలోపు వయసున్న, 2011 సంవత్సరంలోపు నియమితులైన 16,758 మందిని వివిధ ప్రభుత్వ శాఖల్లోకి పంపారు. మరో 3,797 మంది వయసు 61 ఏళ్లు దాటడంతో.. వారి వారసులకు వేరే శాఖలో ఉద్యోగాలు ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.

ఇలా వివిధ శాఖల్లోకి వెళ్లిన వీఆర్‌ఏలలో కూడా సుముఖత వ్యక్తం చేసినవారిని మాత్రమే మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకోనున్నారు. గత ప్రభుత్వం వీఆర్‌ఏ, వీఆర్వోలను రెవెన్యూ శాఖ నుంచి పంపించేశాక.. గ్రామస్థాయిలో రెవెన్యూ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతల్లో కొన్నింటిని పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. చాలా చోట్ల పెద్ద గ్రామ పంచాయతీలు ఉండటం, రెవెన్యూ వ్యవహారాలపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులపై భారం పెరుగుతుంది. గ్రామస్థాయి రెవెన్యూ అధికారులుగా వెళ్లాలో వద్దో తేల్చుకోలేక, పూర్వ వీఆర్‌ఏలు, వీఆర్వోలు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఉన్న వీఆర్వో వ్యవస్థ రద్దయిన నేపథ్యంలో కొత్త పోస్టుల నియమ నిబంధనలను ప్రభుత్వం ఇంకా వెలువరించలేదు. వెళ్తే ఏ పనిచేయాలి? హోదా, వేతన స్కేలు వంటివి ఇంకా ఖరారు చేయలేదు. దీంతోపాటు వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దయినప్పటినుంచి ఇతర శాఖల్లో పనిచేసిన సీనియార్టీని పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News