డీఎంకే ఫ్యూచర్ ఫేస్ గా ఉదయనిధి

కరుణానిధి కుటుంబంలో కీలక పదవిలోకి మూడో తరం నాయకుడు

Advertisement
Update:2024-09-29 19:08 IST

ద్రావిడ మున్నేట్ర కజగం. డీఎంకేగా అది సుప్రసిద్ధం. ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు, పథకాలు, ప్రాజెక్టులతో తమిళుల ఆదరాభిమానాలు పొందిన ఆ పార్టీ గత ఏడాది వజ్రోత్సవం నిర్వహించుకున్నది. ఈ 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఒడిదొడుకులను చవిచూసింది. ప్రాంతీయపార్టీల్లో పురాతన పార్టీగా పార్టీగా పేరొందిన ఆపార్టీ దేశ రాజకీయ చరిత్రలో ఓ జాతీయ పార్టీని మొదటిసారి ఓడించి చరిత్ర సృష్టించింది.

సామాజిక దురాగతాలు, మూఢనమ్మకాలపై పెరియార్‌గా పిలిచే ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త రామస్వామితో కలిసి ఉద్యమించిన అన్నాదురై అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ తర్వాత కరుణానిధి పాలనలో తమిళ అస్తిత్వ మార్క్‌ను చూపెట్టారు. అలాగే అనేక సంస్కణలు తీసుకొచ్చారు. దేశంలో మొదటిసారి వెనుకబడినవర్గాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కును కల్పించే చారిత్రక చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1996లో రాష్ట్రంలోని స్థానిక సంస్థల్ఓ మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించారు.1967లో డీఎంకే కాంగ్రెస్‌ పార్టీని ఓడించడమే కాదు ఆ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ కూటమిలోనూ భాగమైంది. దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌, వాజ్‌పేయీల నేతృత్వంలో ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో పాలు పంచుకున్నది. 2004, 2009 లో యూపీఏ ప్రభుత్వాల్లో భాగస్వామి అయ్యింది. కరుణానిధి వారసుడిగా డీఎంకే అధ్యక్షుడైన ముఖ్యమంత్రి స్టాలిన్‌ మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషించారు.

కరుణానిధి ఉన్నంత కాలం ఆ కుటుంబంలో ఆయన వారుసుడిగా ఎవరు అన్నదానిపై అప్పుడప్పుడు ఆయన పెద్దకొడుకు అళగిరి, స్టాలిన్‌ల మధ్య గొడవలు జరిగేవి. అయితే కరుణ మాటే అందరికీ వేద వాక్కు కావడంతో అవేవీ పెద్దగా ప్రభావం చూపెట్టలేదు. 2014లో అళగిరిని, ఆయన మద్దతుదారులను కరుణానిధి పార్టీని నుంచి బహిష్కరించారు. కరుణానిధి రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్న సమయంలోనే ఆయన స్టాలిన్‌ తన వారసుడిగా అధికారికంగా ప్రకటించకుండానే ఆయనకే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఆయన ఉండగానే స్టాలిన్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు.

తండ్రితో కలిసి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఆయన తన 62వ పుట్టినరోజును కుటుంబసమక్షంలో చేసుకున్నారు. అప్పుడే కరుణ రాజకీయ వారసుడు స్టాలినే అన్నది దాదాపు ఖరారైంది. స్టాలిన్‌ పుట్టినరోజును డీఎంకే వాడవాడల్లో నిర్వహించాయి. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతూ, అశేష అభిమాన లోకాన్ని, మద్దతును ఆయన పొందగలిగారు. కరుణానిధి ఉన్నప్పుడు ఆయన తనయులు అళగిరి, స్టాలిన్, కుమార్తె కనిమొళి, మేనల్లుడు దివంగత మురసోలి మారన్, మనవాళ్లు మారన్ బ్రదర్స్ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ముగ్గురు భార్యల ముగ్గురు వారసుల్లో స్టాలిన్ నాయకత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కుటుంబంలో రాజకీయ వారసత్వం అంశాన్నికరుణానిధి సున్నితంగా పరిష్కరించారు. ఆయన మరణం తర్వాత పార్టీ మొత్తం స్టాలిన్‌ నాయకత్వాన్నే కోరుకున్నది. పార్టీకి నమ్మకస్తులైన కార్యకర్తలంతా తనతోనే ఉన్నారని, తనను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే డీఎంకే తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లేనని కరుణానిధి పెద్ద కొడుకు అళగిరి వ్యాఖ్యానించినా పెద్దగా పట్టించుకోలేదు.

కరుణానిధి తర్వాత పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్న స్టాలిన్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపారు. భారీ మెజారిటీతో అధికారంలోకి తెచ్చారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటారు. తమిళనాడులో బోణి కొట్టాలన్న బీజేపీకి అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతం డీఎంకేలో స్టాలిన్‌ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ సమయంలోనే తన వారసుడు ఉదయనిధిని ప్రత్యక్షరాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయించి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర బాధ్యతలు పూర్తిగా ఆయనకు అప్పగించడానికి స్టాలిన్‌ వ్యూహ రచన చేశారు. ఇందులో భాగంగానే నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. కరుణానిధి కుటుంబంలో కీలక పదవిలోకి మూడో తరం నాయకుడు వచ్చేశాడు. సీఎం స్టాలిన్‌ డీఎంకే ఫ్యూచర్ ఫేస్ గా ఉదయనిధి స్టాలిన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు అనడానికి ఈ పరిణామాలే సంకేతంగా కనిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News