రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఉత్త ముచ్చటే

స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నంలో రేవంత్

Advertisement
Update:2024-09-26 09:51 IST

అధికారం కోసం ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను నమ్మించిన రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత నాలుక మడతెట్టేసాడు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ దాదాపు సాధ్యం కాదని సెలవిచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదని చెప్పి తాను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తోనూ అధికారం కోసం అబద్దాలు చెప్పించానని పరోక్షంగా అంగీకరించారు. బీద సాదల ధైర్యం ఇస్తానని చెప్పి అదే బీదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపుతున్నారు. ఎన్నికలకు ముందు ఏ హామీలను రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిందో వాటిని అమలు చేయకుండా అన్నింటికీ గత ప్రభుత్వమే కారణమంటూ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అలాగే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రవచిస్తే అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం అయ్యాక కూడా పరిపాలకుడిగా ప్రజల బాగోగులు చూడాల్సిన ఆయన శాంతిభద్రతల విషయంలో నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా రాష్ట్రంలో హత్యలు, దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోయాయి. రైతుల రుణమాఫీ గురించి, రైతు భరోసా గురించి రోడెక్కారు. నిరుద్యోగులు ఉద్యోగాల గురించి దీక్షలు, నిరసన బాట పట్టారు. ఎన్నికల ముందు వరకు రైతులు, నిరుద్యోగుల అంశాలపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరామ్‌, విద్యా కమిషన్‌ ఛైర్మన్‌ ఆకునూరి మురళి లాంటి వాళ్లకు తొమ్మిది నెలల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ అంతా సుభిక్షంగా ఉన్నట్లు కనిపిస్తున్నది కావొచ్చు. ప్రశ్నించాల్సిన ఆ గొంతుకలు మౌనంగా ఉండటాన్ని తెలంగాణ ప్రజానీకం తప్పుపడుతున్నది.

ఆరు గ్యారెంటీల సంగతి పక్కనపెడితే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై సీఎం పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 90 రోజుల్లోనే 30 వేల ప్రభుత్వాలు ఇచ్చాం. రెండు మూడు నెలల్లో మరో 35 వేల ఇస్తాం. రానున్న రోజుల్లో మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరదని సీఎం సెలవిచ్చారు. ప్రతిభ ఉన్నా ఉద్యోగ నైపుణ్యాలు లేకుంటే కొలువులు రావని కొత్త పల్లవి అందుకున్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలతోనే తమ సమస్యలు తీరుతాయని ఎవరూ భావించడం లేదు. కానీ రేవంత్‌ ప్రభుత్వం కొలువుదీరిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు 30 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్న, మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్న నోటిఫికేషన్లు ఈ ప్రభుత్వ హయాంలో వచ్చినవి కావు. కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రూప్‌-1లో 60, డీఎస్సీలో 5,900 పైచిలుకు, తాజాగా నర్సింగ్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ తప్పా మిగిలినవన్నీ కేసీఆర్‌ ప్రభుత్వం 2022 మార్చిలో అసెంబ్లీలో ప్రకటన మేరకు వచ్చినవే. వీటిలో ఎక్కువ శాతం పరీక్షలు పూర్తై, పోలీసు ఉద్యోగాల వంటివికి ఫిజికల్‌ టెస్టులు పూర్తై, కొన్నింటికి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వాటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం నియామకపత్రాలు అందించి తమ ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగా ఉన్నది.

అంతెందుకు గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు చేసి కొత్తగా కొన్ని పోస్టులు జత చేసి అదే మెగా డీఎస్సీ అని రేవంత్‌ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని బీఆర్‌ఎస్‌తో పాటు నిరుద్యోగులు మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌. ఎస్. ప్రవీణ్‌ కుమార్‌ అన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఆఘమేఘాల మీద డీఎస్సీ పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ లో నిర్వహించింది. వివిధ పరీక్ష కారణంగా చాలామంది అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నప్పటికీ .. ప్రభుత్వం మాకు టీచర్లు తొందరగా అవసరం ఉన్నదని హడావుడిగా నిర్వహించింది. అంతా ఆన్లైన్ పరీక్ష అయినప్పుడు దీనికి సంబంధించిన నియామక భర్తీ ప్రక్రియ ఎందుకు నత్త నడకన సాగిస్తున్నది? ఫలితాలు తొందరగా ఇచ్చి, జనరల్ ర్యాంకింగ్స్ ఇచ్చి, నియామక పత్రాలు అందజేస్తే కొత్తగా ఎన్నికైన టీచర్లు బడులకు వెళ్లి పిల్లలకు పాఠాలు బోధిస్తారు కదా! డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వారంలో డీఎస్సీ రిజల్ట్స్ ఇస్తామని చెప్పి నెలలు అయిందని,సెప్టెంబర్ 5 వరకే నియామకాలు చేపడతామని కూడా చెప్పారు కదా ఏమైందని అన్న ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎందుకంటే విద్యాశాఖ సీఎం వద్దనే ఉన్నది. ఆయన అన్నివిషయాలు చెబుతారు. కానీ దీనిపై మాత్రం మాట్లాడరు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ పరీక్షలను యథాతథంగా కొనసాగించి మొదటి క్యాబినెట్‌లోనే 25 వేలతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామన్న హామీని నిలబెట్టుకుంటే నిరుద్యోగులు విశ్వసించేవారు. కానీ ఆరు గ్యారెంటీల అమలును పక్కదోవ పట్టించడానికి రాష్ట్రంలో అనేక సమస్యలు హైడ్రానే పరిష్కారం అన్నట్లు డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేస్తున్న రేవంత్‌ ఉద్యోగాల విషయంలోనూ డిగ్రీలు, ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన నిరుద్యోగుల స్కిల్స్‌ నేర్చుకోవాలని లేకపోతే కొలువు దక్కవంటూ సూచనలు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News