చంద్రబాబు తొందరపాటు ప్రకటన ఫలితం

బాబు రాజకీయాలు గ్రహించక ఆవేశపడి బద్నామైన పవన్‌ కల్యాణ్

Advertisement
Update:2024-10-01 14:31 IST

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏపీ సీఎం చంద్రబాబుపై సీరియస్‌ అయ్యింది. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనే వ్యవహారంపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ప్రశ్నలు లేవనెత్తింది. టీడీడీ తరఫున వాదిస్తున్న లాయర్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రధానంగా నెయ్యి కల్తీపై రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో మాట్లాడటానికి తీవ్రంగా పరిగణించింది. చంద్రబాబు తన వ్యాఖ్యలతో కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరిచారు. ఈ అంశంపై నారా వారు నేరుగా మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా అని ప్రశ్నించింది. అంతేకాదు అంతేకాదు రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా! అన్నది. ఈ అంశాన్ని రాజకీయాల్లోకి లాగొద్దన్న సుప్రీం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ వ్యాఖ్యానించింది.

అలాగే మరికొన్ని కీలక ప్రశ్నలు సంధించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉన్నదా? నెయ్యిని రిజెక్ట్‌ చేశారని ఈవో చెప్పారు కదా? లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి శాంపిల్‌ ల్యాబ్‌కు పంపించారా? కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడినట్లు ప్రాథమికంగా ఆధారాల్లేవని, ఉంటే ఆధారాలు చూపించండి? జులైలో రిపోర్ట్‌ వస్తే సెప్టెంబర్‌లో చెప్పారెందుకు? సిట్‌ ఎందుకు వేశారు? ఈ విచారణతో సరిపోతుందా? అని టీటీడీ లాయర్‌ సిదార్థ్‌ లూథ్రాను ప్రశ్నించింది. కల్తీ వ్యవహారం పాపం గత ప్రభుత్వానిదే అన్నప్పుడు మాజీ సీఎం జగన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి తిరుమల లడ్డూలో నెయ్యి వాడేముందు జరిగే పరీక్షలు, ప్రక్రియల గురించి మీడియాకు వివరించారు. ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన ఈ పరిణామాలకు మమ్మల్ని ఎందుకు బాధ్యులను చేస్తున్నారు అని సూటిగా ప్రశ్నించారు. అందుకే కల్తీ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేశారు. తప్పులు, పాపాలు చేసి సిగ్గు లేకుండా బుకాయిస్తారా? ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతుందన్న సీఎం చంద్రబాబు జగన్‌పై ఫైర్‌ అయ్యారు. మళ్లీ ఆయనే సెప్టెంబర్‌ 27 మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు? అన్నది అప్రస్తుతం అన్నారు. కానీ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు తప్పు ఒప్పకోవాలి లేదా మౌనంగా ఉండాలని జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు.

ప్రసాదంలో రిజెక్ట్ చేసిన నెయ్యి వాడలేదని టీటీడీ లాయర్ లూథ్రా చెప్పడంతో నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా? అని కోర్టు ప్రశ్నించింది. నెయ్యి వాడినట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నది. నెయ్యిలో కాకుండా లడ్డూలో కల్తీ జరిగిందని ల్యాబ్ నిర్ధారించిందా? ఒక ల్యాబ్ రిపోర్ట్ నే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు? సెకండ్ ఒపీనియన్ ను ఎందుకు తీసుకోలేదు? గుజరాత్ లాబ్ రిపోర్ట్ వచ్చిన సుమారు రెండు నెలల అనంతరం చంద్రబాబు ప్రభుత్వం తన పార్టీ కార్యక్రమంలో ,ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఏ ఆధారంతో చెప్పాడు? అని సుప్రీంకోర్టు ప్రశ్నలకు సరైన సమాధానం లేదు. ఈ విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీఎం చంద్రబాబు రాజకీయం గురించి తెలిసిన వారెవరూ తొందరపడరు. కానీ ఈ లోగానే కూటమి ప్రభుత్వంలోని పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మ పరిరక్షణకు తానే కంకణం కట్టుకున్నట్టు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఓ కేంద్ర మంత్రిని ఈ అంశంపై ప్రశ్నిస్తే ఏ విచారణ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని, చంద్రబాబు అనుభవం ఉన్న నాయకుడు అంటూ సెలవిచ్చారు. సుప్రీంకోర్టు ఈ అంశంపై సంధించిన ప్రశ్నలకు బీజేపీ నేతలు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు కోరింది అంటే మతం పేరుతో రాజకీయం చేసి నాలుగు ఓట్లు, సీట్లు సంపాదించాలనుకునే వారికి కూడా వర్తిస్తుంది. ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరంతో పాటు రాజధాని ప్రాంతం నీట మునిగింది. వారం పది రోజుల వరకు ప్రజలు జలదిగ్బంధంలోనే ఉన్నారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలమైందని అక్కడి విపక్షాలు విమర్శిస్తున్నాయి. రాజధాని, సూపర్‌ సిక్స్‌ హామీలను పక్కదోవ పట్టించడానికి చంద్రబాబు చేసిన ప్రకటన వల్ల పవన్‌ ఆవేశపడ్డారు. బీజేపీ తన మార్క్‌ రాజకీయం మొదలుపెట్టింది. చివరికి జగన్‌ను బాధ్యుడిగా చేద్దామనుకుని చంద్రబాబు ఇంతమందిని బలిచేయడం కొసమెరుపు.

Tags:    
Advertisement

Similar News