ఫిరాయింపు ఫిర్యాదు పెండింగ్ లో ఉండగానే 'పట్నం'కు చీఫ్ విప్ పదవి
శాసన మండలి చీఫ్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డి
శాసన మండలి చీఫ్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డిని నియమించారు. ఆయనపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇచ్చిన ఫిర్యాదు పెండింగ్ లో ఉండగానే చీఫ్ విప్ పదవి కట్టబెట్టారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డి ఇకపై మండలిలో ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీలను సమన్వయం చేయనున్నారు. మహేందర్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి దగ్గరయ్యారు. ఆయన సతీమణి సునీతా మహేందర్ రెడ్డి మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రంగారెడ్డి జిల్లా కోటాలో మహేంద్ రెడ్డి మంత్రి పదవి ఆశించారు. ఆయనకు కేబినెట్ లో స్థానం కల్పించలేకనే సీఎం రేవంత్ రెడ్డి మండలిలో చీఫ్ విప్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్‌ఎస్ బీఫాంపై ఎమ్మెల్సీగా గెలిచిన కాంగ్రెస్ లో చేరిన ఆయనపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ మండల చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటానని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు పడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇచ్చి రేవంత్ రెడ్డి కావాలనే తేనె తుట్టెను కదిపారా అనే ప్రశ్నలు ఎదరవుతున్నాయి. అసెంబ్లీలో ఇంకా చీఫ్ విప్ ను నియమించలేదు. అసెంబ్లీలోనూ ఫిరాయింపు ఎమ్మెల్యేకే ఆ పోస్టు ఇస్తారా? కాంగ్రెస్ బీఫాంపై గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేకు చాన్స్ ఇస్తారా అనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది.
రేవంత్ కు థ్యాంక్స్ చెప్పిన పట్నం
శాసన మండలిలో తనను చీఫ్ విప్ గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి పట్నం మహేందర్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో కలిసి సీఎం రేవంత్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంను సన్మానించి తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రమ్మోహన్ రెడ్డి, కాలె యాదయ్య, మనోహర్ రెడ్డి, నాయకులు హరివర్ధన్ రెడ్డి, రోహిణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నాయకులు వజ్రేశ్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, కొలను హన్మంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.