ఈస్ట్ ఇండియా కంపెనీనే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్!
అన్ని ప్రాజెక్టుల టెండర్లు ఆ రెండు కంపెనీలకే
''ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క తెలంగాణ సంపదను దోచుకుంటున్నరు..'' ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా..? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్టిన డైలాగే ఇది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) పై పీసీసీ అధ్యక్షుడి హోదాలో.. అంతకు ముందు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, తెలుగుదేశం నాయకుడిగా మేఘాపై రేవంత్ అంతెత్తున విరుచుకుపడే వారు. మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డిపైనా తీవ్ర విమర్శలు గుప్పించేవారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అందరూ మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇక శంకరగిరి మాన్యాలే గతి అనుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ సంస్థపై రేవంత్ చేసిన కామెంట్స్ ఆ స్థాయిలో ఉండేవి మరి. ఏమైందో ఏమోగాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అదే ఈస్ట్ ఇండియా కంపెనీతో దోస్తీ కట్టారు. ఎంతలా అంటే ప్రాజెక్టులను కృష్ణారెడ్డి చెప్తే డిజైన్ చేసే స్థాయిలో రేవంత్ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘాపై వాగ్భాణాలు సంధించిన రేవంత్ ఇప్పుడు ఆ సంస్థ మీద ఈగ కూడా వాలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుంకిశాల డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోయిన ఘటన బయటకు పొక్కకుండా సీఎం చాలా ప్రయత్నాలు చేశారు. దురదృష్టవశాత్తు అక్కడ పని చేస్తున్న సిబ్బంది తీసిన వీడియో బయటకు రావడంతో రేవంత్, మేఘా దోస్తీ బండారం బట్టబయలు అయ్యింది.
సుంకిశాల ప్రమాదానికి మేఘా సంస్థ నిర్లక్ష్యమే కారణమని.. ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ నివేదిక ఇచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏ శాఖలో టెండర్లు పిలిచినా మేఘా ఇంజనీరింగ్ సంస్థ పాల్గొనకుండా చేయాలని ఎంక్వైరీ కమిషన్ తేల్చిచెప్పింది. కానీ మేఘా కృష్ణారెడ్డితో ఉన్న దోస్తీ కారణంగా రేవంత్ రెడ్డి ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలకు నీళ్లిచ్చే కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ పనులను మేఘాతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కు అప్పగించారు. ఈ టెండర్లకు సంబంధించిన టెక్నికల్, ప్రైస్ బిడ్లు బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణంగా టెండర్ అవార్డు అయిన తర్వాత టెక్నికల్, ప్రైస్ బిడ్ల డిటైల్స్ తో పాటు ఎల్ -1గా నిలిచిన సంస్థ ఏది.. మిగతా సంస్థల్లో ఎల్ -2, ఎల్ -3 సహా అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెండర్ల వివరాల్లో ఎప్పుడూ గోప్యత పాటించలేదు. కానీ కొడంగల్, నారయణపేట లిఫ్ట్ స్కీం టెండర్లకు సంబంధించిన వివరాలేవి బయట పెట్టలేదు. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో ఏదో జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కు భవిష్యత్ లో తాగునీటి ఇబ్బందులేవి రావొద్దని రెండు డెడికేటెడ్ రిజర్వాయర్లు నిర్మించాలని అనుకున్నారు. రాచకొండ, కేశవపురం రిజర్వాయర్లలో పది టీఎంసీల చొప్పున 20 టీఎంసీలు నిల్వ చేస్తామని ప్రకటించారు. పలు కారణాలతో ఆ రిజర్వాయర్ల నిర్మాణం నుంచి వెనక్కి తగ్గారు. హైదరాబాద్ కు అత్యంత సమీపంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఉండటంతో అక్కడి నుంచి గ్రేటర్ కు నీటిని తరలించాలని సంకల్పించారు. ఈక్రమంలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయినా కేశవపురం రిజర్వాయర్ కోసం భూసేకరణ చేయలేదు. ఇకపై ఆ ప్రాజెక్టు చేపట్టలేదని కేసీఆర్ గతంలోనే మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయం ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లతో పాటు మేఘా ఇంజనీరింగ్ సంస్థ పెద్దలకు తెలుసు. సుంకిశాల ప్రమాదం తర్వాత మేఘాపై విమర్శలు ఎక్కువయ్యాయి. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పనంగా టెండర్లు దక్కుతూనే ఉన్నాయి. గతంలో తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన మేఘా ఇప్పుడు దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ గా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి రూ.200 కోట్ల భూరి విరాళం అందజేసిన మేఘా.. ఆ యూనివర్సిటీ భవనాలన్ని నిర్మించనుంది. భవన నిర్మాణాలను శుక్రవారం భూమిపూజ కూడా చేసింది.
కొండపోచమ్మసాగర్ నుంచి హైదరాబాద్ కు నీటిని తరలించి మూసీని పునరుజ్జీవం చేసే ప్రాజెక్టు చేపడితే పెద్దగా వర్కవుట్ కాదని గుర్తించిన మేఘా.. ప్రాజెక్టు సోర్స్ ను కొండపోచమ్మ నుంచి మల్లన్నసాగర్ కు మార్చింది. భారీ ట్రంక్ లైన్ సహా ఇతర పనులను సుమారు రూ.6 వేల కోట్లతో చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు వెనుక మాస్టర్ మైండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ అని ప్రభుత్వవర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లతో చేపట్టబోయే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనుల్లోనూ ప్రధాన ప్యాకేజీలు మేఘా, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కే ఇచ్చేలా ప్రభుత్వ పెద్దలతో ఒప్పందాలు జరిగాయని ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారు. సెక్రటేరియట్ లోనే కాదు గాంధీ భవన్ లో ఈ డిస్కషన్ బాహాటంగానే సాగుతోంది. ఇవే కాదు రాష్ట్రంలో ఏ ప్రధాన ప్రాజెక్టులు చేపట్టిన వాటిలో సింహభాగం పనులు మేఘా, రాఘవకే కట్టబెట్టడం ఖాయమని చెప్తున్నారు. అందుకే గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు అదే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఇష్టమైన కంపెనీగా మారిందని హస్తం పార్టీ నేతలే చెప్తున్నారు. అందుకే కేశవపురం లాంటి ఉనికిలో లేని ప్రాజెక్టు టెండర్ రద్దు చేశామంటూ సీఎంవో నుంచి హడావిడి చేయించారని.. మేఘా సంస్థ టెండర్లు రద్దు చేయాలని అనుకుంటే సుంకిశాల ఘటన తర్వాత ఏ ప్రాజెక్టు టెండర్లు కట్టబెట్టకుండా బ్లాక్ లిస్ట్ చేసే వారని రేవంత్ ప్రభుత్వంలోని ముఖ్యులే కామెంట్ చేస్తున్నారు.