తెలంగాణ పద్దులో పావు వంతు ఆదాయం అప్పులతోనే

28.1 శాతానికి చేరనున్న ఎఫ్‌ఆర్‌బీఎం అప్పులు;

Advertisement
Update:2025-03-19 15:27 IST

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ లో పావు వంతు నిధులను అప్పులతోనే సమకూర్చుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ లో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే రూ.70 వేల కోట్లకు పైగా అప్పులు తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు. తాజాగా ప్రతిపాదించిన అప్పులను లెక్కలోకి తీసుకున్న అప్పులు 28.1 శాతానికి చేరాయి. రూ.3,04,965 కోట్ల బడ్జెట్‌ లో కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు, స్టేట్‌ ఓన్‌ రెవెన్యూ రూపంలో రెవెన్యూ రిసీట్స్‌ గా రూ.2,29,720.62 కోట్ల ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. ఇక క్యాపిటల్‌ రిసీట్స్‌ రూపంలో రూ.74,645.92 కోట్ల ఆదాయం సమకూరుతుందని వెల్లడించారు. రెవెన్యూ ఆదాయంలో ట్యాక్స్‌ రెవెన్యూగా రూ.1,45,419.58 కోట్లుగా ప్రకటించారు. నిరుడు ప్రతిపాదించిన ఆదాయం కన్నా రూ.9 వేల కోట్ల లోటు ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.16 వేల కోట్లు ప్రతిపాదించారు. నాన్‌ ట్యాక్స్‌ రెవెన్యూ రూపంలో 31,618.77 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా రూ.29,899.77 కోట్లు, గ్రాంట్ల రూపంలో రూ.22,782.50 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో ఓపెన్‌ మార్కెట్‌, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు, ఇతర రుణాల రూపంలో రూ.70 వేల కోట్లకు పైగా సమకూర్చుకోనున్నారు. డిపాజిట్స్‌ ట్రాంజాక్షన్స్‌ రూపంలో ఇంకో రూ.4 వేల కోట్లు సమకూరుతాయని పేర్కొన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌ లో రెవెన్యూ వ్యయం రూ.2,26,982.29 కోట్లుగా పేర్కొన్నారు. నిరుడు రెవెన్యూ వ్యయంగా కేటాయించిన నిధుల్లో రూ.25 వేల కోట్ల కన్నా తక్కువే ఖర్చు చేసినా ఈ బడ్జెట్‌ లో ఈ మొత్తాన్ని పెంచారు. అప్పులకు వడ్డీ చెల్లింపులకు రూ.19,368.02 కోట్లు, ఇతర రుణాలు, అడ్వాన్స్‌ లకు రూ.21,350.55 కోట్లు, చేబదుళ్లు, ఇతర రుణాల చెల్లింపులకు రూ.15,848.20 కోట్లు, క్యాపిటల్‌ ఎక్స్‌ పెండిచర్‌ కోసం రూ.36,504.45 కోట్లు, క్యాపిటర్‌ డిస్‌బర్స్‌మెంట్‌ కోసం రూ.20,027.71 కోట్లు, కేంద్రం నుంచి తీసుకున్న రుణాల చెల్లింపులకు రూ.440.85 కోట్లు, ఇతర రుణాల చెల్లింపులకు రూ.3,738.66 కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. మొత్తంగా రుణాల చెల్లింపునకు బడ్జెట్‌ నుంచి రూ.60,747.26 కోట్లు ఖర్చు చేయనున్నారు.

నిరుడు ప్రతిపాదనల కన్నా రూ.25,124.49 కోట్లు తక్కువ ఆదాయం

రాష్ట్ర ప్రభుత్వం 2024 -25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ను రూ.2,91,159 కోట్లుగా ప్రతిపాదించగా సవరించిన అంచనాల ప్రకారం రూ.2,66,034.51 కోట్లుగా ప్రకటించారు. అంటే నిరుడు ప్రతిపాదించిన ఆదాయం కన్నా రూ.25,124.49 తక్కువగా సమకూరింది. అయినా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించింది. అంటే నిరుడు అప్పులు, గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో వాటా సహా రాష్ట్ర సొంత ఆదాయంగా సమకూరిన దానికన్నా అదనంగా రూ.38,930.49 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్ర మిగులు బడ్జెట్‌ రూ.2,738.33 కోట్లుగా పేర్కొన్న ప్రభుత్వం, ద్రవ్యలోటు రూ.54,009.74 కోట్లు అని వెల్లడించింది. ప్రైమరి డెఫిషిట్‌ గా పేర్కొన్న రూ.34,640.72 కోట్లను నాన్‌ ట్యాక్స్‌ రెవెన్యూ రూపంలో సమకూర్చుకోనుంది. అంటే భూముల అమ్మకం, కుదువ పెట్టడం ద్వారా ఈ లోటు పూడ్చుకునే ప్రయత్నం చేయనుంది.

రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,45,419.58 కోట్లు

తెలంగాణ రాష్ట్ర సొంత ఆదాయం రూ.1,45,419.58 కోట్లుగా బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొన్నారు. ఇందులో వాణిజ్యం, ఇతర అమ్మకాల ద్వారా వచ్చే పన్నులు (ఎస్‌జీఎస్టీతో కలిపి) రూ.88,463.90 కోట్లు అని వెల్లడించారు. ఇందులో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.19,087.26 కోట్లు, వాణిజ్యం, సేల్స్‌ ట్యాక్స్‌ రూపంలో రూ.37,463 కోట్లు, వాహనాల అమ్మకం పన్నుల రూపంలో రూ.8,535 కోట్లు, ప్రజా, ప్రైవేటు రవాణా జీఎస్టీ రూపంలో రూ.9.91 కోట్లు, విద్యుత్‌ పన్నుల ద్వారా రూ.775.50 కోట్లు, ఇతర పన్నుల రూపంలో రూ.3.65 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ఎక్సైజ్‌ శాఖ ద్వారా రూ.27,623.36 కోట్లు, ఇతర మార్గాల్లో రూ.29,321.12 కోట్లు, ల్యాండ్‌ రెవెన్యూ రూపంలో రూ.11.20 కోట్లు సమకూరుతాయని వెల్లడించారు. సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలకు రూ.1,10,966 కోట్లు ఖర్చు చేస్తారు.

15 నెలల్లో రూ.80 వేల కోట్ల అప్పు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రూ.80 కోట్ల అప్పు చేసింది. కార్పొరేషన్లు, ఇతర మార్గాల్లో సేకరించిన అప్పులను కలుపుకుంటే ఇది రూ.1.60 లక్షల కోట్లకు పైగా ఉంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తీసుకున్న అప్పులు రూ.3,56,486 కోట్లు ఉండగా, 2023 - నాటికి రూ.4,03,644 కోట్లకు చేరాయి. ప్రస్తుత బడ్జెట్‌ లో అప్పుల మొత్తాన్ని 5,04,814 కోట్లు (28.1 శాతం)గా పేర్కొన్నారు. 2023 డిసెంబర్‌ లో కేసీఆర్‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తీసుకున్న అప్పులు రూ.3.83 లక్షల కోట్ల అప్పులు ఉండగా, తర్వాత రెండు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో రూ.20 వేల కొట్ల అప్పు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.60 వేల కోట్లు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరికొన్ని రుణాలు సమీకరించేందుకు ఇండెంట్‌ సమర్పించింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సగటున పదేళ్లలో రూ.38 వేల కోట్లలోపు అప్పులు చేస్తే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.60 వేల కోట్లకు పైగా అప్పులు చేసింది. కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి, ప్రభుత్వమే చెల్లించాల్సిన అప్పులు రూ.1,17,109 కోట్లు ఉండగా, ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్లు సమీకరించి, కార్పొరేషన్‌లే చెల్లించే అప్పులు మరో రూ.1,24,419 కోట్లుగా ఉన్నాయి. ప్రభుత్వ గ్యారంటీ లేకుండా కార్పొరేషన్లు సొంతగా సేకరించి తిరిగి చెల్లించే అప్పులు రూ.59,956 కోట్లు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News