కాంగ్రెస్‌లో గెలుపు గుర్రాలు లేవా..?

ఏమైనా చాలాకాలంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కడియం కావ్యకు ప్రస్తుత పరిణామం ఆయాచితంగా లభించిన అదృష్టం. తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం జంప్‌ జిలానీ అనిపించుకోడానికి కడియం శ్రీహరి సిద్ధపడటం కలిసొచ్చింది.

Advertisement
Update:2024-04-02 10:57 IST

ఏ పార్టీ మీదయితే పోటీ చేసి గెలవాలో వారే వచ్చి తమ పార్టీ అభ్యర్థిగా నిలబడమంటే ఎవరయినా కాదంటారా? తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి సునాయసంగా గెలిపిస్తామంటే వద్దంటారా? డాక్టర్‌ కడియం కావ్య విషయంలో జరిగింది అదే. ఇపుడు ఆమె గెలుపు నల్లేరు మీద నడక లాంటిదే అంటున్నారు పరిశీలకులు. మొదట బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వరంగల్‌ బరిలో నిలబడిన కడియం కావ్యను ఆహ్వానించింది కాంగ్రెస్‌. ప్రత్యర్థి పార్టీ తన విజయానికి అండగా నిలబడతానంటే ఎలా కాదంటారు? ఇంత సదవకాశం ఎవరయినా ఎందుకు వదులుకుంటారు..? అందుకే ఆమె కాంగ్రెస్‌ ప్రతిపాదనకు అంగీకరించింది.

ఇప్పటివరకు కడియం శ్రీహరితో ఉన్న బిఆర్‌ఎస్‌ శ్రేణులు కడియం కావ్యకు అనుకూలంగా ప్రచారం చేశాయి. ఇపుడు ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆమె విజయం కోసం అన్ని శక్తులు ధారపోయడానికి సిద్ధపడటంతో వరంగల్‌ నుంచి కడియం కావ్య గెలుపు సులభమే అంటున్నారు పరిశీలకులు. అయితే బిఆర్‌ఎస్‌ నుంచి తాటికొండ రాజయ్య లాంటి బలమైన అభ్యర్థిని నిలబెడితే పోటీ తీరు వేరేగా ఉంటుందన్నది అంచనా.

ఏమైనా చాలాకాలంగా క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కడియం కావ్యకు ప్రస్తుత పరిణామం ఆయాచితంగా లభించిన అదృష్టం. తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం జంప్‌ జిలానీ అనిపించుకోడానికి కడియం శ్రీహరి సిద్ధపడటం కలిసొచ్చింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. నిజానికి తానే ఎంపీ స్థానానికి పోటీ చేయాలని తలపోశారు. కానీ, కాంగ్రెస్‌ అధిష్టానం కడియం కావ్య వైపు మొగ్గు చూపి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

ఈ పరిణామం రెండు విషయాల్ని స్పష్టం చేస్తున్నది. 1. వరంగల్‌ లోక్‌సభ స్థానంలో తమ పార్టీ నుంచి దీటైన అభ్యర్థిని నిలబెట్టలేని బలహీన స్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ఉండటం. 2. కడియం శ్రీహరికి, బిఆర్‌ఎస్‌కు వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో తగిన పట్టు ఉందని అంగీకరించడం.

బిఆర్‌ఎస్‌ను ఖాళీ చేయాలనే వ్యూహం పేరిట ఆ పార్టీ వారికి పదవులు అప్పగించడం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో కొందరికి అంతగా రుచించడం లేదు. కాకపోతే ఈ సమయంలో ఎవరూ బయటకి మాట్లాడటం లేదు. తమ పార్టీలో గెలుపు గుర్రాలు లేవా? వైరిపక్షం నుంచి ఎందుకు అరువు తెచ్చుకోవాలి? అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌లో ఎంపీ స్థానాలకు పోటీ చేయగల బలమైన అభ్యర్థులు లేరా? ఈరకమైన గుసగుసలు సాగుతూనే వున్నాయి.

ఇప్పటివరకు ప్రకటించిన 14 ఎంపీ స్థానాలలో నలుగురు (రంజిత్‌ రెడ్డి, దానం నాగేందర్‌, సునీతా మహేందర్‌ రెడ్డి, కడియం కావ్య) బిఆర్‌ఎస్‌కు చెందిన వారే కావటం గమనార్హం. ఈ నలుగురిని బిఆర్‌ఎస్‌ నుంచి పిలిచి టిక్కెట్లు ఇవ్వడమనేది పీసీపీ అధినేతగా రేవంత్‌రెడ్డిది సాఫల్యమా? వైఫల్యమా? తాము బలంగా లేనప్పుడు, ఎదుటివారిని బలహీనపరిచే వ్యూహాన్ని ప్రత్యర్థులు ఎంచుకుంటారు. వందరోజుల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించిన తెలంగాణ కాంగ్రెస్‌ది నిజంగా బలం కాదా? కేవలం వాపేనా? అందుకే బిఆర్‌ఎస్‌ నేతలను పిలిచి టిక్కెట్లు ఇస్తున్నారా అని పరిశీలకులు విస్తుపోతున్నారు. ఇంకా ప్రకటించాల్సిన ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలకయినా కాంగ్రెస్‌ పార్టీ వారినే నిలబెడతారా? లేదా బిఆర్‌ఎస్‌ నేతలకు గాలం వేస్తారు? వేచి చూడాలి మరి!

Tags:    
Advertisement

Similar News