'గుణాత్మక' మార్పు కోసం.. కేసీఆర్ జాతీయ రాజకీయం!
''ఎవరైనా బలపడాలి అంటే సంకల్ప బలం ఉండాలి. సంకల్పించిన తర్వాత దాన్ని విడిచిపెట్టరాదు. గట్టిగా పట్టుకోవాలి. ఇక మిగతావన్నీ వాటంతట అవే వాళ్ళను అనుసరిస్తాయి''. అని ప్రసిద్ధ తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే అన్నాడు. కేసీఆర్ ఇదే తత్వంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది.
విప్లవానికి పరిస్థితులు పరిపక్వం కాకుండా విప్లవం రాదని చరిత్ర చెబుతోంది. పరిస్థితులు పరిపక్వంగా ఉన్నా మార్పునకు దోహదపడే శక్తులు బలహీనంగా ఉన్నప్పుడు అది సాధ్యపడదు. దేశ చరిత్రలో మార్పు కోసం ప్రయత్నాలు జరిగిన సందర్భాలు లేకపోలేదు. ఆ ప్రయత్నాలు విజయవంతం అయిన ఘటనలూ ఉన్నాయి. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మొత్తం ప్రతిపక్షాలను జయప్రకాశ్ నారాయణ్ కూడగట్టిన చరిత్రను దేశం చూసింది. రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్, దేవీలాల్, విపిసింగ్ వంటి నాయకులు ప్రతిపక్షాలను కూడగట్టారు. బిజెపి, సమతా పార్టీ, అన్నాడిఎంకె, శివసేన తదితర ప్రాంతీయ పార్టీలతో 1998లో కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఏర్పడింది.
బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇతర లౌకిక శక్తులు కలిసి యూపిఏను నిర్మించిన సందర్భం కూడా ఉంది. మోదీ వ్యతిరేక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడానికి 2019 లో జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కనుక తెలంగాణ నిర్మాత కేసీఆర్ తలపెట్టిన కార్యాచరణ విజయవంతమవుతుందా? అనే సందేహాలు తలెత్తడం సహజం. అలాగే ఆయన విశ్వసనీయతను ప్రశ్నించేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఆయనను ఉత్తరాది రాష్ట్రాల నుంచి లభించే ఆమోదంపై చాలా అనుమానాలు ఉన్నాయి.
''ఎవరైనా బలపడాలి అంటే సంకల్ప బలం ఉండాలి. సంకల్పించిన తర్వాత దాన్ని విడిచిపెట్టరాదు. గట్టిగా పట్టుకోవాలి. ఇక మిగతావన్నీ వాటంతట అవే వాళ్ళను అనుసరిస్తాయి''. అని ప్రసిద్ధ తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే అన్నాడు. కేసీఆర్ ఇదే తత్వంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో మోడీకి, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలని ఆయన సంకల్పించారు. ఇదేమీ జాతీయరహదారి కాదు. అడుగడుగునా ముళ్లబాట. దారి పొడవునా సవాళ్లు. అపనమ్మకం. సరిగ్గా తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్ళే కేసీఆర్‌ను చుట్టుముట్టనున్నాయి. ఆ చిక్కు ముళ్ళన్నీ ఒక్కొక్కటిగా తొలగించుకొని ముందుకు సాగి విజయం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఉద్యమ 'అనుభవాల'ను రంగరించి జాతీయ రాజకీయాలలోనూ అమలు చేసే అవకాశాలున్నాయి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో దేశంలో ఆయనకంటూ ప్రత్యేకమైన 'బ్రాండ్ ఇమేజ్' సంపాదించుకున్నారు. ఆ పథకాలనే ఆయన అస్త్రాలుగా మలచుకుంటున్నారు.
మోడీకి వ్యతిరేకంగా ఎవరెన్ని విధాలుగా మాట్లాడినా 'బీజేపీ ముక్త్ భారత్' అనే నినాదాన్ని సంధించిన మొదటి నాయకుడు కేసీఆర్. ఆయనకున్న భాషా పటిమ, వ్యూహరచన శక్తి, ప్రజల్లో.. రాజకీయ కార్యకర్తల్లో సూటిగా నాటుకుపోగలిగేలా కమ్యూనికేట్ చేయగలగడం కేసీఆర్ కవచకుండలాలు. మోడీ గద్దె దిగాలని కాంక్షించడం వేరు. ఆయనను గద్దె దింపాలని సంకల్పించడం వేరు. సంకల్పం ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు తగిన రోడ్ మ్యాపు ఉండాలి. ఆ సంకల్పాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కావలసింది భావ వ్యాప్తి నైపుణ్యం. దాన్నే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటుంటాం. ఆ నైపుణ్యం కేసీఆర్ కు పుష్కలంగా ఉంది.
''భారత దేశానికి ప్రగతిశీల ఎజెండా కావాలి. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఇంకా మన దేశాన్ని పేదరికం ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టంచేసే ప్రజలు ఉండి వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిది..? ఐదేళ్లకోసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యం కాదు. అధికార పీఠం మీదికి ఒక కూటమి బదులు మరో కూటమి ఎక్కడం కాదు. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన మార్పు రావాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి." అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్న రీతిలో, నేరుగా జనానికి హత్తుకు పోయేలా విషయాన్ని కమ్యూనికేట్ చేయగలిన వారు సమకాలీన నాయకులలో కనిపించడం లేదు. రాహుల్ గాంధీ నుంచి మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్, కేజ్రీవాల్, కుమారస్వామి, అఖిలేష్ యాదవ్ వరకు ఎవరిలోనూ ఈ నైపుణ్యం లేదు. ఒకవేళ నైపుణ్యం ఉన్నా కేసీఆర్ తో సరితూగే స్థాయిలో లేదు.
విచ్ఛిన్నకర శక్తులు పెట్రేగితే ఎంత ప్రమాదమో అందరికీ తెలుసు. కానీ" దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉంది. విద్వేష రాజకీయాలలో చిక్కి దేశం విలవిలలాడుతుంది. దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చలేదు. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరం. విచ్ఛిన్నకర శక్తుల వలన అశాంతి ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు. పెట్టుబడులు వెనక్కి మరలే విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాదిమంది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని వంద సంవత్సరాలు వెనక్కు తీసుకుపోతుంది. దేశం కోలుకోవడానికి మరో వంద సంవత్సరాలు పడుతుంది. దేశ ప్రయోజనాల కోసం, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం మనందరి బాధ్యత. ప్రజల ప్రయోజనాలు ఫణంగా పెట్టి రాజీపడే ప్రసక్తి లేదు. రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. సమస్త ప్రజానీకానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి'' అని తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్నంత సులభతరంగా కమ్యూనికేట్ చేయడం ఇతరులకు కష్టమే !
మార్క్సిస్టు పరిభాషలో చెప్పాలంటే టిఆర్ఎస్ ఒక బూర్జువా, భూస్వామ్య పోకడల రాజకీయ పార్టీ. అయితే ఆ పార్టీ సారధి కేసీఆర్ మాటల్లో మార్క్సిస్టుల పరిభాష దొర్లుతూ ఉంటుంది. 'ప్రగతిశీల భావజాలం' ఆయన ప్రసంగాల్లో అలవోకగా ప్రవహిస్తూ ఉంటుంది. కాంగ్రెస్, టీడీపీల నుంచి టిఆర్ఎస్ వరకు ఆయన ప్రయాణమంతా 'బూర్జువా' బాటే కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఎడతెరిపిలేని ఉద్యమాన్ని నడిపిన కాలంలో వెన్నుదన్నుగా నిలిచిన 'వామపక్ష తీవ్రవాద భావజాలం' కేసీఆర్ ను ప్రభావితం చేసి ఉండాలి. ఆ ప్రభావం లేకపోతే 'విచ్ఛిన్నకర శక్తులను అణచివేయడం, విద్వేష రాజకీయాలను అంతం చేయడం' వంటి తీవ్ర ప్రకటనలు చేయడం సాధ్యం కాదు. కేసీఆర్ కమ్యూనిస్టు కాదు. మావోయిస్టు కాదు. కానీ ప్రజల్ని చదివిన వ్యక్తి. ప్రజల్లో తిరిగిన వ్యక్తి. ప్రజలతో కనెక్టు అయినా వ్యక్తి. ఏ మార్క్సిస్టులు కేసీఆర్ ను విమర్శించగలరో, వారినే అత్యంత సులువుగా మెప్పించి, వారి చేతనే ప్రశంసలు పొందగలిగిన 'స్కిల్స్' ఆయనకే సొంతం.
''కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం బలమైన కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కులను నిర్లజ్జగా హరిస్తోంది. కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతుంది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాష్ట్రాలకు రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తుంది. రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తుంది. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తుంది. కేంద్రానికి తలొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలుచేయక పోవడం వల్ల తెలంగాణ ఏటా ఐదు వేల కోట్ల రూపాయలు సమకూర్చుకొనే అవకాశం కోల్పోయింది. మొత్తం ఐదేళ్లలో 25 వేల కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తోంది. ఈ 25 వేల కోట్ల రూపాయల కోసం చూస్తే రైతుల బావులకాడ మీటర్లు పెట్టాలి. రైతుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేయాలి. అది మన విధానం కాదు. రైతుల మీద భారం వేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంఠంలో ప్రాణమున్నంత కాలం రైతాంగానికి నష్టం చేసే విద్యుత్ సంసరణలను అంగీకరించేది లేదు'' అని ఒక సభలో కేసీఆర్ చెలరేగారు. .
బిజెపి నాయకులందర్నీ కట్టిపడేసేది సంఘ్‌తో అనుబంధం, ఒక సైద్ధాంతిక బంధం. ఈ విషయంలో మిగతా పార్టీలు బిజెపితో పోటీ పడలేవు. ఏ ఎన్నికకైనా కొన్ని సంవత్సరాల ముందే పకడ్బందీగా ప్రణాళికా బద్దంగా పనిచేయడం బిజెపి తత్వం. సరిగ్గా కేసీఆర్ ఫిలాసఫీ కూడా అదే. అలాగే నరేంద్రమోదీకి, కేసీఆర్ కు ఎన్నికలంటే ఎంతో ఇష్టం. మోదీ చేసిన పనులే కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేస్తే చాలా కృత్రిమంగా కనిపించింది.'హరహర మహదేవ' అని ప్రియాంక గాంధీ నినదిస్తే జనం వింతగా చూశారు. 2019 చివరి దశ పోలింగ్ సమయంలో నరేంద్రమోదీ కేదార్‌నాథ్ గుహకు వెళ్లి తపోధ్యానంలో మునిగిపోయినా, యూపీ ఎన్నికల చివరి ఘట్టంలో వారణాసిలో రైల్వేస్టేషన్‌కు వెళ్లి సామాన్యులతో సంభాషించినా జనం మనసుల్లో బలమైన ముద్ర వేయడానికే. బిజెపిని ఎదుర్కోవడానికి గాను సైద్ధాంతిక స్పష్టత అవసరం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అదే పనిలో ఉన్నారు. మిగతా ప్రాంతీయ పార్టీల అధినేతలకు, కేసీఆర్ కు ఉన్న ప్రధాన తేడా అదే.
బీజేపీని బలంగా ఎదుర్కోవడానికి గాను ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ్ వంటి అత్యున్నత స్థాయి నాయకుడు మాత్రమే కాదు, జార్జి ఫెర్నాండెజ్, మధులిమాయే, మధు దండావతే వంటి ఫైర్ బ్రాండ్ సోషలిస్టు నేతలు, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి సైద్ధాంతిక భూమిక ఉన్న నేతల అవసరం భారత రాజకీయాలకు ఉన్నట్టు విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ ను అలాంటి నాయకులతో పోల్చడం సరైనదేనా? కాదా ? అనే అంశంపై చర్చ జరుగుతోంది. బీహార్ కు చెందిన జయప్రకాశ్ నారాయణ్ జాతీయ రాజకీయాల్లో పెను తుపాను ఎట్లా సృష్టించగలిగారో చరిత్ర చదివితే తెలుస్తుంది. కేసీఆర్ ప్రస్తుతం జేపీనే ఆదర్శంగా తీసుకున్నారు. బీహార్ పర్యటనలో జయప్రకాశ్ నారాయణ్ గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం.