కేసీఆర్ 'విస్ఫోటనం' !

ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ లేదా మేఘాల విస్ఫోటనం అని వాతావరణ శాఖ చెబుతోంది.

Advertisement
Update:2022-07-17 15:05 IST

ఇతరుల ట్రెండ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించరు. ఆయనే ఒక ట్రెండ్ సెట్టర్ అని చాలాసార్లు రుజువైంది. తాజాగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగానూ 'విదేశీ కుట్ర' గురించి చేసిన వ్యాఖలు సంచలనం సృష్టిస్తున్నాయి. భారీవర్షాలు, వరదలకు విదేశాల కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి బాంబు పేల్చారు.

''గోదావరికి వచ్చిన ఆకస్మిక వరదల వెనుక క్లౌడ్ బరస్ట్ కుట్ర ఉంది. క్లౌడ్ బరస్ట్ పద్ధ‌తి ద్వారా దేశంలో ఆకస్మిక వరదలను స్పష్టిస్తున్నారు. దేశంలో ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారు. గతంలో లడఖ్, లేహ్ లో ఇలాంటే వరదలే వచ్చాయి. ఉత్తరాఖండ్ లో అలాగే చేశారు'' అని బహుశా దేశంలోనే మొట్ట మొదట కేసీఆర్ విదేశాల 'కుట్ర కోణాన్ని' బయటపెట్టారు. ఆయన జాతీయ వ్యవహారాల గురించి ఎప్పుడు ఏమి వ్యాఖ్యానించినా సంచలనమేనన్న విషయం కొత్తదేమీ కాదు. అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా ఎట్లా చొచ్చుకు వస్తోందో గతంలో కేసీఆర్ చెప్పారు. చైనా ఆక్రమణను కేంద్రప్రభుత్వం నిలువరించలేకపోతున్నట్టు కూడా కేసీఆర్ విమర్శించారు.

'క్లౌడ్ బరస్ట్' గురించి మాట్లాడడం ద్వారా మీడియా, రాజకీయ పక్షాల 'మెదడుకు మేత' పెట్టారు. ఒకటి నుంచి నుంచి పది కిలోమీటర్ల లోపు ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ లేదా మేఘాల విస్ఫోటనం అని వాతావరణ శాఖ చెబుతోంది. 'మేఘాల విస్ఫోట‌నం' జరిగినప్పుడు తీవ్ర నష్టం జరుగుతుంది. ఉత్తరాఖండ్‌లో 2013లో భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం 'క్లౌడ్ బరస్ట్' వల్లనే జరిగినట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. సాధారణంగా భారత్‌లో మే నుంచి జూలై-ఆగస్టు వరకు ఉత్తరాధిలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పర్వత ప్రాంతాల్లో 'క్లౌడ్ బరస్ట్' ఘటనలు జరుగుతూ ఉంటాయని అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా కలిగే ఆటంకాలు అనుభవంలో ఉన్నవే.

ఇక క్లౌడ్ బరస్ట్ జరిగితే ఆ ప్రాంతాలకు దగ్గరలో నదులు, సరస్సులు ఉంటే నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కుంభవృష్టి వల్ల నదుల్లో నీరు పొంగి, వరదలు ముంచెత్తడం సహజం. తద్వారా లోతట్టు ప్రాంతాలకు నష్టం ఎక్కువ. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో 'క్లౌడ్ బరస్ట్' ఘటనల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎక్కువగా జరుగుతోంది. ''రాడార్ సహాయంతో పెద్ద ప్రాంతంలో కురవబోయే భారీ వర్షాలను వాతావరణ శాఖ అంచనా వేయగలదు. కానీ ఏ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరగవచ్చునో అంచనా వేయడం అసాధ్యం'''అని వాతావరణ నిపుణులు అంటున్నారు.

ఏ సంఘటన గురించి అయినా వినూత్నంగా ఆలోచించడం, దాన్ని కొత్తగా ఆవిష్కరించడం, ఆయా సంఘటనల పూర్వాపరాలను తెలుసుకోవడం, తన అధ్యయనానికి ఒక నిర్వచనం ఇవ్వడం కేసీఆర్ కున్న గొప్ప లక్షణాల్లో ఒకటి.

Tags:    
Advertisement

Similar News