మట్టి కరిచిన మఫ్లర్ మ్యాన్!
14 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఘోర పరాజయం
మఫ్లర్ మ్యాన్‌గా అందరూ పిలుచుకునే అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిచారు. ఆప్ ఎలక్షన్ సింబల్ చీపురు ఎంత ఫేమస్సో.. మఫ్లర్ తో కనిపించే మఫ్లర్ మ్యాన్ గా అర్వింద్ కేజ్రీవాల్ కూడా అంతే ఫేమస్. సివిల్ సర్వీసెస్ నుంచి అవినీతి వ్యతిరేక ఉద్యమంలోకి వచ్చిన కేజ్రీవాల్ రాజకీయ పార్టీని స్థాపించిన కొద్ది రోజుల్లోనే ఢిల్లీ సీఎం అయ్యారు. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని చీపురుతో ఊడ్చేస్తామని బలంగా ప్రచారం చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం షీలా దీక్షిత్ పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. అన్నాహజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమ ప్రస్థానం ఆరంభించిన కేజ్రీవాల్ కొంతకాలానికే ఆయనకు దూరమ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపన తర్వాత పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అయ్యారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లతో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో కేజ్రీవాల్ సీఎం అయ్యారు. సంకీర్ణ రాజకీయాలు నడపడం అసాధ్యమని.. అది తన అవినీతి వ్యతిరేక సిద్ధాంతానికి అడ్డుతగులుతోందని చెప్పి 49 రోజులకే ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించింది. 2014 సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఏడాదికి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో విజయడంకా మోగించింది. ఎందరో సామాన్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అయిన కొత్తలో తన సొంత మారుతి 800 కారులో సెక్రటేరియట్ కు వెళ్లేవారు. ప్రొటోకాల్ వెహికిల్స్ సమకూరుస్తామన్నా మొదట్లో ససేమిరా అన్నారు. తర్వాత మిగతా రాజకీయ నాయకులగానే మారిపోయారు. సీఎం అయిన కొత్తలో నిజమైన ఆమ్ ఆద్మీ అనిపించిన కేజ్రీవాల్ కొంతకాలం తర్వాత ఆ ఫ్రేమ్ నుంచి దూరమయ్యారు. తాను ఢిల్లీ సీఎంగా ఉన్నా.. 67 ఎమ్మెల్యే సీట్లతో తిరుగులేని విజయం సాధించినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనీసం క్లర్క్‌ను కూడా బదిలీ చేయనివ్వట్లేదని కేజ్రీవాల్ చెప్పేవారు. ఢిల్లీ లెఫ్టినెట్ గవర్నర్ ను అడ్డం పెట్టుకొని తమ పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని వాపోయే వారు. ఢిల్లీని ఎంతో అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నా కేంద్రం అడ్డంకిగా నిలవడం.. అడుగడుగునా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డం పడుతుండటంతో సాధ్యం కావడం లేదని చెప్పేవారు. అయినా మోహల్లా క్లీనిక్‌లతో ఢిల్లీ పేదలకు వైద్యాన్ని కేజ్రీవాల్ చేరువ చేశారు. స్కూళ్ల రూపు రేఖలు మార్చేశారు. డిజిటల్ క్లాస్ రూమ్‌లతో దేశానికే విద్యారంగంలో ఆదర్శంగా నిలిచారు. దీంతో 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేజ్రీవాల్ తిరుగులేని విజయం సాధించారు. ఐదేళ్ల పాలన తర్వాత కేజ్రీవాల్ కు ఐదు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే తగ్గాయంటేనే ఆయనను ఢిల్లీ ప్రజలు ఎంతగా విశ్వసించారో అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీ సీఎంగా తమ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వడం కన్నా బీజేపీకి ఆప్ ప్రత్యామ్నాయం అని.. నరేంద్రమోదీకి తానే ఆల్టర్నేట్ అనే అంశాలకే కేజ్రీవాల్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పార్టీ విస్తరణకు పూనుకున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో తన లక్ష్యం దిశగా ఒక్క అడుగు ముందుకేశారు. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని తాను సొంతం చేసుకోవాలని ఉవ్విల్లూరారు. అదే సమయంలో పరిపాలనలో లోపాలను యథావిధిగా కేంద్రంపై, లెఫ్టినెంట్ గవర్నర్ పై వేస్తూ పోయారు. తాను ఏం చేద్దామన్నా కేంద్రం, ఎల్‌జీ అడ్డం పడుతున్నారని విక్టిమ్ కార్డ్ ప్రయోగించారు. ఈ ప్రయోగమే ఢిల్లీ ప్రజల్లో విసుగు తెప్పించింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీనని చెప్పుకునే కేజ్రీవాల్ సీఎం అధికారిక నివాసం శీష్‌మహల్ ను రూ.33 కోట్ల ప్రజాధనంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం విమర్శలకు కారణమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆప్ ను ఉక్కిరి బిక్కిరి చేసింది. పదేళ్లు అధికారంలో ఉండి యమునా నదిని శుద్ధి చేయలేకపోయిన తన తప్పిదాన్ని హర్యాణాపై నెట్టే నెపం కూడా బూమరాంగ్ అయ్యింది. వెరసి ఆప్ అధికారాన్ని కోల్పోయింది. అంతేకాదు స్వయంగా కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దేశ రాజకీయ ముఖచిత్రంలోకి తారలా దూసుకువచ్చిన కేజ్రీవాల్ భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. అంతమాత్రాన కేజ్రీవాల్ పని అయిపోయినట్టు కాదు. ఈ ఎన్నికల్లో ఆప్ 22 స్థానాల్లో గెలిచింది. బీజేపీ కన్నా ఆ పార్టీకి తక్కువ వచ్చింది కేవలం 2.18 శాతం ఓట్లే. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ టాప్ ఎండ్ డెవలప్‌మెంట్ చేశారని ఢిల్లీ ప్రజలు చెప్తున్నారు. ఢిల్లీ మెట్రో రైలు కూడా ఆమె హయాంలోనే వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కేజ్రీవాల్ ను గెలిపిస్తే కేంద్రంతో, ఎల్‌జీతో తగువు పెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప అభివృద్ధిని పట్టించుకోరనే భావన ఢిల్లీ ప్రజల్లో ఏర్పడింది. దాని ఫలితమే ఈ రోజు ప్రస్ఫుటమయ్యింది.