బలహీనపడిన బీజేపీని బలోపేతం చేసిన కాంగ్రెస్‌, ఆప్‌

హర్యానాలో కాంగ్రెస్‌, ఢిల్లీలో ఆప్‌ అతివిశ్వాసంతో అనూహ్య విజయాలను సొంతం చేసుకున్న బీజేపీ

Advertisement
Update:2025-02-08 20:48 IST

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేసిన పొరపాటునే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేసింది. జాతీయస్థాయిలో బీజేపీని ఎదుర్కొవాలంటే ఇండియా కూటమి పార్టీల అధినేతలు వ్యవహరిస్తున్న తీరుతో సాధ్యం కాదని హర్యానా, మహారాష్ట్రతో పాటు తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే తేలింది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల్లో సమిష్టిగా పోటీ చేసి మోడీ హవాకు చెక్‌ పెట్టిన విపక్షాలు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగించలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్‌. హర్యానాలో బీజేపీతో నేరుగా తలపడే కాంగ్రెస్‌పార్టీ ఇండియా కూటమిలోని పార్టీలో అవగాహన కుదుర్చుకుని, సొంతపార్టీ నేతల్లో అసంతృప్తిని అధిగమించగలిగి ఉండి ఉంటే ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలే నిజమయ్యాయి.

కానీ కాంగ్రెస్‌ స్వయంకృతం వల్ల బీజేపీ హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకున్నది. 39.94 శాతం ఓట్లతో 48 సీట్లను కైవసం చేసుకున్నది. అదే అధికారానికి చేజిక్కించుకోవడానికి అన్ని అవకాశాలున్న కాంగ్రెస్‌ పార్టీ 39.09 శాతం ఓట్లతో 37 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీకి కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల శాతం 0.85 మాత్రమే. ఈ ఎన్నికల్లో ఆప్‌కు 1.79 శాతం ఓట్లు వచ్చాయి. ఆ పార్టీకి మూడు స్థానాలు ఇచ్చి ఉండి ఉంటే బీజేపీకి మూడోసారి అధికారం దక్కేదికాదు. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఆ పార్టీని నిండా ముంచింది. జాతీయస్థాయిలో ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమికి నాయత్వం వహించే పార్టీ ఆలోచించే తీరు ఇది కాదు.

హర్యానా ఇచ్చి విజయంతో బీజేపీ సంతృప్తి పడలేదు. ఇక ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌తో పాటు కీలక భాగస్వామ్య పార్టీలైన శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బకొట్టింది. ఈ విజయంతోనే మోడీ 3.0 ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యపక్షాలకు స్పష్టమైన సంకేతం పంపింది. మోడీ నాయకత్వానికే ప్రజలు జై కొడుతున్నారనే సందేశం ఇచ్చింది. అందుకే కేంద్రంలో చక్రం తిప్పాను, మోడీ కంటే నేనే సీనియర్‌ అని గప్పాలు కొట్టే చంద్రబాబుతోనూ ఢిల్లీలో ప్రచారం చేయించింది. ఆరు లక్షల తెలుగు ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వామిగా ఆపార్టీ అధినేతతోనే మోడీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని చెప్పించింది. హర్యానా, మహారాష్ట్రలో మోడీ ప్రాంతీయ పార్టీల మద్దతుతో బలపడితే .. కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకుని చితికిల పడింది. చివరికి ఇండియా కూటమి నాయకత్వం వహించే సామర్థ్యం కాంగ్రెస్‌లో లేదనే వాదనను మమతా బెనర్జీ, అఖిలేశ్‌, లాలు లాంటి వాళ్లు చెప్పేదాకా తీసుకొచ్చింది.

ఇక ఆప్‌ కూడా కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే నష్టమని బేరీజు వేసుకుని ఢిల్లీలో ఒంటరిగా వెళ్లింది. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేసి పార్టీలే అసెంబ్లీ ఎన్నికల్లో కత్తులు దూసుకున్నది. మూడోసారి గెలిచి దేశానికి నాయత్వం వహించాలనే ఆశతో అరవింద కేజ్రీవాల్‌ బొక్కాబోర్లా పడ్డారు. ఆప్‌ 43.57 శాతం ఓట్లతో 22 సీట్లకే పరిమితమైతే 45.56 శాతం ఓట్లతో 48 సీట్లతో భారీ విజయాన్ని కాషాయ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది. 6.34 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ ఖాతా తెరవకపోయినా ఆప్‌కు భారీ నష్టాన్ని కలిగించింది. ఎందుకంటే ఆప్‌పై లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారంలో చేసిన లిక్కర్‌ స్కామ్‌, అవినీతి ఆరోపణలను రాజకీయ ప్రేరేపితమైనవిగా చెప్పిన కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాదననే వినిపించింది. హర్యానాలో కాంగ్రెస్‌ చేసిన తప్పే ఢిల్లీలో ఆప్‌ చేసింది. దీంతో బీజేపీ బాగా లబ్ధి పొందగా.. ఆప్‌ ఓటమికి పరోక్షంగా కారణమైంది. కలిసి నడవాల్సిన ఇండియా కూటమి పార్టీల విభేదాలను మోడీ ఎన్డీఏ పక్షాల భాగస్వామ్యపక్షాల సహకారంతో వరుస విజయాలు సాధించాడు. మోడీ నాయకత్వానికి తిరుగులేదు అని ఢిల్లీ ఫలితాలతో మరోసారి చాటిచెప్పాడు.

Tags:    
Advertisement

Similar News