మోదీ భారతం సంకుచితం

స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఆమె కలలు ఏమిటి? అవి ఏ మేరకు నెరవేరాయో వివ‌రించి చెప్పగలిగిన సుదీర్ఘ అనుభవం రొమిల్లా థాపర్‌కు ఉంది. ఆ తరం దేశం ఎలా ఉండాలని భావించింది, అలాగే ఉందా లేదా అన్న విషయాలు ఆమె మాటల్లోనే..

Advertisement
Update:2022-08-15 09:47 IST

దేశం బానిస సంకెళ్లు తెంచుకునే నాటికి ప్రసిద్ధ చరిత్రకారిణి రొమిల్లా థాప‌ర్‌కు 15 ఏళ్లు. ఇప్పుడామెకు 91 ఏళ్లు. అంటే దేశం స్వతంత్రమైన సమయంలో జరిగిన పరిణామాలు ఆమెకు లీలగానైనా తెలుసు. ఆ తరవాత నుంచి లెక్కేసినా ఆమె 75 ఏళ్లుగా దేశంలో పరిణామాలను గమనిస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఆమె కలలు ఏమిటి? అవి ఏ మేరకు నెరవేరాయో వివ‌రించి చెప్పగలిగిన సుదీర్ఘ అనుభవం రొమిల్లా థాపర్‌కు ఉంది. ది వైర్ కోసం క‌ర‌ణ్ థాప‌ర్ చేసిన ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆలోచింపచేసివిగా ఉన్నాయి. ఆ తరం దేశం ఎలా ఉండాలని భావించింది, అలాగే ఉందా లేదా అన్న విషయాలు ఆమె మాటల్లోనే..

మాకు ఊహ తెలుస్తున్నసమయంలో అనేక ఆశలు, ఆకాంక్షలు ఉండేవి. మన సమాజం మారుతుందని, ప్రజల జీవితాలు మారతాయని అనుకున్నాం. మనం వలసవాద పాలన నుంచి విముక్తమయ్యాం కనక అపారమైన ఉత్సాహం ఉండేది. అప్పటికి నేను పాఠశాల విద్య ఆఖరి సంవత్సరంలో ఉన్నాను. స్వాతంత్య్రం వస్తే మన తలరాత మారుతుందన్నఆశ ఉండేది. బడి వదలగానే మేం గాంధీ ప్రార్థనా సమావేశాలకు వెళ్లేవాళ్లం. ఆయన చెప్పే విషయాలు మాకు పూర్తిగా అర్థం అయి ఉండకపోవచ్చు. ఆగస్టు 15వ తేదీన బడిలో ఉత్సవం జరుగుతుందన్నారు. ఆ సమావేశం భారీస్థాయిలో ఉంటుంది. ఆ సమావేశంలో బ్రిటిష్ ప‌తాకాన్ని దించేసి, త్రివర్ణ పతాకాన్నిఎగురవేయడం, మొక్క నాటడం మొదలైనవి తీవ్ర ఉద్వేగం కలిగించాయి.

నేను అప్పుడు క్లాస్‌మీనిటర్ని. అందువల్ల నన్ను ప్రసంగించమన్నారు. ఈ మాట చెప్పిన తరవాత ఏం మాట్లాడాలి అని భయం వేసింది. చాలా ఆలోచించాను. మా ఉపాధ్యాయురాలు ఒకరు "భయం ఎందుకు? మీరు ఈ విషయాలు మీలో మీరు చర్చించుకుంటూనే ఉన్నారుగా. అదే చెప్పు" అన్నారు. ఆమె మా చరిత్ర అధ్యాపకురాలు కావడం యాదృచ్చికమే. నేను నా చిన్న ఉపన్యాసం రాశాను. మేం పిన్న వయసులో ఉన్నవాళ్లం. మేం ఒకగొప్ప, సమాజాన్నిమార్చే పరిణామాన్నిచూడబోతున్నాం అన్న అభిప్రాయం ఉండేది.

మా ముందు ఒక నూతన ప్రపంచం ఆవిష్కృతం కాబోతోంది. మేం ఇన్‌ఖిలాబ్ జిందాబాద్ లాంటి నినాదాలు చేసే వాళ్లం. ఆజాదీ అని నినదించే వాళ్లం. ఆజాదీ కమ్యూనిస్టు నినాదం. కానీ అందరి నోటా వినిపించేది. అప్పుడది జాతివ్యతిరేకమైంది ఏమీ కాదు. స్వాతంత్య్రం మాకే వచ్చిందనుకునేవాళ్లం. స్వాతంత్య్రం అంటే మేం ఏం చేయదలచుకున్నామో అది చేయగలం అనుకునేవాళ్లం. మన దేశంలో కుల, మత, జాతి, భాషాభేదాలు ఎక్కువ కనక స్వాతంత్య్రం ఎక్కువ కాలం నిలబడలేదన్న వాదన వినిపించేది. కానీ ఆ అనుమాన పీడితుల అభిప్రాయం తప్పని రుజువు చేశాం. దీనికి మూడు కారణాలు ఉన్నాయనుకుంటున్నాను.

ఒకటి: మనం చాలా వైవిధ్యం గలవాళ్లం. నా మిత్రులలో పంజాబీలు, మహారాష్ట్రులు, పార్సీలు, క్రైస్తవులు, ముస్లింలు, ఆంగ్లో ఇండియన్లు, వ్యాపారస్థుల, బ్రిటిష్ అధికారుల పిల్లలు - ఇలా అందరూ ఉండేవారు. మేం ఒకరింటికి మరొక‌రం వెళ్లేవాళ్లం. ఇదే భారత్ ప్ర‌త్యేక‌త‌. వైవిధ్యం మన బలహీనతకాదు. బలం. భారత సంప్రదాయాన్ని మనం పొరపాటుగా అర్థం చేసుకున్నాం. మనది ఏకాండీ వ్యవహారం అనుకున్నాం. కాని మనలో వైవిధ్యం ఎక్కువ. బహుళత్వం మనశక్తి. మన మతాలూ ఏకశిలా సదృశమైనవి కావు. మతాల్లో వివిధ శాఖలు ఉన్నాయి. అవి భిన్నమైన ఉద్యమాలకు దోహదం చేశాయి. మొత్తం దేశమంతటా ఉన్న మతం ఎప్పుడూ లేదు.

మా తరం మార్గదశకమైంది. ప్రయత్నిస్తే ఎవరైనా ఏమైనా చేయగలరనుకునేవాళ్లం. నెహ్రూ చాలా హుందా అయిన రాజకీయ నాయకుడు. అంత హుందాతనం ఉన్న ప్రధానమంత్రి మరొకరు లేరు. బాగా చదువుకున్నవాడు. చదివిన దాని గురించి తన భావాలు వెల్లడించేవారు. అందరిలాంటి వాడు కాడు. రాజకీయ నాయకులను జైల్లోపెడ్తే మంచి పనులు చేస్తారనుకుంటా. ఎక్కువ కాలం జైలులో ఉంటే వాళ్లు చదువుతారు, రాస్తారు. ఇతరులతో మాట్లాడతారు. నేనెప్పుడూ నెహ్రూను కలవలేదు. గాంధీని ఒక్కసారే చూశాను. ఆయన నాతో మాట్లాడింది ఒక్క వాక్యమే. నెహ్రూను నలుగురితో పాటు చూడడమే. అశోకుడి మీద నా పుస్తకం వచ్చినప్పుడు ఎవరో నెహ్రూకు ఆ విషయం మీద ఆసక్తి ఉంది. ఆయనకు పుస్తకం పంపకూడదా అన్నారు. నా పుస్తకాలు రాజకీయ నాయకులకు పంపడం నాకు ఇష్టం లేదు. వాళ్లు చదవరు. బాగా నచ్చచెప్పిన తరవాత నెహ్రూకు నా పుస్తకం పంపాను. "చదవడానికి మీకు సమయం ఉండకపోవచ్చు. కుదిరితే చదవండి"అని చిన్న నోటు కూడా రాశాను. వారం తరవాత ఆయన నుంచి నాకు ఉత్తరం వచ్చింది. త్వరలో నాకు చదివే అవకాశం రావొచ్చు. చదివిన తరవాత నా అభిప్రాయం చెప్తాను అని రాశారు. ఏ ప్రధానమంత్రి ఒక విద్యార్థికి లేదా ఒక అధ్యాపకురాలికి స్వయంగా ఉత్తరం రాస్తారు గనక!

నెహ్రూ వేసిన పునాదుల కారణంగానే మనం మనగలుగుతున్నాం. నేను ఆయన నిర్మించిన సౌధం అనడం లేదు. పునాది అంటున్నాను. ఆయన జాతీయతకు నిర్వచనం గురించి ఆలోచించారు. అనేక మందికి దీనిపై అనేక అభిప్రాయాలున్నాయి. సెక్యులర్, ప్రజాస్వామ్యం గురించి వివేచించారు. రాజకీయాల్లో మతప్రమేయం ఉండకూడదని పట్టుబట్టిన మనిషి ఆయన. మతం గొప్ప నమ్మకం లేదా విశ్వాసం కావచ్చు. కానీ రాజకీయాల్లోకి మతం రాకూడదు. ఈ విషయంలో నెహ్రూ గట్టిగా నిలబడ్డారు. సోమనాథ దేవాలయాన్ని పునర్నిర్మించినప్పుడు అప్పటి రాష్ట్రపతిని దేవాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. నెహ్రూ అభ్యంతర పెట్టారు. అయినా రాజేంద్రప్రసాద్ వెళ్లారు. అప్పుడు నెహ్రూ సరదాగా "ఈ దేశంలో నేనొక్కడినే సెక్యులర్ వ్య‌క్తినేమో" అన్నారు.

మనం నలభైయాభై సంవత్సరాలు సెక్యులర్ దేశంగా, ప్రజాస్వామ్యదేశంగా, సహనశీలంగా ఉండగలిగా మంటే అది నెహ్రూ చలవే. ప్రజాస్వామ్యం విషయంలో కూడా అప్పుడు పెద్ద చర్చే జరిగింది. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నచోట వయోజనులందరికీ ఓటుహక్కు కల్పించడాన్నివ్యతిరేకించారు. కానీ నెహ్రూ అంగీకరించలేదు. పౌరులందరూ ఒక్కటే అన్నారు. వయోజనులకు ఓటు హక్కు వల్ల మహిళలు, దళితులు, సవర్ణులు కాని వారికీ ఓటు హక్కు వచ్చింది.

దాదాపు అరవై ఏళ్ల పాటు ప్రోదిచేసిన విలువలను మోదీ హయాంలో వెనక్కు నెట్టేశారు. జాతీయోద్యమంలో అనుసరించిన విలువలను తోసేశారు. బ్రిటిష్ వారి హయాంలో మనం ముందు రాజుల అధీనంలో ఉన్నప్రజలం. బ్రిటిష్ చ‌క్ర‌వర్తికి లోబడి ఉన్నాం. స్వాతంత్య్రం తరవాత పౌరులమయ్యాం. పౌరులకు హక్కులు ఉంటాయి. ఈ మార్పును మనం పూర్తిగా అర్థంచేసుకోలేదు. పౌరుడు స్వేచ్ఛాజీవి. పౌరుడికి హక్కులు అంటే కూడు, గూడు, నీరు. చదువుకోవడానికి, ఆరోగ్య పరిరక్షణకు, ఉపాధికి హక్కు ఉండడం. సామాజిక న్యాయం అందడం. స్వాతంత్య్రం, రాజ్యాంగం మనకు వీటికి హామీలిచ్చాయి.

అయితే పాలకవర్గం ప్రజలను తమ అధీనంలో ఉంచుకోవాలనుకుంటుంది. పాలక వర్గం ప్రజాప్రతినిధుల ద్వారా పరిపాలిస్తుంది. ఈ పాలక వర్గాలు తాము సమాజం మేలు కోసమే పనిచేస్తున్నామని అనుకోవచ్చు. కానీ తమ ప్రయోజనాల కోసమే పని చేస్తారు. 1947లో 15 ఏళ్ల అమ్మాయిగా ఆశించిన సంక్షేమం ఆచరణలోకి రాలేదు. పాలకులు మనల్ని మోసం చేస్తూనే వచ్చారు. పేదరికం, కుల విభేదాలు ప్రజలను కుంగదీశాయి. వీటిని నిర్మూలించలేకపోయాం. కులాధిపత్యాన్ని కొంచెం కూడా తగ్గించలేకపోయాం. రాజకీయాధికారం, ఆర్థిక శక్తి కులాల అంతరువులకులోబడే ఉండి పోయింది. దళిత రాష్ట్రపతి, గిరిజన రాష్ట్రపతి కేవలం చిహ్నాలే. ఈ చిహ్నాలు సదుద్దేశంతో కూడినవి అయిఉండవచ్చు. కానీ ఆ పదవుల్లో ఉన్న వారు వాస్తవంగా మార్పు తీసుకురావడంలేదు. కేవలం ప్రతీకాత్మకంగానే మిగిలిపోతున్నారు. నిజంగా దళితులు, గిరిజనుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనుకుంటే దానికి అవసరమైన చట్టాలు తీసుకొచ్చేవాళ్లం. కులాధిపత్యం, పేదరికం లేకుండా చేసేవాళ్లం.

పౌరుల హక్కులు అమలవుతాయన్నహామీలేదు. కూడు, గూడు, మంచి నీరు లాంటి మౌలిక అవసరాలు తీర్చే పూచీలేదు. అందువల్ల ప్రజలు తమదారి తామే చూసుకోవాల్సి వస్తోంది. బతకాలి కనక ఏవో పాట్లు పడాలి. భారత్ పేదలకు అనుకూలమైన దేశం కాదు. పేదలను విస్మరించారు. పక్కకు నెట్టేశారు. వారిని సీరియస్‌గా పట్టించుకోరు. ప్రస్తుత పాలక వర్గం అవసరమైన మౌలిక మార్పులు తీసుకురావడంలేదు. కులం, పేదరికం దుష్ప్రభావం నిర్మూలించకపోయినా పెద్దమార్పు తీసుకురావడానికి సామాజిక, ఆర్థిక రంగాలలో గణనీయమైన మార్పులు రావాలి. ఆదివాసుల స్థితి ఎలా ఉందో చూడండి. కార్పొరేట్ సంస్థలు వారి భూములను కబళిస్తున్నాయి. వారికి భద్రత లేదు. పాలక పక్షం పేదరికం తగ్గించే స్థాయికి ఆర్థిక వ్యవస్థను దిద్దితీర్చాల్సింది. అది జరగడం లేదు. ఆ దృక్పథమే లేదు.

ప్రతి కంట కన్నీరు తుడవాలి అన్న గాంధీజీ మాటను పట్టించుకునేవారు లేరు. అధికార పక్షం పేదరికాన్ని అంతం చేసేస్థాయికి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలి. ఆ జాడేలేదు. ఆ దృక్పథమే మాయమైంది. ఆ దృక్పథం ఉండాలంటే భారత సమాజంలో మౌలిక మార్పురావాలి.

చరిత్ర రచనను ప్రస్తుత పాలకులు శీర్షాసనం వేయిస్తున్నారు. వలసవాదులు వచ్చి మీకు చరిత్ర ఏది అన్నారు. మీకు గ్రీకుచరిత్రకారులు, చైనా చరిత్రకారుల లాంటివారు లేరు. సరే మేం మీ చరిత్ర రాసిపెడ్తాం అన్నారు. జేమ్స్ మిల్ రాసిన భారత చరిత్రలో భారత్లో రెండు జాతులు - హిందూ, ముస్లిం జాతులు ఉన్నాయన్నాడు. ఆయన జాతులు అన్న మాట వాడాడు. ఈ రెండు జాతులూ ఎప్పుడూ కలహించుకుంటాయన్నాడు. 1817లో జేమ్స్ మిల్ చెప్పిన ఈ మాటను వలసవాద చరిత్రకారులు అదేపనిగా వల్లించారు. భారత మధ్యతరగతి వారు దీన్ని నమ్మారు. ఆ తరవాత మిల్ రాసింది తప్పా ఒప్పా అన్న చర్చ మొదలైంది. ఆయన వాదన పచ్చి అబద్ధం అని తెలుసుకున్నాం. నిజానికి హిందూ జాతీయత, ముస్లిం జాతీయత అన్న ప్రస్తావనే లేదు. అది వలసవాద కాలంలోనే వచ్చింది. హిందూజాతి, ముస్లింజాతి అనడానికి ఆధారమే లేదు.

కుతుబ్ మినార్‌కు మరమ్మతులు చేసినవారిలో హిందువులూ ఉన్నారు. రెండు మతాలవారు కలిసి మెలిసే పనిచేశారు. పశ్చిమ తీరంలో అరేబియా నుంచి వచ్చిన ముస్లిం వ్యాపారులు స్థానికులతో పూర్తిగా కలిసిపోయారు. స్థానికులను పెళ్లి చేసుకున్నారు. వారే ఖోజాలు, బోహ్రాలు మొదలైనవారు. అక్బర్ సైన్యాధిపతి హిందువు, పృథ్వీరాజ్ సైన్యాధి నేత ముస్లిం. ఈ రెండు సేనలూ పోరాడుకున్నాయి. ఇంక రెండు జాతులు అన్న తేడా ఎక్కడుంది? హిందుత్వవాదులు వలసవాద చరిత్రను భారత చరిత్ర అని ప్రచారం చేస్తున్నారు.

చరిత్ర రచనా పద్ధతులు సమూలంగా మారిపోయాయి. కేవలం శాసనాల‌లో, తాళపత్ర గ్రంథాల‌లో, లేదా ఇతర లిఖిత సాహిత్యమో మాత్రమే ఇప్పుడు చరిత్ర రచనకు ఆధారం కాదు. పురాతత్వ ఆధారాలు, జన్యు శాస్త్రం, పర్యావరణకు సంబంధించిన అంశాలు కూడా ఇవాళ చరిత్ర రచనకు ఉపకరణాలు అవుతున్నాయి. చరిత్ర ఇప్పుడు గతానికి పరిమితమైంది కాదు. వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే పరికరం. చరిత్ర రచనలో అభిప్రాయాలు మారవు అన్నరోజులుపోయాయి. గత ఏడెనిమిదేళ్లుగా చరిత్ర గ్రంథాలను తిరగరాయడం చరిత్ర వక్రీకరణే.

మోదీ ప్రస్తుతం ఒక మహాపురుషుడిగా కనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో చరిత్రకారులు ఆయనలో మానవ విలువలు అన్వేషిస్తారు. ఈ దృష్టితో చూస్తే ఆయనలో మానవీయ విలువలు కనిపించకపోవచ్చు. చరిత్ర మహాపురుషులు అని ప్రచారంలో ఉన్నవారిని అదే దృష్టితో చూడదు. బేరీజు వేస్తుంది. నిగ్గు తేలుస్తుంది. మోదీ నిర్మిస్తున్నాడంటున్న భారత్‌కు నచ్చడం లేదు. అది చాలా సంకుచితమైంది, పరిమితమైంది, ఏకపక్షమైంది. మోదీ భారతం స్వాతంత్య్రం వచ్చినప్పుడు మేం కలలగన్న భారత్‌ కాదు.

నా తరంవాళ్లు జాతీయోద్యమంలో ఉన్నఆకాంక్షలన్నీ నెరవేరుతాయిలే అనుకున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి జీవులు చట్టసభలు, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహకవర్గం పదిలంగా ఉంటాయి లెమ్మనుకున్నారు. వీటిని పరిరక్షించవలసిన బాధ్యతను మధ్యతరగతి నెరవేర్చలేదు.

Tags:    
Advertisement

Similar News