అధ్యక్షా..! అని పిలువాలని

ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నఅన్నిపార్టీల నేతలు

Advertisement
Update:2024-10-11 13:25 IST

రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీల పదవి కాలం మార్చి 29తో ముగియనున్నది. ఇందులో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు కాగా, ఒక పట్టభద్రుల నియోజకవర్గం ఉన్నది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కాంగ్రెస్‌ టి. జీవన్‌రెడ్డి పదవీ కాలం పూర్తికానున్నది. ఆ స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవడానికి కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనున్నది. పట్టభద్రుల స్థానం ఎన్నిక కసరత్తు ఈసీ ఇప్పటికే ప్రారంభించింది. ఓటర్ల జాబితా తయారీ కోసం షెడ్యూల్‌ ప్రకటించింది. డిసెంబర్‌ 12న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు.

సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరగొచ్చని అంటున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని గులాబీ పార్టీ అనుకుంటున్నది. పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసే వారి జాబితా పెద్దగానే ఉన్నది. ఇప్పటికే వారంతా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలిసి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి సర్దార్‌ రవీందర్‌సింగ్‌, ప్రముఖ డాక్టర్ బీఎన్ రావు, దేవీ ప్రసాద్‌ , గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, చిరుమల్ల రాకేశ్‌, రాజారాం యాదవ్‌ తదితరు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీజేపీ నుంచి సుగుణాకర్ రావు, రంజిత్ మోహన్, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, బాస సత్యనారాయణ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్‌ రెడ్డి, వెలిచాల రాజేందర్‌ రావు ప్రయత్నిస్తున్నారు.

2018లో బీఆర్‌ఎస్‌ బంపర్‌ మెజారిటీ గెలిచినా ఎమ్మెల్యేగా ఓడిపోయిన జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా భారీ మెజారిటీ గెలిచారు. ప్రస్తుతం రేవంత్‌ ప్రభుత్వ పది నెలల పాలనలో అన్నివర్గాల్లో అసంతృప్తి నెలకొన్నది. దీంతో ఈ పరిణామాలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. అందుకే ఆశావహులు ఆయా జిల్లాల్లోని ముఖ్యనేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. అధినేత ఆమోదిస్తే ప్రచారాన్ని ఉధృతం చేసుకోవచ్చు అని యోచిస్తున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీలు కూడా ఈ స్థానంపై దృష్టి సారించాయి. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని యత్నిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల నుంచి పోటీ చేయడానికి కీలక నేతలవరూ ముందు రావడం లేదని సమాచారం. ఎందుకంటే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేసేది నిరుద్యోగులు, ఉపాధ్యాయులు ఉంటారు. వారంతా కాంగ్రెస్‌ సర్కార్‌పై గుర్రుగా ఉన్నారు. అయితే కరీంనగర్‌కు చెందిన ఆల్ఫోర్స్‌ విద్యా సంస్థల అధినేత, విద్యావేత్త వి. నరేందర్‌రెడ్డి ఆయన కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆ సీటు కోసం ఆయనతో పాటు వెలిచాల రాజేందర్‌ రావు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు ఆపార్టీ నుంచి పోటీ చేస్తారన్న రానున్న రోజుల్లో తేలనున్నది. ఇక బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనని అనుకున్నది. కానీ కొన్నిరోజులుగా ఆపార్టీ అధికారపార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో ఒక్క అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నదనే విమర్శలున్నాయి. రైతులు, నిరుద్యోగులు, మహిళలు సహా అనేకవర్గాలు ఇప్పుడు బీఆర్‌ఎస్‌ వైపే చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో పది నెలల కిందటి పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని.. ప్రజలు మళ్లీ కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులతో పాటు అధికారపార్టీకి చెందిన నేతలు కూడా ఆప్‌ ది రికార్డ్‌ చెబుతున్నారట. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ఆసక్తి నెలకొన్నది.

Tags:    
Advertisement

Similar News