తెలంగాణపై కేటీఆర్ మార్క్ (బర్త్ డే స్పెషల్)

Advertisement
Update:2022-07-24 12:47 IST

కేటీఆర్.. ఈ పేరు చెప్తే చాలు సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు గుర్తు పట్టేస్తారు. ఒకవైపు పార్టీని నడిపించే బాధ్యత భుజాన వేసుకొని.. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు తీసుకొని రావడంలో ఎంతో కృషి చేస్తున్నారు. తండ్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమ సమయంలో విదేశాల నుంచి సొంత రాష్ట్రానికి వచ్చేశారు. అప్పటి నుంచి ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అహర్నిశలు రాష్ట్రం కోసం పని చేస్తూనే ఉన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నా.. చాలా మంది కేటీఆర్ మంత్రిగా తెలంగాణకు చేసిన సేవను మాత్రం పొగడకుండా ఉండలేరు. ఐటీ అంటే కేటీఆర్ అనేలా ఇప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. తండ్రి చాటు కొడుకు అనే మాట నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కేటీఆర్ పుట్టినరోజు ఇవాళ.

రాజకీయాల్లో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిదీ విభిన్నశైలి. వారి ఆలోచనా ధోరణి కూడా వేర్వేరుగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇద్దరూ ఒకటే లక్ష్యంగా ముందుకు సాగారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం భిన్న మార్గాల్లో పని చేశారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం, రాజకీయాల్లో ఎదురులేని పటిష్టత కోసం కేసీఆర్ పని చేశారు. రాజకీయ శత్రువులను బలహీన పరుస్తూ.. పార్టీని తెలంగాణలో తిరుగులేని శక్తిగా మార్చారు. అదే సమయంలో కేటీఆర్ మాత్రం రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల కోసం, యువత ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం ముందుకు సాగారు.

ఉద్యమకాలంలో ఒంటబట్టించుకున్న రాజకీయాన్ని పూర్తిగా వదిలేకకుండా అవసరమైనప్పుడు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూనే.. అభివృద్ధి పనుల విషయంలో చురుకుగా వ్యవహరించారు. విదేశాల్లో చదువుకున్న కేటీఆర్.. అక్కడి అభివృద్ధిని ప్రత్యక్షంగా గమనించారు. ఉద్యోగ అవకాశాలను ఎలా మెరుగుపరచాలనే విషయంలో ఒక స్పష్టమైన ప్రణాళిక ఏర్పరచుకున్నారు. యువత ఉద్యోగాల కోసమే కాకుండా.. ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యాపారవేత్తలుగా ఎదగాలని కోరుకున్నారు. అలా తెలంగాణ ఏర్పడిన తొలి ఏడాదిలోనే 'టి-హబ్' అనే వేదికకు అంకురార్పణ చేశారు. ఇది పూర్తిగా కేటీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిందే. ఏడేళ్లు తిరిగే సరికి 'టి-హబ్' ప్రపంచ స్థాయి స్టార్టప్‌లకు వేదికగా నిలిచింది. మరో దశ ఇటీవలే ప్రారంభమైంది.

కేవలం హైదరాబాద్‌కే ఐటీ పరిమితం కాకుండా కరీంనగర్, ఖమ్మం వంటి టూటైర్ నగరాలకు కూడా విస్తరించిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుంది. కేవలం ఐటీ రంగాన్నే కాకుండా ఫార్మా, ఆటోమొబైల్ వంటి రంగానికి చెందిన సంస్థల అభివృద్దికి కూడా ప్రత్యేక ప్రణాళిక రచించారు. ఐటీ మినిస్టర్‌గా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యక్రమాలుగా ఏర్పాటు చేసుకోవడంలో కేటీఆర్ పాత్రను విస్మరించలేము. ఫేస్‌బుక్, గూగుల్, అమెజాన్‌లు అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి. ఐకియా వంటి అంతర్జాతీయ సంస్థ కేవలం హైదరాబాద్‌లోనే ఉంది. ఇదంతా ఒక మంత్రిగా కేటీఆర్ చేసిందే అని కచ్చితంగా చెప్పవచ్చు.

కేసీఆర్‌తో కేటీఆర్‌ను పోల్చడం భావ్యం కాదు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే రాజకీయ వ్యాఖ్యలే ఎక్కువగా ఉంటాయి. స్థానిక నాయకుల నుంచి మోడీ వరకు ఎవరినీ వ‌దిలిపెట్టకుండా విమర్శిస్తుంటారు. కానీ కేటీఆర్ కనుక మీడియాతో మాట్లాడితే రాజకీయ విమర్శల కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎక్కువగా యువతకు అవసరమైన అవకాశాల గురించి చర్చిస్తుంటారు. రాజకీయ విమర్శలను ఎక్కువగా సోషల్ మీడియాకు పరిమితం చేస్తుంటారు. ఎన్నికల సమయంలో తప్ప ఎప్పుడూ బహిరంగ వేదికలపై రాజకీయ విమర్శలు చేసినట్లు కనపడరు. అదే కేటీఆర్‌ను ప్రత్యేకంగా మార్చిందని ఆయన అభిమానులు చెప్తుంటారు.

ఇక మంత్రిగా ఎప్పుడూ బిజీగా ఉన్నా.. సొంత నియోజకవర్గాన్ని మాత్రం మర్చిపోరు. అక్కడ చేనేత కార్మికుల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారు. మరోవైపు విభజన అనంతరం సినిమా పరిశ్రమ ఏపీకి తరలిపోతుందని వార్తలు వచ్చిన సమయంలో.. వారికి రాష్ట్రంలో తగిన మౌళిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ మాటిచ్చారు. వాటిని నెరవేర్చడంలో కేటీఆర్ పాత్ర ఉందని సినీ వర్గాలు చెప్తుంటాయి. ఇక సాయం కావాలని ఎవరైనా ట్వీట్ చేస్తే తన టీమ్‌ను అలర్డ్ చేసి తన దాతృత్వాన్ని చాటుకుంటారు. ఇలా ఎంతో మంది పేద విద్యార్థుల కాలేజీ ఫీజులను కేటీఆర్ స్వయంగా కట్టారు. ఒక ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా, మంత్రిగా, మంచి మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్న కేటీఆర్.. ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News