తెలంగాణ ఏం కోల్పోయిందో తెలిసింది
సీఎం తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు ప్రజల్లోకి వెళ్లి అడిగితే అది నిజమో? అబద్ధమో ఆయనకే అర్థమౌతుంది.
ఆయన ఇవ్వని నోటిఫికేషన్ల కు నియామక పత్రాలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఇవ్వని జర్నలిస్టుల ఇండ్ల స్థలాలను క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆయన కట్టని వాటిని అధికార మార్పిడి వల్ల రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. పదకొండు నెలల రేవంత్ పాలన క్లుప్తంగా సంక్షిప్తంగా ఇలా మూడు ముక్కల్లో చెప్పొచ్చు. ప్రజాభిప్రాయం కూడా ఇదే. అయితే నియామకాలపై సీఎం మాట్లాడే మాటలు చూసి నిరుద్యోగులు నవ్వుకుంటున్నారు. ఇంత పచ్చిగా అబద్ధాలు ఎలా ఆడుతున్నారని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ 7న కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పదకొండు నెలల కాలంలో ఎన్ని కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాల హామీని అటకెక్కించిందే కాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామకపత్రాలు ఇస్తూ నిత్యం వార్తల్లో నిలవడానికి రేవంత్ ఆరాటపడుతున్నారని విమర్శిస్తున్నారు.
ఏఎంవీఐ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసాలు దంచారు. పదకొండు నెలల కాలంలో తెలంగాణ సమాజం ఏం కోల్పోలేదు, కేసీఆర్ కుటుంబంలో నలుగురి ఉద్యోగాలు ఊడితేనే వేల మందికి కొలువు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని సీఎం తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాదు ప్రజల్లోకి వెళ్లి అడిగితే అది నిజమో? అబద్ధమో ఆయనకే అర్థమౌతుంది. ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యతగా ప్రజాసమస్యలను నిత్యం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నది. రైతుబంధు, రుణమాఫీ, గ్రామ పంచాయతీ దుస్థితి, గురుకులాల్లో విద్యార్థుల అవస్థలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగుల సమస్యలపై ప్రజల తరఫున ప్రభుత్వన్ని నిలదీస్తున్నది. హోం, విద్యా శాఖను తన వద్ద పెట్టుకున్నవీటి గురించి ఆలోచించడం లేదు. పట్టించుకోవడం లేదు. అంతెందుకు ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామకపత్రాలు అందించి తర్వాత కొన్నిజిల్లాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఏవో సాంకేతిక కారణాలు చెబుతుండటంతో నెలరోజులుగా వాళ్లు హైదరాబాద్, జిల్లా కేంద్రాల్లో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ల ఆవేదనకు సంబంధించిన వార్తలు నిత్యం పత్రికల్లో, మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటిని పరిష్కరించడానికి సీఎం కు సమయం లేదు. కానీ సొంత డబ్బా కొట్టుకోవడానికి నియామకపత్రాలు అందించడానికి.. అవన్నీ తానే ఇచ్చినట్లు చెప్పుకోవడానికి ప్రయాస పడుతున్నారు. పదకొండు నెలల రేవంత్ పాలన చూసి అన్నివర్గాల ప్రజలు నవ్వుకుంటున్నారు. తల పట్టుకుంటున్నారు. మార్పు పేరుతో మళ్లీ 2014 నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేనేత కార్మికులకు చేయూతనివ్వడానికి చర్యలు తీసుకున్నది. ఫలితంగా సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాలలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులకు ఉపాధి దొరికింది. నేతన్నల ఆత్మహత్యలు చాలావరకు తగ్గిపోయాయి. కానీ రేవంత్ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం ఇచ్చిన చీరల తయారీ ఆర్డర్‌ను రద్దు చేసింది. ఫలితంగా ఉపాధి కోల్పోయిన నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15మందికి పైగా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ ఏం కోల్పోయిందో నేత కార్మికుల ఆత్మహత్యలే రేవంత్ పాలనా వైఫల్యానికి నిదర్శనం. అలాగే రైతులు రైతుబంధు కోల్పోయారు. బోనస్ కోల్పోయారు. కనీసం మద్దతు ధర పొందలేక రోడ్లపై రైతులు రోడ్లపై రాస్తారోకోలు చేస్తున్నారు. మహిళలకు రూ. 2500 ఇస్తామన్న హామీ ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ప్రభుత్వం ఇచ్చే ఆ నగదు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు. దాని ద్వారా కుటుంబ అవసరాలు తీరుతాయని భావించారు. ఇక రుణమాఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది అన్నట్లు ప్రభుత్వ వైఖరి ఉన్నది. ఇలా ఒక్కటేమిటి కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలకు ఎనుముల రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎగనామం పెట్టిందని తేలిపోయింది.
ఇక జీవో 29 వల్ల గ్రూప్-1 లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని నిరుద్యోగ అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. ఈ జీవోను రద్దు చేయాలని, అలాగే ప్రిలిమ్స్‌లో కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవని కాబట్టి మెయిన్స్ ఎంపికలో 1:50 ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని వాళ్లు వాదిస్తున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ కేసు విచారణ సందర్భంగా మెరిట్ అంశాల దృష్టిలోకి వెళ్లకుండా నవంబర్ 20 లోగా ఈ కేసు ను ముగించాలని హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు కూడా ఇంతకుముందే తుది నియామకాలు కోర్టు తీర్పునకు లోబడే ఉండాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని పట్టించుకోకుండానే.. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో తెలియకుండానే డిసెంబర్‌లో గ్రూప్-1 నియామకపత్రాలు అందిస్తామని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల ప్రక్రియ మొదలైన తర్వాత.. ముందస్తుగా చెప్పకుండా నిబంధనలు మార్చడానికి వీల్లేదని ఇటీవల సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. నియామక ప్రక్రియ మొదలుకావడానికి ముందే ఒకసారి నియమ నిబంధనలు ఏర్పాటుచేసుకొంటే.. ఆ తర్వాత వాటిని మార్చడానికి వీల్లేదని పేర్కొంది. నియామక ప్రక్రియ నిబంధనలు ఎవరికి నచ్చినట్లు వారు మార్చడానికి వీల్లేదని న్యాయస్థానం పేర్కొంది. ఇవి కచ్చితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు అనుగుణంగా ఉండాలని పేర్కొంది. ఈ బెంచ్‌లో జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ పీఎన్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కచ్చితంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని బెంచ్ పేర్కొంది. మధ్యలో నిబంధనలు మార్చి అభ్యర్థులను ఇబ్బందిపెట్టకూడదని వెల్లడించింది. దీంతో 2008లో కె.మంజుశ్రీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బెంచి సమర్థించినట్లైంది. ఆ కేసు తీర్పు సరైనదని.. దానిని తప్పు అని చెప్పడానికి అవకాశం లేదని పేర్కొంది. ప్రభుత్వాలు నియామక ప్రక్రియకు ముందే నిబంధనలు సిద్ధం చేసి ఆ తర్వాతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని పేర్కొంది. చివరికి ఖాళీలను పూరించిన తర్వాత ఆ ప్రక్రియ ముగుస్తుందని తెలిపింది. ముందస్తుగానే మధ్యలో నిబంధనలు మారొచ్చని చెబితేనే.. దానికి అనుగుణంగా చేయవచ్చని వెల్లడించింది. అలాకానిపక్షంలో రూల్స్ మార్చే అవకాశమే లేదని తేల్చిచెప్పింది. కాబట్టి గ్రూప్-1 విషయంలో కోర్టు తుది తీర్పు రాకముందే డిసెంబర్‌లో నియామకపత్రాలు అందిస్తామని నిన్న సీఎం, మొన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సరికాదంటున్నారు.