ఫిరాయింపులపై, శాంతిభద్రతలపై జీవన్‌రెడ్డి జంగ్‌ సైరన్‌

రాజీవ్‌, రాహుల్‌ ఆలోచనా విధానాలకు విరుద్ధంగా రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయని ఆగ్రహం

Advertisement
Update:2024-10-22 22:10 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగిరెడ్డి దారుణహత్యకు గురయ్యాడు. ఈ హత్యకు నిరసనగా జగిత్యాల పాత బస్టాండ్‌ వద్ద తన అనుచరులతో కలిసి జీవన్‌రెడ్డి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర నాయకత్వం ఉలిక్కిపడింది. 1985లో రాజీవ్‌గాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టాక పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చారు. రాహుల్‌ గాంధీ కూడా ఫిరాయింపు చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని పార్టీ మారేవారి సభ్యత్వాలు వెంటనే రద్దు అయ్యేలా 10 షెడ్యూల్‌ మార్పులు తెస్తామని హామీ ఇచ్చారు. వారిద్దరి ఆలోచనా విధానాలకు విరుద్ధంగా రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో రెండు విషయాలు స్పష్టమైంది. ఒకటి రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయనేది. రెండోది ఫిరాయింపు రాజకీయాలు. ఈ రెండింటినీ దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తున్నసీనియర్‌ నేత తప్పుపట్టారు. ప్రజాపాలన పేరుతో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలే కాదు సొంతపార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో పీసీసీ చీఫ్‌ హుటాహుటిన ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ను అక్కడికి పంపించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మహేశ్‌కుమార్‌ మాట్లాడుతుండగానే.. జీవన్‌రెడ్డి ఫోన్‌ అడ్లూరికి ఇచ్చేశారు.

కేసీఆర్‌ చేశారు కాబట్టి మేము చేస్తున్నామంటున్న పార్టీ నేతల వైఖరిని ఆయన తప్పుపట్టారు. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి సంఖ్యా బలం ఉన్నదని, సీపీఐ, ఎంఐఎం సభ్యుల మద్దతు కలుపుకుంటే (65+1+8= 74) ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదన్నారు. ఒకవేళ ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే స్పీకర్‌ వెంటనే అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నదని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, విలువలు ముఖ్యమన్నారు. నిజానికి కాంగ్రెస్‌ నేతలు పొద్దున లేస్తే కేసీఆర్‌ విధానాలనూ విమర్శిస్తూనే కాలం వెళ్లదీస్తున్నారు. అంతేతప్పా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి, ప్రజలు తమ పాలన గురించి ఏమనుకుంటున్నారు అన్నది మరిచిపోయారు. బీఆర్‌ఎస్‌ పార్టీని ఖతం చేయాలనే రేవంత్‌ రెడ్డి తన వ్యక్తిగత అజెండాను అమలు చేసే క్రమంలో కాంగ్రెస్‌పార్టీని డిఫెన్స్‌లో పడేశారు. ఫిరాయింపులపై ఆపార్టీ జాతీయ నాయకత్వ వాదనకు విరుద్ధంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల సొంతపార్టీ నేతల నుంచే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు, పార్టీ శ్రేణుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైన విషయం మనకు తెలిసిందే. జగిత్యాలలోనూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడాన్ని, అంతకుముందు పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తీసుకోవడాన్ని జీవన్‌రెడ్డి ఆక్షేపించారు. అయినా రేవంత్‌రెడ్డి సీనియర్ల మాటలను పరిగణనలోకి తీసుకోకుండా తన రాజకీయం తాను చేశాడు. హైకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయానికి ఆదేశాలు వచ్చిన తర్వాత మాట మార్చాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా సీఎం పరిస్థితి తయారైంది.

అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే అటు ప్రజల్లో ఇటు సొంతపార్టీలో ఇంత డ్యామేజీ ఎదుర్కొన్న సీఎం బహుశా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి అనుభవంలో లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పాలనపై దృష్టి సారించకుండా పీఆర్‌ స్టంట్స్‌లతో రోజుకో ప్రకటనతో ప్రజలనే కాదు.. సొంతపార్టీ నేతలనే అయోమయానికి గురిచేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, శాంతిభద్రతలు క్షీణించాయని అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యే సబితా రెడ్డి అనేక ఉదంతాలను ప్రస్తావిస్తే ఆమెను కించపరిచేలా సీఎం మాట్లాడారు. ఇప్పుడు జీవన్‌రెడ్డి కూడా అదే విషయాన్ని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో కాంగ్రెస్‌ వాళ్లకే రక్షణ లేదన్నారు. ఆయన వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉన్నదో తెలుస్తోంది. తన ప్రధాన అనుచరుడు హత్య గురవడంతో ఆవేదనతో ఆయన సొంతపార్టీపైనే విమర్శలు చేశాడని అనుకోవడానికి లేదు. ఫిరాయింపు రాజకీయాలపై, శాంతిభద్రలపై ప్రజలు, విపక్షాలు ఏం చెబుతున్నాయో అదే విషయాన్ని జీవన్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. అన్ని తెలిసినా ఇంకా మా వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటాం. ప్రధాన ప్రతిపక్షంపై, కేసీఆర్‌పై నిత్యం బురద చల్లుతూ రోజులు గడిపేస్తామని భావిస్తే ప్రజా పాలనపై ఇప్పుడున్న ప్రజాగ్రహం సమయం వచ్చినప్పుడు బైటపడుతుంది.

Tags:    
Advertisement

Similar News