మ‌ట్టిలో మాణిక్యాల‌ను వెలికితీయ‌డానికి.. జ‌గ‌న‌న్న స్పోర్ట్స్‌ క్ల‌బ్‌లు

రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి క్రీడల్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఏ ఆటలో ప్రతిభ ఉన్నా, వారిని మరింత సానపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఆ ఆటలో వారు మరింత రాటుదేలేలా శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపనుంది.

Advertisement
Update:2022-09-13 13:35 IST

నీలో ఆటాడే సత్తా ఉందా.. ఉంటే చూపించు.. సాధించు.. అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. గ్రామ స్థాయి నుంచే ప్రతిభ ఉన్న క్రీడాకారుల్నిగుర్తించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం జగనన్న స్పోర్ట్స్‌ క్ల‌బ్‌లు ఏర్పాటు చేస్తోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిరంతరం క్రీడా పోటీలు నిర్వహిస్తూ ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురానుంది.

రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి క్రీడల్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఏ ఆటలో ప్రతిభ ఉన్నా, వారిని మరింత సానపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఆ ఆటలో వారు మరింత రాటుదేలేలా శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపనుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) పర్యవేక్షణలో జగనన్న స్పోర్ట్స్‌ క్ల‌బ్‌లు నిర్వహించనుంది. దీనికి సంబంధించి విధివిధానాలతో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 25కు పైగా క్రీడాంశాల్లో ఈ క్లబ్బుల్ని గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తారు. ఆడగలిగిన, ఆసక్తి ఉన్నవారంతా ఈ క్లబ్బులో చేరవచ్చు. ఈ క్లబ్బుల్ని పంచాయతీ స్పోర్ట్స్‌ అథారిటీ (పీఎస్ఏ), మండల స్పోర్ట్స్‌ అథారిటీ (ఎంఎస్ఏ) పర్యవేక్షిస్తాయి. స్థానికంగా నిధులు సమకూర్చుకుంటూ వసతుల్ని మెరుగుపరుస్తాయి. మరుగుపడిన గ్రామీణ క్రీడల్ని కూడా వెలుగులోకి తీసుకొస్తాయి.

3 నెలలకు, 6 నెలలకు పోటీలు

పంచాయతీ స్పోర్ట్స్‌ అథారిటీ, మండల స్పోర్ట్స్‌ అథారిటీలు ప్రతినెలా సమావేశమై క్రీడా క్యాలెండర్ అమలు తీరును సమీక్షిస్తాయి. 3 నెలలకు ఒకసారి మండల స్థాయిలోను, 6 నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలోను క్రీడాపోటీలు నిర్వహిస్తాయి. అక్కడ ప్రతిభ చూపినవారికి శాప్ ఆధ్వర్యంలో మరింత శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ పోటీలకు తయారు చేస్తారు.

క్రీడాయాప్‌లో నమోదు, నిర్వహణ ఇలా..

గూగుల్ ప్లే స్టోర్‌లో జగనన్న స్పోర్ట్స్‌ క్ల‌బ్‌లు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి క్రీడాకారుడు తాను ఆడే ఆట, చిరునామా తదితర వివరాలు నమోదు చేయాలి. యూజర్ నేమ్, పాస్ వర్డ్ గుర్తుంచుకోవాలి. కొత్త క్లబ్బును ఏర్పాటు చేయాలనుకున్న క్రీడాకారుడు ఈ యాప్‌లో ఏర్పాటు చేయవచ్చు. మరొకరి క్లబ్బులో సభ్యుడిగా చేరవచ్చు. ఈవెంట్లు నిర్వహించదలచినవారు ఆ వివరాలు నమోదు చేయవచ్చు. ఈ వివరాలతో రాష్ట్రవ్యాప్త క్రీడాకారుల వివరాలు అందరికీ అందుబాటులో ఉంటాయి.

క్రీడాకారులకు ఉజ్వల భవిత

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలతో రాష్ట్రంలో క్రీడాకారుల భవిత ఉజ్వ‌లంగా వెలగనుంది. ప్రణాళికాబద్ధంగా గ్రామ స్థాయి నుంచే ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారు. మంచి శిక్షణతో మరింత రాటుదేలతారు. తద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరింత వెలుగులీనుతుంది.

Tags:    
Advertisement

Similar News