దేశ ఆర్థిక వ్యవస్థకు దారి చూపిన ఆర్థికమేధావి

సంస్కరణలు, సంక్షేమంతో పదేళ్లు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన మన్మోహన్‌

Advertisement
Update:2024-12-27 15:43 IST

వంద రోజుల ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం రూపంలో దేశ పౌరులకు అందిన అదనపు శక్తి గుర్తుకు వస్తాయి. విద్యాహక్కు చట్టంతో దేశంలోని ప్రతి చిన్నారి స్కూల్‌లో చదువుతున్న వాస్తవం కనిపిస్తుంది. అమెరికాతో అణు ఒప్పందం ద్వారా విశ్వ యవనికపై భారత ఖ్యాతి ఇనుమడింపజేసిన ఘటన జ్ఞప్తికి వస్తుంది. పాకిస్థాన్‌ నుంచి శరణార్థిగా భారత్‌కు వచ్చిన భారతావనికి అత్యంత మౌనంగా మన్మోహన్‌సింగ్‌ అందించిన అత్యంత ఘన విజయాలుభారత దేశ 13వ ప్రధానిగా పనిచేసిన ఆయన యావత్‌ దేశం గర్వించేలా మౌనంగా అనేక ఘనతలు సాధించారు. అంతే మౌనంగా ఆ గుర్తులను మనకు వదిలిపెట్టి తాను దివికేగారు.

అధ్యాపకుడిగా పనిచేసి

భారత ప్రధాని పదవి చేటప్టిన తొలి హిందువేతర వ్యక్తిగా డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ రికార్డు సృష్టించారు. 1932 సెప్టెంబర్‌ 26న ప్రస్తుత పాకిస్థాన్‌లోని పశ్చిమ పంజాబ్‌లో గుర్‌ముఖ్‌ సింగ్‌, అమ్రిత్‌కౌర్‌ దంపతులకు జన్మించారు. పుట్టిన కొన్నిరోజులకే తల్లిని కోల్పోయి అమ్మమ్మ దగ్గర పెరుగుతున్న మన్మోహన్‌కు దేశ విభజన మరో విపత్తును తెచ్చిపెట్టింది. దేశ విభజనతో కుటుంబంతో కలిసి 1947లో అమృత్‌సర్‌కు వచ్చిన మన్మోహన్‌ పంజాబ్‌లోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. 1962లో ఆక్స్‌ ఫర్డ్‌ నుంచి ఆర్థికశాస్త్రంలో డి_ఫీల్డ్‌ పట్టా సాధించారు. భారత దేశ ఎగుమతులపై విమర్శనాత్మక ధోరణిలో 1964లో పుస్తకం రాశారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత పంజాబ్‌ వర్సిటీలో, ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అధ్యాపకుడిగా పనిచేశారు.

ఆర్థిక రంగానికి నవశకాన్నిపరిచయం చేసిన పీవీ-మన్మోహన్‌ జోడి

1970లలో ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా నియమితులై పలువురు ప్రధానులతో పనిచేశారు. 1976-80 వరకు రిజర్వు బ్యాంకు డైరెక్టర్‌గా సేవలు అందించారు. ప్రణబ్‌ముఖర్జీ ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో1982-85 వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు విధులు నిర్వర్తించారు. 1987- 90 వరకు యూఎన్‌ జనరల్‌ సెకట్రరీ ఆఫ్‌ సౌత్‌ కమిషన్‌ నుంచి జెనీవా నుంచి మన్మోహన్‌ పనిచేశారు. 1991లో పీవీ హయాంలో ఆయన క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. వీరిద్దరి జోడి ఆర్థిక రంగానికి నవశకాన్నిపరిచయం చేసింది. ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరింది. ఈ దశలో మన్మోహన్‌ రూపాయి విలువను తగ్గించడం సహా పన్నులను కుదించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడుల ఆహ్వానం వంటి వినూత్న సంస్కరణలతో భారత ఆర్థికవ్యవస్థకు చోదక శక్తిని అందించి పరుగులు పెట్టించారు.

తొలి హిందుయేతర ప్రధానిగా రికార్డు

1991లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజ్యసభకు నామినేట్‌ అయిన మన్మో హన్‌ 1996 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1991లో మధ్యంతర బడ్జెట్‌ ఒక పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి ప్రవేశపెడితే ఆ ఆర్వాత విత్త మంత్రిగా నియమితులైన మన్మోహన్‌ పూర్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆ విధంగా ఒకే ఏడాది ఇద్దరు ఆర్థిక మంత్రులు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 1999లో లోక్‌సభకు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 1998-2004 వరకు రాజ్యసభలో విపక్ష నేతగా పనిచేశారు. 2004-2014 వరకు సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. 2004లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్‌ భారత తొలి హిందుయేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. 2009లో మరోసారి కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ-2 అధికారంలోకి రాగా..మన్మోహనే ప్రధానిగా ఐదేళ్ల పాటు పనిచేశారు.

ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన మన్మోహన్‌ ప్రధానిగానూ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి అనేక కీలక పథకాలు ప్రవేశపెట్టి పేద భారతానికి అండగా నిలిచారు. మన్మోహన్‌ ప్రధానిగా పనిచేసిన మొదటి ఐదేళ్లలో (2004-09) వృద్ధి రేటు 8- 9 శాతం మధ్య నమోదైంది. 2007లో అత్యధికంగా 9 శాతం నమోదు చేసింది. వాజ్‌పేయీల హయాంలో హైవేల నిర్మాణం కోసం తీసుకొచ్చిన స్వర్ణ చతుర్భుజి కార్యక్రమాన్ని మన్మోహన్‌ సింగ్‌ కొనసాగించారు. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో సంస్కరణలు కొననసాగించారు. రైతుల రుణాల మాఫీ సహా, పరిశ్రమల అనుకూల విధానాలతో మన్మోహన్‌ ముందుకు వెళ్లారు.

ఉపాధి హామీ పథకంతో పేదలకు పని కల్పించి

2005లో మన్మోహన్‌ సర్కార్‌ సంక్లిష్టంగా ఉన్న అమ్మకం పన్ను స్థానంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)ను తీసుకొచ్చింది. ఇదే ఏడాదిలో ప్రత్యేక ఆర్థి మండళ్లు- సెచ్‌లకు కూడా అంకురార్పణ జరిగింది. 2006లో చట్టంగా తీర్చిదిద్దారు. ఈ సెజ్‌లతో ఆర్థిక వ్యవస్థలో వేగం పెరిగింది. ఉద్యోగ కల్పన పెరిగింది. 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా తీసుకొచ్చింది. దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిలో కనీసం వంద రోజుల పాటు ప్రజలకు పని కల్పించి కరువు రోజుల్లో పేదలను ఆదుకున్నారు. 2006లో ఇది చట్టం రూపంలోకి వచ్చింది. 2008 నుంచి దేశవ్యాప్తంగా అనేక జిల్లాలు ఈ పథకంలో భాగమయ్యాయి. 2005లోనే సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థల్లో జరిగే ప్రతి అంశంపై దేశ ప్రజలకు సమాచారం దఖలు పడే అవకావం లభించింది. 2009లో ప్రతి ఒక్కరికీ చదువుకునే హక్కు కల్పిస్తూ మన్మోహన్‌ సర్కార్‌ తీసుకొచ్చిన చట్టంలో దేశంలో బాలబాలికలకు బడి దగ్గరైంది. 2006-07 మధ్య కాలంలో భారత వృద్ధి రేటు 10.08 శాతాన్ని నమోదు చేసింది. 1988-89 రాజీవ్‌గాంధీ హయాంలో దేశంలో 10.2 శాతం వృద్ధి రేటు నమోదై రికార్డు సృష్టించిన తర్వాత మళ్లీ మన్మోహన్‌ హయాంలోనే ఈ స్థాయిలో ఆర్థిక వృద్ధి రేటు నమోదు చేయడం గమనార్హం.

మౌనంగానే తానేమిటో సత్తా చాటిన మన్మోహన్‌

మన్మోహన్‌ దేశీయంగానే కాకుండా అంత్జాతీయంగా తన సత్తా ఏమిటో మౌనంగా చాటిన ఘటన భారత్‌-అమెరికా మధ్య జరిగిన అణు ఒప్పందమే తెలియజేస్తుంది. 2005లో జార్ఝ్‌ వాషింగ్టన్‌ బుష్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2008లో అమెరికాలో ఇది చట్టరూపంలోకి వచ్చింది. 2009లో మన్మోహన్‌ అమెరికా కు వెళ్లిన సమయంలో అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రోటోకాల్‌ పక్కన పెట్టి వైట్‌హౌస్‌ వెలుపలికి వచ్చి మరి మన్మోహన్‌ను అత్యంత ప్రేమ పూర్వకంగా వీడ్కోలు పలికిన ఘటన ప్రపంచ దేశాల్లో మన్మో హన్‌ పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. 2002లో ఉత్తమ పార్లమెంటేరియర్‌ అవార్డు అందుకున్న మన్మోహన్‌ సింగ్‌ టై మ్‌ పత్రిక ప్రచురించిన ప్రపంచాన్ని ప్రభావితం చేసే వంద మంది వ్యక్తుల జాబితలోనూ చోటు దక్కించుకున్నారు. 2010లో ప్రపంచ రాజనీతిజ్ఞ పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్లు కూడా పొందారు.

మన్మోహన్‌ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సాకారం

సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో దేశాన్నిసంస్కరణలతో ముందుకు నడిపించిన మన్మోహన్‌ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం గొప్ప విషయం. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటుకు వారు అందించిన సహకారానికి యావత్‌ ప్రజానీకం సదా సర్మించుకుంటుంది. ఆర్థికంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా తెలంగాణ బిడ్డ తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో మన్మోహన్‌ పరిణతి కనబరిచారు. మిత భాషిగా, అత్యంత సౌమ్యుడిగా పేరొందిన మన్మోహన్‌ స్థితప్రజ్ఞత కలిగిన నేతగా దేశానికి అందించిన సేవలు చాలా గొప్పవి. మౌనంగానే తన పని తాను చేసుకుంటూ ఈ దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠమడానికి, ఇవాళ ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి నాడు ఆయన వేసిన పునాదులే కారణమంటే అతిశయోక్తి కాదు. అల్విదా డాక్టర్‌ మన్మోహన్‌ జీ..

Tags:    
Advertisement

Similar News