కేసీఆర్‌ను ఓడించ‌డానికి `ప‌గ‌` ఒక్క‌టే స‌రిపోతుందా ఈటల‌..?

ఈటల రాజేందర్ టిఆర్ఎస్ నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండడం వేరు. ఆయనకు ఆ సమయంలో లభించిన ప్రజాదరణ, కార్యకర్తలలో ఉండిన అభిమానం వేరు. అది తెలంగాణ ఉద్యమంతో, భావోద్వేగాలతో ముడిపడిన వ్యవహారం.

Advertisement
Update:2022-07-28 06:00 IST

''ఈ జన్మలో కేసీఆర్ ను ఓడించకపోతే నా ఈ జన్మ వృథా'' అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.''కేసీఆర్ బ్రతికుండానే టీఆర్ఎస్‌ను చంపుతాం'' అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ 2019 లో అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈటల రాజేందర్ పెంచుకున్న పగ, ప్రతీకారాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఆయన కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ కు గురవడం, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఉపఎన్నికల్లో హుజురాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించడం.. వంటి ఘటనలన్నీ వేగంగా జరిగిపోయాయి. ఇప్పుడాయన ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేర్చుకోవడానికి ఏర్పాటు చేసిన కమిటీకి కన్వీనర్. అందువల్ల ఆయన ఆ విధుల్లో ఉన్నారు.

'' టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు'' అని ఈటల రాజేందర్ ఒక రాయి విసిరారు. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చాలాకాలంగా ఇలాంటి 'రాళ్లు'విసురుతూ ఉన్నారు. కానీ వాళ్లు ఆశించినట్టుగా ఫలితాలు కనిపించడం లేదు. ఈటల చెబుతున్నదంతా బూటకం కాకపోవచ్చు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో, ప్రముఖ నాయకుల్లో.. అభద్రతాభావానికి గురవుతున్న వారు, 2023 ఎన్నికల్లో తమకు టికెట్టు రాదేమోనని అనుమానిస్తున్న వారు 'పక్కక చూపులు' చూస్తూ ఉండవచ్చు. తమ రాజకీయ భవిష్యత్తును బీజేపీ, కాంగ్రెస్ లలో వెతుక్కుందామని అనుకుంటున్నవాళ్ళు కొంతమంది భావిస్తుండవచ్చు. ఇందులో అభ్యంతరకరమైనదేమీ లేదు. ఎన్నికల రాజకీయాలు, పదవులు, అధికార వ్యామోహం వంటి వలయంలో చిక్కుకున్న నాయకులకు పార్టీ ఫిరాయింపులు పెద్ద విషయమేమీ కాదు. ఏ పార్టీ కారణంగా, ఏ పార్టీ జెండా పైన, ఏ పార్టీ గుర్తు పైన గెలిచామన్నది సమస్యే కాదు.'లాభనష్టాల'ను మాత్రమే లెక్కలు వేసుకొని రాజకీయాలు నడిపే రోజులివి. రాజకీయ విధానాలు, సైద్ధాంతిక వ్యవహారాల పట్ల నిబద్దత, అంకితభావం లేకపోవడం ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర.

''బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణ చాల ప్రత్యేకంగా పారిపాలన కొనసాగుతోంది. ఏమీ లేనోనికి ఏతులు, నామాలు ఎక్కువ'' అని కేసీఆర్ మూడేండ్ల కిందట అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ వేగాన్ని రెండు దశలుగా విభజించాలి.

1. అనూహ్యంగా నాలుగు పార్లమెంట్ స్థానాలను గెల్చుకోవడం.

2 దుబ్బాక,హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయం.

రెండో దశ బీజేపీకి ఊపిరి పోసింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఇక ఎంతో సమయం పట్టదని ఆ పార్టీ భావిస్తోంది. హుజూరాబాద్ కు ఉపఎన్నిక రావడానికి దారితీసిన పరిస్థితులు వేరు, ఈటల రాజేందర్ గెలుపునకు తోడ్పడిన అంశాలు వేరు. హుజూరాబాద్ ఫలితమే తెలంగాణ అంతటా ప్రతిబింబిస్తుందని అంచనా వేయడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక నియోజకవర్గం పరిస్థితులు, రాజకీయ బలాబలాలతో మరో నియోజకవర్గాన్ని పోల్చడం సరికాదు. ఈటల వంటి బలమైన నాయకులు బీజేపీలో అరుదుగా ఉన్నారన్నది ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. బలమైన అభ్యర్థుల గాలింపు చర్యల్లో భాగంగానే ''టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో'' ఉన్నారన్న ప్రచారం ఉధృతం చేస్తున్నారు. ఇదొక మైండ్ గేమ్ అనే సంగతి కేసీఆర్ కు తెలుసు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను గందరగోళపరచడం, మానసికంగా అస్థిరపరచడం, కాంగ్రెస్ వైపు, లేదా బీజేపీ వైపునో చూస్తున్న వాళ్ళను ఆకర్షించడం.. అనే కార్యాచరణ ప్రణాళికను బీజేపీ అమలుచేస్తోంది.

టీబీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ కదన కుతూహలంతో కనిపిస్తున్నారు. అయితే ఆయన మాటల్లో కొన్ని సార్లు నిస్పృహ, నిర్లిప్తత కూడా వ్యక్తమవుతున్నాయి. ఈటల రాజేందర్ బీజేపీ తరపున గెలిచిన క్షణంలో, ఆ ఊపులో ఇక టిఆర్ఎస్ నుంచి భారీ వలసలు ఉంటాయని అమిత్ షా, నడ్డా భావించారు. కానీ అలాంటిదేమి జరగలేదు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పి చైర్ పర్సన్ తుల ఉమ మినహా పెద్దగా పేరున్న, పరపతి క‌లిగిన నాయకులెవరూ టిఆర్ఎస్ నుంచి కదలలేదు. ఈటల రాజేందర్ కృషి ఫలించలేదు. ఆయన ప్రయత్నాలు నెరవేరలేదు. అధికార పార్టీ నుంచి వలసలు లేకపోవడం ఈటలను నిరుత్సాహపరచింది. ఇందుకు కారణం ఆయన తనను తాను ఎక్కువగా అంచనా వేసుకోవడమే!

ఈటల రాజేందర్ టిఆర్ఎస్ నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండడం వేరు. ఆయనకు ఆ సమయంలో లభించిన ప్రజాదరణ, కార్యకర్తలలో ఉండిన అభిమానం వేరు. అది తెలంగాణ ఉద్యమంతో, భావోద్వేగాలతో ముడిపడిన వ్యవహారం. ఆయన పార్టీ మారవలసిన కారణాలతో పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధం లేదు. పైగా ఈటల రాజేందర్ కు తెలంగాణ అంతటా సొంత 'నెట్ వర్క్' లేదు. అందుకే ముదిరాజ్, రెడ్డి సామాజిక వర్గాలను ఆలంబనగా చేసుకొని ఆయన తన నెట్ వర్క్ ను విస్తరించుకోవాలని అనుకుంటున్నారు.

తెలంగాణాలో బీజేపీ హైకమాండ్ తరచూ రహస్య సర్వేలు జరుపుతోంది. సరే, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిందనే అనుకుందాం. ఏమి జరగనుంది..? అనే ప్రశ్నకు ఈటల జవాబు చెప్పాలి. హైదరాబాద్ ను భాగ్యనగర్ గా పేరు మార్చడం వంటి నినాదాలు మినహా బీజేపీ దగ్గర ఉన్న ఎజండా ఏమిటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనపై ఈటల రాజేందర్ స్పందన ఏమిటి ? ఐటిఐర్ ప్రాజెక్టుకు ఒక్క రుపాయి కూడా కేంద్రం నుంచి ఇవ్వకపోవడంపై స్పందన ఏమిటి ? ఇక రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు గల్లంతు అవుతాయని సాధారణ ప్రజల్లో ఉన్న ప్రచారం పట్ల స్పందన ఏమిటి? ఈ పథకాలు అమల్లో ఉంటాయా? ఉండవా ?

''తిట్ల పురాణాలు, అవమానకరమైన భాష మాట్లాడిన వారంతా కేసీఆర్ బానిసలు. 2004 లో 26 మంది గెలిస్తే అందులో నేను ఒకన్ని. 2008 లో- 16 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే కేవలం గెలిచింది 7 మంది. 2009 - 53 సీట్లకు పోటీ చేస్తే.. పట్టుమని పది మంది గెలిస్తే నేను గెలిచిన. 2010లో 76 వేల మెజారిటీ తో గెలిచిన. 2014 లో గెలిచిన. 2018 ఎన్నికల్లో ఓడగొట్టడానికి కాంగ్రెస్ అభ్యర్థికి డబ్బులు ఇచ్చినా కూడా గెలిచిన. నా ఇంటి మీద ఎన్నికల అధికారులు దాడి చేశారు. నా మీద అన్నీ సంస్థలకు కంప్లయింట్ ఇప్పించారు. ఇన్ని చేసినా కూడా హుజూరాబాద్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని గెలిపించారు. నన్నే కాదు మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ లో మరికొంత మందిని ఓడించడానికి ఇలాంటి ప్రయత్నమే చేశారు. నేను ఇప్పటివరకు అసభ్యపదజాలంతో మాట్లాడలేదు.

తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ పాత్ర ఎంత? ఈటల రాజేందర్, హరీష్ రావు పాత్ర ఎంత ?తెలంగాణ ప్రజలకు తెలుసు. నా ప్రతిష్ట ఓర్వలేక చిల్లర ఆరోపణలు చేసి నన్ను బయటికి పంపారు. నామీద యుద్దం చేసింది కేసీఆర్, హరీష్ రావు. సత్యహరిచంద్రుని పాలన అయితే 600 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశావు. 2 లక్షల కోట్ల రూపాయల దళిత బంధు స్కీం ప్రవేశ పెట్టి.. ప్రమాణాలు చేయించుకున్నారు. గొల్ల కురుమలను కోమరెళ్ళి మల్లన్న మీద ప్రమాణం చేయించారు. నాకు కనీసం ప్రచారం చేసుకొనే అవకాశం ఇవ్వలేదు. ఇన్ని చేసినా కేసీఆర్ గారికి కర్రు కాల్చి వాత పెట్టారు నా హుజూరాబాద్ ప్రజలు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం అని అమిత్ షా సవాలు చేశారు. దమ్ముంటే రా.. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయింది. పాతాళంలో పాతర వేస్తారు. బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు? ఒక ప్రాంతీయ పార్టీకి 450 కోట్ల స్థిర నిల్వలు ఎలా వచ్చాయి? మొన్న హుజూరాబాద్ లో ఓడిపోయింది కేసీఆర్'' అంటూ బాల్క సుమన్ తదితర అధికారపార్టీ ఎమ్మెల్యేలపై ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు.

ఇట్లా విరుచుకుపడితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై స్వైర విహారం చేస్తే వాళ్ళంతా బెదిరిపోతారనో, టీఆర్ఎస్ లో తిరుగుబాటు జరిగి బీజేపీలో చేరిపోతారనో ఈటల అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఈ తరహా ప్లానింగ్ వర్కవుట్ కాదేమో! కేసీఆర్ ప్రభుత్వంపైన, కేసీఆర్ కుటుంబంపైన ప్రజలలో అసలు వ్యతిరేకత లేదని ఎవరూ చెప్పలేరు. కొన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి, నిరాశ ఎనిమిదేండ్ల పాలనలో లేకుండా ఉండవు. అయితే కేసీఆర్ కు 'వ్యతిరేకంగా గాలి బలంగా వీస్తోంద'నడానికి ఆధారాలేమీ లేవు. వ్యతిరేక గాలి ఉన్నట్టు కనిపించినా ఎమ్మెల్యేలు బీజేపీలోకే ఎందుకు వెళతారు? కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్ళరు? 2023 నవంబర్ లో ఎన్నికలు జరగనుండగా 2023 జూలై, ఆగస్టులో అధికారపార్టీని వీడాలనుకునే అమాయక ఎమ్మెల్యేలు ఎవరుంటారు ? పార్టీ మార్పు వలన ఇప్పటికిప్పుడు వాళ్లకు కలిగే ప్రయోజనాలేమిటి?

తాజా సన్నివేశాలను బట్టి ఎంత త్వరగా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతే అంత త్వరగా తన పగ 'చల్లారుతుంద'ని ఈటల భావిస్తున్నట్టు ఉంది. అయితే ఆచరణ సాధ్యాసాధ్యాలపై అంచనాలు సరిగ్గా లేవేమో !!

Tags:    
Advertisement

Similar News