రెండోసారి అధికారంలోకి వచ్చాకే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు

కుండబద్దలు కొట్టిన సీఎం రేవంత్‌ రెడ్డి

Advertisement
Update:2024-11-11 16:24 IST

ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు సీఎం రేవంత్‌ రెడ్డి భారీ షాక్‌ ఇచ్చారు. తాము రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తానని తేల్చిచెప్పారు. ఖైరతాబాద్‌ లోని ఆర్‌టీఏ ఆఫీస్‌ లో ఏఎంవీఐలకు సోమవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశాన్ని రేవంత్‌ రెడ్డి ప్రస్తావించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మొదటి విడత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. ''జర్నలిస్టులకు సోషల్‌ రెస్పాన్సిబులిటీ ఉండాలి.. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇండ్ల స్థలాల కోసం ఉద్యమాలు చేస్తున్నరు.. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లు ఉద్యమాలు చేశారు.. అప్పుడు కాలే కదా.. మేం రాగానే ఫస్ట్‌ విడత క్లియర్‌ చేశాం.. రెండో విడత కూడా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం.. రెండోసారి అధికారంలోకి రాగానే అవి కూడా ఇస్తాం.. జర్నలిస్టులకు నా విజ్ఞప్తి.. మీరు కూడా సహకరించాలి..'' అన్నారు. తద్వారా ఇప్పట్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేది లేదని సీఎం తేల్చిచెప్పారు. జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం తన వద్దకో, ఐ అండ్‌ పీఆర్‌ మినిస్టర్‌ దగ్గరికో తిరిగి టైం వేస్ట్‌ చేసుకోవద్దని ఉచిత సలహా ఇచ్చారు.

వాస్తవమేంటి?

జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ (జేఎన్‌జే)కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉన్నప్పుడే 70 ఎకరాలకు పైగా స్థలం కేటాయించారు. ప్రభుత్వం సొసైటీకి ఊరికే ఆ భూమి ఇవ్వలేదు. హౌసింగ్‌ సొసైటీ నిబంధనల ప్రకారం ఒక్కో జర్నలిస్టు రూ.2 లక్షల చొప్పున 2008 -09లోనే ప్రభుత్వానికి చెల్లించారు. ఈ లెక్కన అప్పట్లో ప్రభుత్వానికి రూ.23 కోట్లు జర్నలిస్టుల హౌసింగ్‌ సొసైటీ నుంచి చెల్లించారు. ప్రభుత్వ స్థలాలను న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, సివిల్‌ సర్వెంట్లు, జర్నలిస్టుల సొసైటీలకు ఇవ్వొద్దని సుప్రీం కోర్టు అప్పట్లో తీర్పునిచ్చింది. దీంతో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల పంపిణీకి బ్రేక్‌ పడింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించి దాదాపు 14 ఏళ్లు జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ఎదురు చూశారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీకి సంబంధించిన న్యాయ పరమైన చిక్కుముళ్లను విప్పారు. జర్నలిస్టులు చాలా తక్కువ జీతాలతో జీవిస్తున్నారని, వారిని ఎమ్మెల్యేలు, సివిల్‌ సర్వెంట్లు, న్యాయమూర్తులతో ముడిపెట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ ఫైల్‌ చేయించారు. దీంతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పంపిణీకి ఉన్న లీగల్‌ హార్డిల్స్‌ తొలగిపోయాయి. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే నిజాంపేట్‌ లో కేటాయించిన స్థలాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ హౌసింగ్‌ సొసైటీకి హ్యాండోవర్‌ చేశారు. ఈ విషయాన్ని ఆ సొసైటీ బాధ్యులను అడిగితే చెప్తారు. ఇక మిగిలింది పేట్‌ బషీరాబాద్‌ లో సొసైటీకి కేటాయించిన స్థలం మాత్రమే. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక ఆ స్థలాన్ని మాత్రమే సొసైటీకి కేటాయించారు. కేసీఆర్‌ చడీచప్పుడు లేకుండా స్థలం హ్యాండోవర్‌ చేస్తే.. రేవంత్‌ రెడ్డి మాత్రం దాన్నో పండుగ మాదిరిగా చేశారు. తాము ఇచ్చే వాళ్లం.. జర్నలిస్టులు పుచ్చుకునేవాళ్లు అన్నట్టుగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేఎన్‌జే సొసైటీకి స్థలమైతే అప్పగించారు కానీ స్థానికంగా ఉన్న చిక్కుముళ్లు అలాగే ఉన్నాయి. అవి పూర్తయి, ఫ్లాటింగ్‌ చేసి.. జర్నలిస్టులకు ఆ ఫ్లాట్లు అప్పగిస్తేనే మొత్తం ప్రక్రియ పూర్తయినట్టు. ఇన్ని సవాళ్లు ఇంకా ఉన్నా తాము రాగానే జర్నలిస్టుల దశాబ్దాల సమస్యను పరిష్కరించినట్టు రేవంత్‌ చెప్పుకోవమే విచిత్రం. తనను మళ్లీ గెలిపిస్తే తప్ప జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు రావు అనే మాటను స్పష్టం చేయడం ద్వారా ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా వాటిని ప్రజలకు తెలియజెప్పేలా కథనాలు రాయొద్దు అన్న అల్టిమేటం కూడా ఆ చిన్న మాటలోనే ఇమిడి ఉంది.

Tags:    
Advertisement

Similar News