మూడోసారి సైతం హిందూత్వనే బిజెపి ఎజెండా!

హిందూత్వ కార్డును ప్రయోగించడం ద్వారా మెజారిటీ ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఈ కుటిల ఎత్తుగడలో భాగంగానే దక్షిణాదిన హిందూత్వ ఎజెండా మాటున ప్రతిపక్షాలకు దురుద్దేశాలని అంటగడుతూ వాటిని హిందూ మత వ్యతిరేక శక్తులని ఆరోపిస్తున్నారు.

Advertisement
Update:2024-03-19 18:19 IST

మూడోసారి ప్రధాని అయి చరిత్ర సృష్టించాలని నరేంద్రమోడీ భావిస్తున్నారు. 400 సీట్లను సొంతంగా గెలుచుకొని బిజెపి చరిత్రని తిరగరాస్తుందని అమిత్‌ షా చెబుతున్నారు. ఇందుకోసం వారు హిందూత్వ ఎజెండానే నమ్ముకున్నట్టు ఇటీవల వారి ప్రసంగాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ‘ఇండియా’ కూటమి మీద, రాహూల్‌ గాంధీ మీద అబద్ధాల ప్రచారానికి సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిగడమే దీనికి సాక్ష్యమని పరిశీలకులు అంటున్నారు.

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో జరిగిన సభల్లో, రోడ్‌ షోలలో పాల్గొన్న నరేంద్రమోడీ హిందూమతం అంతమే ప్రతిపక్షాల లక్ష్యమని ఆరోపించారు. శక్తి ఆరాధనని ఇండియా కూటమి వ్యతిరేకిస్తుందని అబద్దాలు పలికారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా తిరుగులేని శక్తిగా మారిన బిజెపి కూటమిని నిరసిస్తూ రాహూల్‌ గాంధీ మాట్లాడారు. కానీ, ఈ మాటల్ని వక్రీకరిస్తూ ప్రజలు ఆరాధించే దేవతా శక్తిని రాహూల్‌, ఇండియా కూటమి వ్యతిరేకిస్తుందని, అవమానిస్తుందని మోడీ మాట్లాడటం విడ్డూరం.

పదేళ్ళపాటు ప్రధానిగా ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారి మాట్లాడటం విడ్డూరమే కాదు, వారి అభద్రతా భావాన్ని సూచిస్తున్నది. నెహ్రూ తరువాత మూడోసారి వరుసగా ప్రధాని పీఠాన్ని ఎవరూ అలంకరించలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలన్నది మోడీ కల. ఆయన కల గనడం తప్పుకాదు. కానీ ఆ కలల సాకారానికి పచ్చి అబద్ధాలు మాట్లాడటం ప్రధాని అంతటి వ్యక్తికి, ఆ పదవి హుందాతనానికి ఎంతమాత్రం తగదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తిరుగులేని అధికార శక్తిగా అవతరించిన మోడీ, 400 సీట్లు గెలుస్తామని చెబుతున్న అధినేత నిజాలు మాట్లాడుతూ సూత్రబద్ధ రాజకీయాలను చేయడం విజ్ఞ‌త అనిపించుకుంటుంది. ఇందుకు భిన్నంగా మోడీ మాత్రమే కాదు ఆ పార్టీ నేతలంతా వ్యవహరిస్తున్నారు. హిందూత్వ కార్డును ప్రయోగించడం ద్వారా మెజారిటీ ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఈ కుటిల ఎత్తుగడలో భాగంగానే దక్షిణాదిన హిందూత్వ ఎజెండా మాటున ప్రతిపక్షాలకు దురుద్దేశాలని అంటగడుతూ వాటిని హిందూ మత వ్యతిరేక శక్తులని ఆరోపిస్తున్నారు.

దక్షిణాదిన మాత్రమే కాదు దేశవ్యాప్తంగా హిందూత్వ ఎజెండాను అమలులో పెట్టి ఓట్లు దండుకోవాలనుకుంటుంది సంఘ్‌ పరివార్‌. ఢిల్లీలో ప్రార్థన చేస్తున్న ముస్లింలపై డాడులు, అహ్మదాబాద్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో నమాజ్‌ చేస్తున్న విదేశీ విద్యార్థులపై మూకుమ్మడి దాడులు ఈ కుతంత్రంలో భాగమే. ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, అయోధ్య రామాలయాన్ని తన ప్రచారాస్త్రాలుగా చేసుకోవ‌డం బిజెపి బలహీనతని చెప్పకనే చెబుతున్నది. దశాబ్దకాలంగా అధికారంలో వుండి దేశం కోసం, జనం కోసం ఏం చేసామో చెప్పుకోలేక హిందూత్వని ఆశ్రయించడం బిజెపి సైద్దాంతిక దివాళాకోరుతనాన్ని తెలియజేస్తుందని పరిశీలకులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News