ప్రభుత్వ నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం

గురుకులాల్లో అవరోహణ క్రమాన్ని పాటించకుండా పోస్టులు భర్తీ చేయడంతో భారీగా ఏర్పడుతున్న బ్యాక్‌లాగ్‌లు

Advertisement
Update:2024-10-06 09:46 IST

గురుకుల నియామకబోర్డు 9,210 పోస్టులను ఈ ఏడాది ఫిబ్రవరిలో భర్తీ చేసింది. టీజీటీ నుంచి డీఎల్‌ వరకు ఒకేసారి ఫలితాలు వెల్లడించింది. దీంతో 1,600 మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికయ్యారు. మరికొంతమంది ఎంపికైనా ఉద్యోగాల్లో చేరలేదు. దీంతో అధికారిక లెక్కల ప్రకారమే 1800లకు పైగా ఖాళీలు ఏర్పడినట్లు సమాచారం. దీనికి తోడు డీఎస్సీ కింద 11,062 పోస్టుల భర్తీకి 1:3 నిష్ఫత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ శనివారంతో పూర్తయ్యింది. డీఎస్సీలో మెరిట్‌ జాబితాలో ఉన్న గురుకుల టీచర్లు సంబంధిత గురుకుల సొసైటీల నుంచి నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) తీసుకున్నారు. రెండురోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న1000 మందికి పైగా ఎన్‌వోసీ తీసుకున్నట్లు సమాచారం. ఎన్‌వోసీ తీసుకున్న వారిలో సగానికి పైగా మంది ఆయా పోస్టులకు అర్హత సాధించే అవకాశం ఉన్నది. మరోవైపు ప్రభుత్వ కాలేజీల్లో 1,329 జేఎల్‌ పోస్టులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయ్యింది. ఆ ఫలితాలు వెల్లడైతే గురుకులాల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల సంఖ్య మరింత పెరుగుతుంది. అలాగే గురుకుల టీచర్లు పనిచేస్తున్న వారిలో చాలామందిగ్రూప్‌-4 ఉద్యోగాల తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఆ ఉద్యోగాలకు మరికొంతమంది వెళ్తే గురుకుల్లాల్లోనే ఎక్కువ బ్యాగ్‌లాగ్‌ పోస్టులు ఏర్పడే అవకాశం ఉన్నది. దీనివల్ల అహర్నిశలు కష్టపడి చదివిన నిరుద్యోగులకు ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్లనే అన్యాయం తీరని జరుగుతున్నది. గురుకుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొందరికి మోదం.. మరికొందరికి ఖేదంగా మారుతున్నది.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గురుకులాల్లో ఖాళీగా ఉన్న డీఎల్‌, జేఎల్‌, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్‌ వంటి పోస్టుల భర్తీ కోసం అనుమతిచ్చింది. దీంతో గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్లు ఇచ్చింది. నోటిఫికేషన్లు, పరీక్షలు అన్నీ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. తుది ఫలితాలు వెల్లడించే సమయానికి ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. దీంతో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేసే సమయంలోనే ప్రభుత్వ అనుసరిస్తున్న విధానం వల్ల వేలాదిమంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని గతంలో గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు కార్యదర్శిగా పనిచేసిన మాజీ ఐపీఎస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఒక్క పోస్టు మిగలకుండా ఉండాలంటే అవరోహణ క్రమాన్ని పాటించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి ట్విట్‌ చేశారు. ఎందుకంటే విద్యాశాఖ ఆయన పరిధిలోనే ఉన్నది కాబట్టి ఆయన నిరుద్యోగులకు న్యాయం చేస్తారని ఆశించారు. అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఉద్యోగ నియామకాల్లో రీలింక్విష్‌మెంట్‌ విధానాన్ని పాటించాలని, మెరిట్ జాబతా ప్రకారం రెండవ జాబితా విడుదల చేసి, ఖాళీలు మిగలకుండా భర్తీ చేయాలని కోరారు. కానీ బీఆర్‌ఎస్‌ వాళ్లు చెప్తే మేము పాటిస్తామా? అన్నట్లు సీఎం సరిగ్గా స్పందించకపోవడంతో అధికారులు అవరోణక్రమాన్ని పాటించకుండా భర్తీ చేశారు.

రేవంత్‌ ప్రభుత్వం ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. పది నెలల కాలంలో పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. కానీ గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రక్రియను కూడా సరిగ్గా పూర్తి చేయలేకపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం నిరుద్యోగులకు శాపంగా మారింది. దీంతో వేలాదిమంది నిరుద్యోగులు పరీక్షలు రాసి, మెరిట్‌లో ఉండి కూడా ఉద్యోగాలు పొందలేకపోయారు. దీనికి కారణం గురుకుల రిక్రూట్‌మెంట్‌ విడుదల చేసిన ఉద్యోగ ఫలితాల్లో ఒకే అభ్యర్థి ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక కావడం ఒక కారణమైతే డీఎస్సీలో మెరిట్‌ జాబితాలో ఉన్న వాళ్లు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జేఎల్‌ తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లలో ఎక్కుమంది గురుకుల్లాల్లో పనిచేస్తున్న టీచర్లే కావడం గమనార్హం. రేవంత్‌ ప్రభుత్వం మూడు నెలల్లోనే ముప్పై వేలు, ఆరు నెలల్లోనే అరవై ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రచారం చేసుకుంటున్నది. అయితే తాము నోటిఫికేషన్లు ఇవ్వకున్నా గొప్పగా ప్రచారం చేసుకుంటున్న వాటిల్లో గురుకులాల్లో ఎన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయో కూడా గుర్తిస్తే మీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదో అర్థమౌతుంది.

Tags:    
Advertisement

Similar News