చెప్పింది 420.. ఇచ్చింది నాలుగే!

ఇదేనా ఊహకందని, విప్లవాత్మక సంక్షేమం.. అభివృద్ధి?

Advertisement
Update:2024-11-09 16:11 IST

''నవ్విపోదురు గాక నాకేమిటి సిగ్గు..'' అన్నట్టుగా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం తీరు. గత పదినెలల్లో ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారట.. వాటిని ప్రజలందరూ సెలబ్రేట్‌ చేసుకోవాలట!! అధికారంలోకి వచ్చేందుకు నేల విడిచి సాము చేసి.. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి.. వాటన్నింటినీ తుంగలో తొక్కిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. ఏం చేయకుండానే సంబరాలకు సిద్ధమవుతోంది. పది నెలల్లో ఉహకందని అభివృద్ధి కాదు.. కలలో కూడా ఊహించలేనంత విధ్వంసం సృష్టించారు. హైడ్రా పేరుతో ప్రజల గుండెలపై బుల్డోజర్లు పరుగెత్తించి హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజీని మూసీ పాలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో చేస్తున్న విన్యాసాలు, సర్కస్‌ ఫీట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పాలకులకు ఒక విజన్‌ ఉండాలి.. దానిని సాకారం చేయడానికి కఠోర శ్రమ కూడా చేయాలి. తెలంగాణ పాలకుడిగా రేవంత్‌ విజన్‌ ఏమిటో పదకొండు నెలల్లో ప్రజలందరికీ సుస్పష్టంగా తెలిసింది. గడిచిన పదేళ్లు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో ఫస్ట్‌ ప్లేస్‌ కోసం పోటీపడ్డ తెలంగాణ ఇప్పుడు లెన్స్‌ వేసి వెతికినా ఆ జాబితాలో ఎక్కడుందో కూడా కనిపించడం లేదు. అంటే పెట్టుబడుల సాధనలో రేవంత్‌ సర్కార్‌ అట్టర్‌ ప్లాప్‌ అయినట్టు.. అయినా ఏదో సాధించామని బిల్డప్పులు. ఎన్నికల్లో గెలుపు కోసం ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చిన రేవంత్‌ సర్కారు నాలుగంటే నాలుగు హామీలు మాత్రమే అమలు చేసింది. ఇప్పుడు ఏడాది పాలన పేరుతో ఈనెల 14 నుంచి డిసెంబర్‌ 9 వరకు నిర్వహించబోయే సంబరాల్లో ఆ నాలుగు హామీల చుట్టే ప్రచార పర్వాన్ని సాగించనుంది.

ప్రభుత్వం నిరంతర ప్రక్రియ.. పాలకులు మారుతారేమో కానీ.. ప్రభుత్వ ఫంక్షనింగ్‌ లో మార్పులేమి ఉండవు. పాలకుల నిర్ణయాలు, ప్రయారిటీలకు అనుగుణంగా పాలనలో వాళ్ల మార్క్‌ కనిపించవచ్చేమో..! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ తొలి అడుగులే తడబడ్డాయి. పాలన అనుభవం లేకపోవడం సుస్పష్టంగా కనిపిచ్చింది. కేసీఆర్‌ ను ఇరుకున పెట్టాలని, పలుచన చేయాలనే ప్రయత్నంలో తెలంగాణాను ఒక విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అప్పుల కుప్ప అని నిందలేశారు. ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల తర్వాత కూడా గత ప్రభుత్వ అప్పులు.. వాటిని తిరిగి చెల్లించేందుకే మళ్లీ అప్పులు చేస్తున్నామంటూ గగ్గోలు పెట్టడం రేవంత్‌ సర్కార్‌ కే చెల్లింది. వాళ్లంతట వాళ్లే ఊహకందని, విప్లవాత్మక అభివృద్ది, సంక్షేమం అన్నారు కాబట్టి కొన్ని అంశాలను చర్చించుకోక తప్పదు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రైతులను రుణ విముక్తులను చేస్తామని చెప్పారు. రూ.48 వేల కోట్ల వరకు రైతు రుణాలు మాఫీ చేయబోతున్నామని ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో ఊదరగొట్టారు. నిరుడు డిసెంబర్‌ 9వ తేదీన్నే రూ.2 లక్షల వరకు ఉన్న అన్ని రుణాలు మాఫీ చేస్తామని చెప్పి.. ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారు. మొత్తంగా 23 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. ఎన్నికలకు ముందు చెప్పిన లెక్కను పరిగణలోకి తీసుకుంటే ఇంకా రూ.30 వేల కోట్లు రుణమాఫీ కోసం ఖర్చు చేయాలి.

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు ముందు రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుత బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ నాయకుల బృందం పోలింగ్‌ కు ముందు రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం పడితే వాళ్లు ప్రభావితం అవుతారని ఫిర్యాదు చేశారు. హరీశ్‌ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన ఒక కామెంట్‌ ఆధారంగా ఈ కంప్లైంట్‌ చేసి రైతుబంధు సాయం అందకుండా ఆపేశారు. దీనిపై అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్‌ ఇస్తే రైతుబంధు సాయం ఎకరానికి రూ.5 వేలు (ఒక సీజన్‌ కు) మాత్రమే ఇస్తాడు.. డిసెంబర్‌ 9న ఇందిరమ్మ రాజ్యం రాబోతోంది.. కాంగ్రెస్‌ గెలిచిన వెంటనే ఎకరానికి రూ.7,500 (ఒక సీజన్‌ కు) పెట్టుబడి సాయం అందజేస్తామని నమ్మబలికారు. కానాకష్టంగా నిరుడు కేసీఆర్‌ ఇచ్చినట్టే ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు సాయం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ వానాకాలం సీజన్‌ ముగిసినా కాంగ్రెస్‌ చెప్పిన రూ.7,500 సాయం అందలేదు. అసలు వానాకాలం సీజన్‌ కు రైతుభరోసా ఇచ్చేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు చావు కబురు చల్లగా చెప్పారు. ఒక్క సీజన్‌ కే కాదు.. క్రమేణ రైతుబంధు సాయం అనే పథకమే లేకుండా చేసే ప్రయత్నాలేవో జరుగుతున్నాయని ప్రభుత్వం లోపలికి వ్యక్తులే గుసగుసలాడుతున్నారు.

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం.. డిసెంబర్‌ 9 వరకు సంబరాలు చేస్తామని చెప్తోన్న ప్రభుత్వ పెద్దలు.. ఆమె విడుదల చేసిన ఆరు గ్యారంటీలను మాత్రం అమలు చేయడం లేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని నిస్సిగ్గుగా చెప్తున్నాడు. కాంగ్రెస్‌ కు అధికారం దక్కడంలో క్రియాశీలంగా పని చేసిన నిరుద్యోగులు, ఉద్యోగులను నిట్టనిలువునా ముంచేశారు. నమ్మించి నట్టేట ముంచారు. కనీసం పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అడిగే సాహసం కూడా ఉద్యోగ సంఘాలు చేయడం లేదు. పీఆర్సీ పత్తా లేదు. కేసీఆర్ ప్రకటించిన ఐఆర్‌ ముచ్చటే లేదు. మహిళలకు నెలకు రూ.2,500 సాయం అని చెప్పి చప్పున ఉన్నారు. కళ్యాణలక్ష్మీ సాయానికి తోడు తులం బంగారం అని.. ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదు. కాంగ్రెస్‌ ను గెలిపిస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రాహుల్‌ గాంధీతో చెప్పించి.. కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కేసీఆర్‌ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, రిజల్ట్స్‌ ఇచ్చిన పోస్టులనే తాము భర్తీ చేసుకున్నామని చెప్పుకునే దౌర్భాగ్యమైన స్థితిలో రేవంత్‌ ప్రభుత్వం ఉంది. గ్రూప్‌ -1, డీఎస్సీ రీ నోటిఫికేషన్లను తమ నోటిఫికేషన్లు అని చెప్పుకునే దుస్థితి ఏ ప్రభుత్వానికి రాకూడదు. రేవంత్‌ ప్రభుత్వం చెప్పుకోవడానికైనా ఒక మాస్‌ నంబర్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. రైతు రుణమాఫీ పూర్తి చేయలేదు. ఏ ప్రభుత్వమైనా ఏర్పడిన మొదటి ఏడాదిలోనే అన్ని హామీలను అమలు చేయడం సాధ్యం కాదు. కానీ ఏమీ చేయకుండానే ఊహకందని, విప్లవాత్మక అభివృద్ధి, సంక్షేమం అమలు చేశామని ఊదరగొడితే వాళ్లు సాధించిన ఘన కీర్తులేమిటో గుర్తు చేయక తప్పదు!!!

Tags:    
Advertisement

Similar News