బీసీ జనాభాపై కాంగ్రెస్ పెద్ద కుట్ర
రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పులతడక అంటున్న బీసీ సంఘాలు
రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతంగా కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క తేల్చింది. దీనిపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. దేశ చరిత్రలోనే కాదు..తెలంగాణ చరిత్రలోనూ ఇంతకంటే పెద్ద కుట్ర లేదని ధ్వజమెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పులతడక అంటున్నాయి. నిన్న ప్రభుత్వం కులగణన వివరాలు ప్రకటించిన తర్వాత చాలామంది బీసీ విద్యావేత్తలు, మేధాలువు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కులగణన సమగ్రంగా పూర్తి కాలేదన్నారు. బీసీ జనగణనలో మా పేర్లు గాని, మా కుటుం సభ్యుల వివరాలు గాని నమోదు చేయలేదంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలో శాస్త్రీయత లేదని స్పష్టమౌతున్నది. రాష్ట్రంలో మొత్తంగా 3.70 కోట్ల మంది జనాభా ఉండగా.. వారిలో 3,54,77,554 (96.9 శాతం) పూర్తిచేశామన్నారు. ప్రభుత్వం కూడా 1.03 లక్షల ఇండ్లు తలుపు వేసి ఉండటం, 1.68 లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొనడానికి సంకోచించడం, 84,137 ఇండ్లు నివాసేతరంగా ఉండటం వంటి సమస్యలతో 3,64,323 ( 3.1 శాతం) కుటుంబాల వివరాలు అంటే 16 లక్షల జనాభా వివరాలు సేకరించలేదని చెప్పింది. 3.1 శాతం వివరాల్లేకుండా సామాజిక వర్గాల వారీగా లెక్కలు చెప్పడం చెల్లుబాటు అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 40 శాతమైనా సర్వే పూర్తి కాలేదని సామాజిక, కుల సంఘాలు మండిపడుతున్నాయి.
కచ్చితమైన లెక్కలు రావాలంటే ఇప్పటికే అందుబాటులో ఉన్న గణాంకాలతో క్షేత్రస్థాయిలో తులనాత్మక అధ్యయనం చేయాలని, అదే సమయంలో కొత్త కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది. కానీ దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసింది. ఇందులో ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి కంటే ఆస్తులు, అప్పుల గురించి ఎక్కువగా ప్రశ్నలు పొందుపరిచింది. సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం దీనితో ముడిపెట్టింది. దీంతో ఈ సర్వే ద్వారా కొందరిని సంక్షేమ పథకాలకు దూరం చేస్తుందనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చినా... క్షేత్రస్థాయిలో 75 ప్రశ్నలతో కుటుంబ సర్వేపై ఎన్యుమరేటర్లు అడిగిన ప్రశ్నలు చూసిన జనాలు సర్వేకు దూరంగా ఉన్నారు. స్టిక్కరింగ్ చేయడానికి కూడా అంగీకరించలేదు.
సమగ్ర కుటుంబ సర్వే జరిగిన విధానం తదితర వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. భారతదేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగులు 1.09 కోట్ల కుటుంబాల వివరాలను సేకరించింది. కేసీఆర్ ప్రభుత్వం ఒక్కరోజులో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఎంత సక్కగ చేసిండ్రో చూడాలి అంటున్నారు. కులగణన పేరుతో జరిగిందంతా ఒక ప్రహనసంగా ఉన్నది తప్పా సమగ్రంగా లేదన్ని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో రాష్ట్రంలో బీసీలు 55 శాతానికి పైగా ఉంటారని, సరిగ్గా జనగణన జరిపితే నిజాలు నిగ్గు తేలుతాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. తెలంగాణలో చేసే సర్వేనే ప్రామాణికం అంటున్నది. కానీ రేవంత్ ప్రభుత్వం చేసిన సర్వేలో బీసీల జనాభా తక్కువ చూపెట్టిందని బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అసంపూర్ణంగా, అసమగ్రంగా చేసిన ఈ కులగణన సర్వే లెక్కలనే ప్రమాణికంగా జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అదే జరిగితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ కుల సంఘాల నేతలు అంటున్నారు. ప్రత్యేక డ్రైడ్ నిర్వహించి సంపూర్ణంగా సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని.. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.