బీజేపీతో ఫేస్‌ టు ఫేస్‌ పోరులో కాంగ్రెస్‌ ఫేడవుట్‌

మొన్న హర్యానా.. నేడు మహారాష్ట్రంలో హస్తం హ్యాండ్సప్‌

Advertisement
Update:2024-11-24 13:13 IST

కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ ముఖాముఖి తలపడిన చోట కాషాయపార్టీనే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే దానికి ఉదాహరణ. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన చేసిన వ్యాఖ్యల్లో ఒకటి వాస్తవమే అనిపించేలా ఉన్నది. హిమాచల్‌ ప్రదేశ్‌ ఫలితాలను చూపెట్టి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఫలితాలను చూపెట్టి తెలంగాణలో గెలిచారు. అంటే గెలిచిన రాష్ట్రంలో ఇచ్చిన హామీలను ఎన్నికల్లో జరిగే రాష్ట్రంలో ఇస్తామని చేసిన వాగ్దానానికి ప్రజలు ఆకర్షితులై ఆ పార్టీకి ఓట్లు వేశారని అనుకోవచ్చు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలువడానికి హామీలు ఒక్కటే కారణం కాదు, బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఆపార్టీ గెలుపునకు ప్రధాన కారణం. ఇక తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలే అంటే అతిశయోక్తి కాదు. అయితే కాంగ్రెస్‌ సొంతంగా ఉన్న ఈ మూడు రాష్ట్రాల్లో పాలనా ప్రభావమే మహారాష్ట్ర ఓటర్ల ఆపార్టీని తిరస్కరించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలను అధికారంలోకి వచ్చాక తుతు మంత్రంగా అమలు చేయకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా తెలంగాణలో అన్నివర్గాల ప్రజలు రేవంత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మహారాష్ట్రలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ఆ రాష్ట్రంలో అన్నింటికంటే ఎక్కువగా దెబ్బతిన్న పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్‌. ఈసారి ఆ పార్టీకి వచ్చిన సీట్లను చూస్తే మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూలేని విధంగా బలహీనపడిపోయింది. 2014లో మోడీ హవాలోనూ 42 సీట్లను గెలిచిన ఆ పార్టీ 2019లో 44 సీట్లు గెలుచుకున్నది. ఈసారి 16 సీట్లకే పరిమితమైంది. దీన్నిబట్టి గడిచిన మూడు ఎన్నికల్లో ఆపార్టీ ఎలా పతనమవుతున్నదో, వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆపార్టీ చాలా రాష్ట్రాల్లో ఉప ప్రాంతీయ పార్టీలా మారిపోతున్న పరిస్థితి నెలకొన్నది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు భిన్నంగా ఆపార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణం కొన్నివర్గాలపైనే అధికంగా ఆధారపడటం. భూపేందర్‌ హుడానే నమ్మకున్న పార్టీ హైకమాండ్‌, కాంగ్రెస్ సీనియర్‌ నాయకురాలు, సిర్సా ఎంపీ కుమారి సెల్జా పూర్తిగా పక్కనపెట్టింది. దీంతో హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయింది. మహారాష్ట్రలో అత్యధికంగా ప్రభావితం చేసిన కీలక అంశం ఓబీసీ సమీకరణ. మరాఠా రిజర్వేషన్ల అంశం లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతిని చాలా దెబ్బతీసింది. బీజేపీ అబ్‌ కీ బార్‌ 400 పార్‌ నినాదం పనిచేయకపోవడానికి మహారాష్ట్ర ఫలితాలే. అందుకే కీలకమైన మరాఠా ఓటర్లు మహావికాస్‌ అఘాడీలోని కాంగ్రెస్‌ వైపు కొంత మొగ్గుచూపుతున్నట్లు గ్రహించిన కమలనాథులు తమ వ్యూహానికి పదును పెట్టారు. మరాఠా వంటి బలమైన వర్గం కాకుండా ఇతర వర్గాలన్నింటినీ బీజేపీ ఏకీకృతం చేసింది. ముఖ్యంగా ఓబీసీ ఓట్లపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా మాలి, ధంగర్‌, వంజరి వర్గాలు కమలనాథులకు అండగా నిలిచాయి. మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తే తమ వాటా తగ్గుతుందని చాలా జాతుల్లో భయాలున్నాయి. వాటిని బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుని ఓట్లు రాబట్టుకున్నాయి. అలాగే మహారాష్ట్ర బలమైన ఓబీసీ నేత అయిన దివంగత గోపినాథ్‌ ముండే కూతురు పంకజా ముండే లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకున్నది. బీజేపీ ఎలక్షన్‌ ఇంజినీరింగ్‌ ఏమిటి అన్నది కాంగ్రెస్‌కు ఇప్పటికీ అర్థం కావడం లేదు. యూపీలో ఓబీసీల్లోని ఉప కులాలను తనవైపు తిప్పుకుని అక్కడ అధికారంలోకి వచ్చింది. బీహార్‌లోనూ ఎస్సీ, ఓబీసీల్లోని ఉప కులాలను తమవైపు తిప్పుకుని అక్కడ గణనీయమైన ఓట్లు సీట్లు సంపాదించింది. మొన్నటికి మొన్న హర్యానాలో ఓబీసీ నేతను ముందుపెట్టి జాట్‌ ఓట్లకు గండికొట్టింది. కానీ మల్లికార్జున ఖర్గే తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో బలమైన దళిత నేతను కుమారి సెల్జా పరిగనణలోకి తీసుకోకపోవడంతో అక్కడ దెబ్బతిన్నది.

మహారాష్ట్రలో ప్రధాన పార్టీలైన బీజేపీ-కాంగ్రెస్‌ 76 చోట్ల పోటీపడ్డాయి. కానీ ఇక్కడ ఆపార్టీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 149 చోట్ల పోటీ చేసిన బీజేపీ 132 చోట్ల గెలిస్తే 101 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్‌ 16 సీట్ల దగ్గరే ఆగిపోయిందంటే ఆపార్టీ పరిస్థితి ఏవిధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఝార్ఖండ్‌లోనూ ఇండియా కూటమి భారీ విజయం వెనుక అక్కడి ప్రాంతీయ పార్టీ జేఎంఎం కారణం. 81 స్థానాల్లో ఆపార్టీ 43 చోట్ల పోటీ చేసి 34 స్థానాల్లో గెలుపొందగా.. 30 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్‌ 16 స్థానాలకే పరిమితమైంది. ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ ఆశించిన ఫలితాలు సాధించకున్నా.. జేఎంఎం మెరుగైన ఫలితాలు సాధించడంతోనే భారీ విజయం సాధ్యమైంది. ఈ ఫలితాలే కాదు దేశవ్యాప్తంగా వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ తేలిపోయింది. అసోంలో ఐదు స్థానాలు ఎన్డీఏ గెలుచుకున్నది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఒక స్థానంలో, గుజరాత్‌ లో వావ్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ ఓడిపోయింది. పంజాబ్‌లో నాలుగు స్థానాలకు ఉప ఎన్నిక జరగగా ఆప్‌ మూడు చోట్ల, కాంగ్రెస్‌ ఒక చోట గెలిచాయి. రాజస్థాన్‌ లో ఏడు స్థానాలకు జరగగా.. ఐదు చోట్ల బీజేపీ విజయం సాధించగా.. కాంగ్రెస్‌ దౌసాలో మాత్రమే గెలుపొందింది. ఉత్తరాఖండ్‌లోనూ ఒక స్థానంలో కాషాయ పార్టీనే తన ఖాతాలో వేసుకోగలిగింది. అంటే బలంగా ఉన్నప్రాంతీయపార్టీలోకలిసి పోటీ చేస్తేనే కాంగ్రెస్‌ కొంత మెరుగైన ప్రదర్శన చేస్తున్నది, ఆ పార్టీకి కొన్ని సీట్లు వస్తున్నాయని స్పష్టమౌతున్నది. అంతేగాని బీజేపీతో నేరుగా తలపడితే ఆ పార్టీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నదని మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, హర్యానా రాష్ట్రాల తో పాటు మహారాష్ట్ర ఫలితాలు మరోసారి రుజువు చేశాయి.



Tags:    
Advertisement

Similar News