కాంగ్రెస్‌ మునిగి.. ప్రాంతీయ పార్టీలను ముంచి

మహారాష్ట్రలో 2004-2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. వచ్చిన మార్పు సూచిస్తున్నది ఇదే

Advertisement
Update:2024-11-25 11:49 IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత ఆ రాష్ట్రంలో గత ఐదు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సీట్లను చూస్తే ఆపార్టీ ఎంత బలహీనపడిందో తెలుస్తుంది. ఇదే సమయంలో బీజేపీ ఎంత బలపడిందో అర్థమౌతుంది. 2024లో 101 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 16 స్థానాలకే పడిపోయింది. ఆ పెద్ద నేతలు (మాజీ సీఎం పృధ్వీరాజ్‌ చవాన్‌) లాంటి నేతలు భారీ తేడాలతో ఓడిపోయారు. ఆ పార్టీ చాలా రాష్ట్రాల్లో రోజురోజుకూ పతనమవుతున్నది. దాదాపు రెండు దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాలే దీనికి కారణం. కాంగ్రెస్‌ వైఖరి వల్ల అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. మొన్న వెలువడిన మహా అసెంబ్లీ ఎన్నికల్లో 149 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 132 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి మెజారిటీ మార్క్‌ 145 సీట్లకు 13 సీట్ల దూరంలో నిలిచింది.

2004 నుంచి 2024 వరకు కాంగ్రెస్‌, బీజేపీలు సాధించిన సీట్లను చూద్దాం. అలాగే శివసేన- ఎన్సీపీల సీట్లు గురించి తెలుసుకుందాం. 288 స్థానాలున్న మహారాష్ట్రలో 2004లో శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీనే 71 స్థానాలతో అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ 69, బీజేపీ 54, శివసేన 62 సీట్లు గెలుచుకున్నాయి. 2009లో కాంగ్రెస్‌-82, బీజేపీ-46, ఎన్సీపీ-62, శివసేన-44, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన -13 గెలుచుకున్నాయి. ఐదేళ్ల తర్వాత 2014లో మోడీ హవాలో బీజేపీ 46 స్థానాల నుంచి 122 స్థానాలు గెలచుకున్నది. కాంగ్రెస్‌ దాదాపు సగం సీట్లను కోల్పోయి 42 సీట్లకే పరిమితమైంది. 2012లో బాల్‌ ఠాక్రే మరణిచాక శివసేన బాధ్యతలు చేపట్టిన ఉద్దవ్‌ ఒంటరిగా పోటీ చేసిన శివసేన 63 స్థానాలతో రెండో అతి పెద్దపార్టీగా అవరించే స్థాయికి తీసుకొచ్చారు. ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో ఎన్సీపీ 41 స్థానాలను దక్కించుకున్నది.

2014లో 44 ఏట సీఎం పదవిని దక్కించుకున్న దేవేంద్ర ఫడ్నవీస్‌ మహారాష్ట్ర చరిత్రలో శరద్‌ పవార్‌ (38 ఏళ్లకే) తర్వాత అతి పిన్నవయసు సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఆయన 2019 నాటికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా బీజేపీని బలోపేతం చేశారు. కానీ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 105 సీట్లతో అతి పెద్దపార్టీగా నిలిచింది. 56 స్థానాలు గెలుచుకున్న ఉద్ధవ్‌ నేతృత్వంలోని శివసేన సీఎం సీటు విషయంలో పీటముడి వేసింది. దశాబ్దాల బీజేపీ-శివసేన పొత్తుకు బీటలు వారాయి. దీంతో మెజారిటీ మార్క్‌కు 40 సీట్లు తక్కువగా ఉన్నా 23-11-2019న ఎన్సీపీ అజిత్‌ పవార్‌ను కలుపుకుని దేవేంద్ర ఫడ్నవీస్‌ తెల్లవారుజామునే ప్రమాణ స్వీకారం చేశారు. విశ్వాస పరీక్షకు సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఫడ్నవీస్‌ మూడు రోజుల్లోనే విశ్వాస పరీక్షన ఎదుర్కోకుండానే ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 44, ఎన్సీపీ 54 స్థానాలు గెలుచుకున్నాయి. అనంతరం బాలా సాహెబ్‌ సిద్ధాంతాలకు భిన్నంగా ఉద్ధవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌ తో కలిసి ఎన్సీపీని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉద్దవ్‌ సీఎంగా రెండున్నరేళ్ల తర్వాత ఆయన అనుచరుడైన ఏక్‌నాథ్‌ శిండే పార్టీని చీల్చి బీజేపీతో జట్టు కట్టడంతో సీఎంగా ఉద్ధవ్‌ వైదొలగాల్సి వచ్చింది. అయితే అధికారం కోసం ఎన్సీపీ, శివసేనలను చీల్చడం ప్రజలకు నచ్చలేదు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతికి ప్రజలు షాక్‌ ఇచ్చారు. కానీ ఆరు నెలల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసలైన శివసేన, ఎన్సీపీ ఏదో తేల్చే కీలకమైన ఎన్నికల్లో మహావికాస్‌ అఘాడీ బాధ్యతలను మోసిన ఉద్దవ్‌కు కాంగ్రెస్‌ నుంచి పూర్తి సహకారం దక్కకపోగా.. ఆ పార్టీ వల్ల ఓటు బ్యాంకు బదిలీ కాలేదని ఎన్సీపీ(ఎస్సీ) శివసేన కు వచ్చిన ఓట్ల శాతాన్ని చూస్తే తెలుస్తుంది.

2024లో మహాయుతిలోని బీజేపీ 132, శివసేన (షిండే ) 57, ఎన్సీపీ (అజిత్‌) 41 సీట్లు గెలుచుకోగా... శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్‌ 16, ఎన్సీపీ-ఎస్పీ 10 స్థానాలకే పరిమితమైంది. మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ)లో కాంగ్రెస్‌ 101- శివసేన (యూబీటీ) 95, ఎన్సీపీ-ఎస్పీ 86 ఈ మొత్తం కలిపితే 282 స్థానాలకు పోటీ చేస్తే వచ్చింది 46 స్థానాలు. అసలైన శివసేన ఏదో తేల్చుకుంటానన్న ఉద్ధవ్‌ కు శివసేన శిండే పార్టీ గెలుచుకున్న సీట్లను కూడా చేరుకోకపోవడం గమనార్హం. 81 స్థానాల్లో పోటీ చేసిన శిండే ఏకంగా 57 సీట్లలో గెలుచుకున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో సీఎం ఎవరు అన్న చర్చ జరుగుతున్నది. అయితే ఫడ్నవీస్‌ వైపు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం ఉన్నా, అధిష్ఠానం అండదండలు ఉన్నాయి.అటు మరాఠాల్లోనూ, బాల్‌ ఠాక్రే అభిమానుల్లో మెజారిటీ శిండేవైపే ఉన్నారు. అందుకే శిండేను కాదని ముందుకు వెళ్లే సాహసం కమలనాథులు చేసే పరిస్థితి ఉండదు. ఆయనను ఒప్పించే బీజేపీ వ్యక్తిని సీఎం చేయాలి తప్ప 2019లో వలె ఉద్దవ్‌ను కాదని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కుదరదని తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్‌ చూసిన తర్వాత శివసేన, ఎన్సీపీలు ఒంటరిగా పోటీ చేసినప్పుడు మెరుగైన సీట్లను దక్కించుకున్నాయని 2004-2024 వరకు ఫలితాలను చూస్తే తెలుస్తుంది. కానీ కాంగ్రెస్‌ ను నమ్ముకుంటే ఆ పార్టీ మునగడంతో పాటు ప్రాంతీయ పార్టీలను ముంచుతుందని మరోసారి మహారాష్ట్ర ఫలితాలు రుజువు చేశాయి.

Tags:    
Advertisement

Similar News