బీసీ రిజర్వేషన్లపై నాలుక మడతేసిన రేవంత్‌!

సమగ్ర కుటుంబ సర్వే, బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ వేదికగా పరస్పర విరుద్ధ వాదనలు

Advertisement
Update:2025-02-04 16:47 IST

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తన సహజ శైలిలో ముందో ఏదో ఒకటి మాట్లాడేసి తర్వాత నాలుక మడతేస్తూ ఉంటారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని చెప్తూనే అది చట్టపరంగా సాధ్యం కాకుంటే పార్టీ పరంగా అమలు చేస్తామని చేతులెత్తేశారు. సమగ్ర కుటుంబ సర్వేపైనా అదే తరహాలో మాట్లాడి అసెంబ్లీ వేదికగా రెండు గంటల వ్యవధిలోనే మళ్లీ నాలుక మడతేశారు. 2014లో అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం చేయించిన సమగ్ర కుటుంబ సర్వే ఎవరు చేశారు.. ఎలా చేశారు.. ఆ రిపోర్ట్‌ ఎక్కడ పెట్టారో కూడా ఎవరికి తెలియదని అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన మీడియా చిట్‌ చాట్‌లో మాట్లాడిన రేవంత్‌ రెడ్డి.. రెండు గంటలు కూడా గడవక ముందే 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే డాక్యుమెంట్‌ ఇదేనంటూ మీడియాకు లీక్‌ చేయించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేయించిన ''సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య రాజకీయ మరియు కుల సర్వే-2024 నివేదిక'' వివరాలను మంత్రులు వెల్లడించడం.. అది కాస్త బీసీ సంఘాల ఆగ్రహానికి గురి కావడంతో ఉక్కిరిబిక్కిరి అయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఏదో ఒకటి మాట్లాడింది. అసలు 96 శాతం మంది పాల్గొన్న సర్వేకు ఎలాంటి చట్టబద్ధత ఉంటుంది.. ఎవరైనా న్యాయస్థానాలకు వెళితే దాని పరిస్థితి ఏమిటీ అన్న సోయి లేకుండా ఆ నివేదికను అసెంబ్లీ చదివేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించిన రేవంత్‌ రెడ్డి.. అది కాస్త రివర్స్‌ కావడంతో వివాదం నుంచి బయట పడడానికి అసెంబ్లీలో నోటికి ఏది వస్తే అది మాట్లాడారు.

2014లో అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం చేయించిందని చెప్తోన్న సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఇవేనంటూ సోమవారం నుంచి కొన్ని స్లైడ్స్‌ను లీకుల రూపంలో ఇస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ సర్వే తీరును అసెంబ్లీ వేదికగా తప్పుబట్టారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ, సమగ్ర కుటుంబ సర్వేను 12 గంటల రికార్డు సమయంలో పూర్తి చేశామని చెప్పారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ''ప్రభుత్వ వెబ్‌సైట్‌లో సమగ్ర కుటుంబ సర్వే డాక్యుమెంట్‌ లేదు.. ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్‌ లో ఉంది.. ఎస్‌కేఎస్‌ సర్వేను ఎవరు చేశారు.. ఎవరు చేయించారు అనేదానిపై ఓనర్‌షిప్‌ క్లెయిమ్‌ చేసుకోలేదు.. అయినా తమ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, కుల సర్వేలో పాల్గొనని వారికి సభలో మాట్లాడే అవకాశమే ఇవ్వొద్దని స్పీకర్‌ చైర్‌ ను డిక్టేట్‌ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి సూచనను పరిగణలోకి తీసుకున్నట్టుగానే స్పీకర్‌ సభలో కేటీఆర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీకి మైక్‌ ఇచ్చారు. మొదట అసలు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ఎక్కడుందో తెలియదని చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి.. తనకు తానుగా ఆ డాక్యుమెంట్‌ను మీడియాకు లీక్‌ చేయించడంతో పాటు ఆ డాక్యుమెంట్‌ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీ వెబ్‌సైట్‌లో ఉందని చెప్పారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టని డాక్యుమెంట్‌ను సెల్ఫ్‌ డిఫెన్స్‌ కోసం రేవంత్‌ రెడ్డి వాడుకోవడంపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా వాటిని పట్టించుకోలేదు.

సామాజిక, రాజకీయ, ఆర్థిక, కుల సర్వే వివరాలను కేబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పటికే మీడియాకు వెల్లడించారు. అవే వివరాలను సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో స్టేట్‌మెంట్‌ రూపంలో ఇచ్చారు. కానీ ఆ సర్వేకు చట్టబద్ధత కల్పిస్తున్నామని ఎలాంటి ప్రకటన చేయలేదు. సభలో నివేదిక చదివి వినిపించారే తప్ప దానిని టేబుల్‌ చేయలేదు. దానికి కారణంగా వందశాతం సర్వే పూర్తి చేయకపోవడమే. వంద శాతం సర్వే చేయనప్పుడు ఆ డాక్యుమెంట్‌ను అసెంబ్లీ ముందుకు తేవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలకు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు అధికారపక్షం దగ్గర సమాధానం లేదు. సర్వేలో ప్రజల వ్యక్తిగత వివరాలు ఉన్నాయి కాబట్టే వెబ్‌సైట్‌లో పెట్టడం లేదని, సమగ్ర నివేదికను సభలో ప్రవేశ పెట్టడం లేదని సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలంటే చట్ట సవరణ చేయాలి కాబట్టి అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని.. కాంగ్రెస్‌ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని.. బీఆర్‌ఎస్‌, బీజేపీలు కూడా బీసీలకు అంతే స్థాయిలో రిజర్వేషన్లు కల్పించాలని సవాల్‌ విసిరారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించినప్పుడు రిజర్వేషన్ల పెంపునకు చట్ట సవరణ అవసరం అన్న సోయి లేకుండానే హామీ ఇచ్చారా అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అప్పుడు బీఆర్‌ఎస్‌ చేసిన సమగ్ర కుటుంబ సర్వేకు ఎలాంటి చట్టబద్ధత లేదని చెప్తోన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రభుత్వం చేయించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వేకు చట్టబద్ధత కల్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. సభ్యులు కోరితే ఆ ప్రయత్నం చేస్తామని చెప్తూనే దానికి సాంకేతికంగా ఏవేవో అవాంతరాలున్నాయని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తన సహజశైలిలో నోటికి వచ్చినట్టు మాట్లాడటం.. నాలుక మడతేయడంలో నేర్పరి అయిన రేవంత్‌ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పెంపుపై అలాగే నాలుక మడతేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ ఉత్తి ముచ్చటేనని తేల్చేశారు.

Tags:    
Advertisement

Similar News