నోటిఫికేషన్లు ఇవ్వకుండానే నియామకాలకు బ్రేక్
ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లన్నీ గత ప్రభుత్వం ఇచ్చినవే
డీఎస్సీ-2024లో ఎంపికైన అభ్యర్థులకు బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు అందించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులను ఉద్దేశించి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కోరి.. రెండు సార్లు కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నామని.. మళ్లీ అలాంటిది జరగదని అన్నారు. ఆ వేదికగా సీఎం పచ్చి అబద్ధాలు ఆడారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్న డీఎస్సీ-2024 11,062 పోస్టులు కూడా కొత్తవి కావు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి అదనంగా కొన్ని పోస్టులు కలిపి రేవంత్ ప్రభుత్వం ఇచ్చింది. ఇది సీఎం చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్న వారిని అడిగినా చెబుతారు. అంతేకాదు నిన్న కొలువుల పండుగ పేరుతో ప్రభుత్వం ప్రధాన పత్రికలన్నింటికీ పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చింది.
అందులో పేర్కొన్నవి (తాజాగా 11,062 డీఎస్సీ పోస్టులను మినహాయిస్తే) మొత్తం 30,352 ఉద్యోగాలను తాము భర్తీ చేశామని చెప్పుకున్నది. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత 2024 జనవరి 31 నుంచి 2024 అక్టోబర్ 6 వరకు ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వం ఆయా ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామకపత్రాలు అందించింది. కానీ సీఎం ఏ సభకు వెళ్లినా.. లేదా ఆయన మంత్రులు ఏం చెబుతున్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఊదగొడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల ప్రకారమే సింగరేణిలో 441 పోస్టుల కారుణ్య నియామకాలు మినహా దాదాపు మిగిలిన అన్ని ఉద్యోగాలకు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే. పరీక్షలు, ఫిజికల్ టెస్టులు, కొన్నింటికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. ఉద్యోగాల భర్తీ విషయంలో లేదా ఏవైనా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ ప్రక్రియను కొనసాగిస్తారు. రెడ్డొచ్చె మొదలాయె అన్నట్టు ఉండదు. కానీ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటివరకు కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? అన్నది రాహుల్‌గాంధీ అశోక్ నగర్‌కు వెళ్లి ఏ నిరుద్యోగులకు భరోసా ఇచ్చారో వాళ్లే అంకెలతో సహా చెబుతారు. నవంబర్, డిసెంబర్‌లో జరగనున్న గ్రూప్-3, 2 పరీక్షల నోటిఫికేషన్లు కూడా గత ప్రభుత్వం ఇచ్చినవే. అంటే డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ సర్కార్ ఇప్పటివరకు చేపట్టిన ఉద్యోగాల నియామకాల ప్రక్రియ అంతా కాంగ్రెస్ ఇచ్చిన కొత్త నోటిఫికేషన్లు కాదు.ఇప్పటివరకు తాను నిరుద్యోగులను ఉద్ధరించినట్లు, వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టు కోట్ల రూపాయలతో ప్రజాధనాన్ని వృథా చేస్తూ పత్రికా ప్రకటనలు, నగరంలోని ప్రధాన మార్గాల్లో హోర్డింగ్‌లు పెట్టుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ ఇవేవీ వాస్తవాలు కావు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు తర్వాత అసెంబ్లీ వేదికగా ఆ క్రెడిట్ కోసం సీఎం పెద్ద పెద్ద మాటలు చెప్పారు. వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేసి ఆ ఫలాలను మాదిగ కులాల వారికి అందిస్తామన్నారు. అంతేకాదు ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్లలోనూ అమలు చేస్తామన్నారు. ఇప్పుడు అంతా తూచ్ అంటూ ఎస్సీ వర్గీకరణపై హైకోర్టు మాజీ జడ్జితో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. నివేదిక ఇవ్వడానికి 60 రోజుల గడువు విధించింది. ఆ కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని అప్పటివరకు నోటిఫికేషన్లకు 'బ్రేక్' అంటూ బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. మొదటి క్యాబినెట్‌లోనే మెగా డీఎస్సీ అని నిరుద్యోగులను దగా చేశారు. గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక సాంకేతిక కారణాలను సాకుగా చూపి సాధ్యం కాదన్నారు. జీవో 46 బాధితులకు న్యాయం చేస్తామని చేతులెత్తేశారు. ఇటీవలే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినా నిరుద్యోగ సమస్య పోదని చెప్పిన సీఎం ఏడాది పాలనలో ప్రధాన ప్రతిపక్షాన్ని నిత్యం నిందిస్తూ.. వ్యక్తిగత ప్రచారం చేసుకుంటూ కాలం వెళ్లదీశారు. పది నెలల్లో మాటలతో మభ్యపెడుతూ నిరుద్యోగులను నిండా ముంచారు. నియామకాలపై సీఎం మాటలు చూస్తే.. 'మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకుంటారు' అని కాంగ్రెస్ వాళ్లను ఉద్దేశించి గతంలో బీఆర్‌ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అనేలా ఉన్నాయి.