భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భట్టి కొత్త భాష్యం
ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఎందుకు పెడుతున్నారు? నిన్న కొడంగల్‌లో కరెంటు, ఇంటర్నెట్ ఎందుకు బందు పెట్టారు?
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. సమస్య సీఎం రేవంత్ సృష్టిస్తున్నారు. సంజాయిషీ మంత్రులు ఇచ్చుకుంటున్నారు. ప్రజా ప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్ అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగకుండా, పార్టీ ఫిరాయింపులు, మూసీ, హైడ్రా, తాజాగా వికారాబాద్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటు ఇవన్నీ ఆయన వైఖరి వల్లనే సంక్లిష్టమౌతున్నాయి.
లగచర్ల ఘటనపై డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నదట. మరి ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఎందుకు పెడుతున్నారు? నిన్న కొడంగల్‌లో కరెంటు, ఇంటర్నెట్ ఎందుకు బందు పెట్టారు. సోషల్ మీడియాను నమ్మకుంటే జైలుకే అని మీ సీఎం ఎందుకు వార్నింగ్‌లు ఇస్తున్నారో వీటన్నింటికి డిప్యూటీ సమాధానం చెబితే బాగుంటుంది.
సీఎం సొంత నియోజకవర్గంలో మాకు ఫార్మా కంపెనీ వద్దు మా భూములు మాకే కావాలి అంటే సమాధానం చెప్పడం లేదు. వీళ్ల కేబినెట్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అక్కడ ప్రాజెక్టు ఇంకా ఏర్పాటు చేయలేదని, ప్రజాభిప్రాయం మాత్రమే సేకరిస్తున్నామన్నారు. ఒకవేళ అక్కడి రైతులు వద్దంటే అక్కడ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోమన్నారు. కానీ డిప్యూటీ సీఎం మాత్రం కలెక్టర్‌పై దాడి చేయిస్తే వెనక్కి తగ్గుతామని అనుకుంటున్నారా? (నోట్: రైతులెవరూ తనపై దాడి చేయాలని కలెక్టర్ అన్నారు. రైతుల ముసుగులో కొంతమంది దాడికి యత్నించారు అన్నారు) భూములు కోల్పోయే వారికి మెరుగైన ప్యాకేజీ తో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తాం. ఇళ్లు కోల్పోతున్న వారికి మంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తున్నాం. దాడి
సమస్యకు పరిష్కారం కాదు. కలెక్టర్‌తో చర్చించి పరిష్కరించుకోవాలని భట్టి ఉచిత సలహా ఇస్తున్నారు. ప్రజాప్రభుత్వంలో, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజలతో చర్చించరా? భూములు కోల్పోతున్న రైతుల ఆవేదనను అర్థం చేసుకోరా? వారికి ఒప్పించే ప్రయత్నం చేయరా? మేము ఆదేశిస్తాం. బాధితులు కలెక్టర్‌తో చర్చించి పరిష్కరించుకోవాలని అంటారా? ఇదేనా ప్రజలు కోరుకున్న మార్పు? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రభుత్వానికే స్పష్టత లేదని భట్టి, కోమటిరెడ్డి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇలాగే మూసీ సుందరీకరణ డీపీఆర్ కేంద్రానికి పంపామని భట్టి అంటే అలాంటిదేమీ లేదని, ఇది చర్చ మాత్రమేనని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎవరి తోచిన విధంగా వాళ్లు ఏదిపడితే మాట్లాడుతున్నారు అనడానికి ఇవే నిదర్శనాలు.
పదకొండు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల వచ్చిన పరిశ్రమలు వెనక్కి పోతున్నాయి తప్పా కొత్తగా ఎన్ని పరిశ్రమలు తెచ్చారో భట్టికే తెలియాలి. ఇక ఉద్యమ సమయంలో ప్రజలను రెచ్చగొట్టి ప్రాణాలు కోల్పోయాల చేశారని భట్టి అనడం గర్హనీయం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కమిటీలు, సంప్రదింపుల పేరుతో కాలయాపన చేయడం వల్లనే వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో కొంతమంది కాంగ్రెస్ నేతల పేర్లు రాసి సూసైడ్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పాత్రపై ఎవరికీ పేచీ లేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరి ఏమిటో అందరికీ తెలిసిందే. ఇక మీ ముఖ్యమంత్రి ఉద్యమకాలంలో ఏం చేశాడో చరిత్రలో నిక్షిప్తమై ఉన్నది. అధికారం ఇచ్చిన ప్రజలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తూ.. బాధ్యతల లేకుండా వ్యవహరిస్తూ... నిత్యం ప్రధాన ప్రతిపక్షాన్ని, కేసీఆర్‌ను తిడుతూ కాలం వెళ్లదీయడం తప్ప ఒక్కటైనా కాంగ్రెస్ మార్కు పథకం, ప్రాజెక్టు గాని ఈ పదకొండు నెలల కాలంలో చేపట్టారా? అన్ని భట్టి చెబితే బాగుటుంది.