కోల్‌కతా హత్యాచార ఘటన: సంజయ్ రాయ్ దోషి
ఆర్జీకర్ ఆస్పత్రి డాక్టర్ హత్యాచారం కేసులో తీర్పు వెలువరించిన కోల్‌కతాలోని సీల్దా కోర్టు
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆస్పత్రి డాక్టర్ హత్యాచారం కేసులో కోల్‌కతాలోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చింది. బీఎన్‌ఎస్ సెక్షన్లు 64,66,103/1 కింద సంజయ్‌ని కోర్టు దోషిగా తేల్చింది.అతడికి జనవరి 20 శిక్ష ఖరారు చేయనున్నది.
గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాతరి ఆర్జీ కర్ ఆస్పత్రి సెమినార్ రూమ్‌లో ఒంతరిగా నిద్రిస్తున్న జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్‌కతా పోలీసులు నుంచి సీబీఐ స్వీకరించి, విచారిస్తున్నది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ఘటనాస్థలిలో నిందితుడి వెంట్రుకలు, బ్లూటూత్ దొరికాయని సీబీఐ తెలిపింది.ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగపత్రంలో ప్రస్తావించలేదు. ఆస్పత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ని ఆగస్టు10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.
ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్‌ఛార్జి అభిజిత్ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా.. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. వారు అరెస్టైన దగ్గరి నుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జిషీట్‌ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది. ఇదిలా ఉంటే తీర్పు నేపథ్యంలో కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
ఏ తప్పు చేయలేదని దోషి సంజయ్ రాయ్ కోర్టులో చెప్పాడు. తనను తప్పుడు కేసులో ఇరికించారని జడ్జికి తెలిపాడు. ఈ కేసులో అసలు దోషులను వదిలేశారు. హత్యాచారం ఘటనలో ఓ ఐపీఎస్ అధికారికి సంబంధం ఉన్నదని సంజయ్ ఆరోపించారు.