మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట
తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశం
సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటుగా మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం సినీ నటుడు మోహన్ బాబు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మోహన్‌బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గత నెల 23న తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
గత నెలలో మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం విదితమే. ఈ క్రమంలో మోహన్‌బాబు ఇంటివద్ద రిపోర్టింగ్‌కు వెళ్లిన జర్నలిస్ట్ రంజిత్‌పై మోహన్‌బాబు మైక్‌తో దాడి చేశారు. దీంతో పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.