ఎయిరిండియా నిర్వాకం.. ఐసీయూలో వృద్ధురాలు
వీల్‌ఛైర్ కావాలని ముందే అభ్యర్థించినా ఢిల్లీ విమానాశ్రయంలోని ఎయిరిండియా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణ;
ఎయిరిండియా విమానయాన సంస్థపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్‌చైర్ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తుండగా.. 'తప్పనిసరి పరిస్థితుల్లో' అంటూ ఆమె మనవరాలు జరిగిందంటా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఆమె తీవ్రంగా ఎండగట్టడంతో దెబ్బకు ఎయిర్‌ఇండియా దిగొచ్చింది.
రాజ్ పశ్రీచా మాజీ సైనికాధికారి సతీమణి. తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిర్‌ఇండియా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్‌ఛైర్ కోసం బుక్ చేసుకోగా.. అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. వీల్‌ఛైర్ కావాలని ముందే అభ్యర్థించినా ఢిల్లీ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కుటుంబసభ్యుల సాయంతో కౌంటర్ వద్దకు నడుస్తూ..కాలు జారి కిందపడి గాయపడ్డారని ఎక్స్ లో ఆమె మనుమరాలు పరుల్ కన్వర్ పోస్ట్ పెట్టింది. ఆ సమయంలోనూ సిబ్బంది పట్టించుకోలేదని, ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నదని పరుల్ పేర్కొన్నది.
ఆమె తలకు గాయం కాగా.. ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదన్నారు. తామె మెడికల్ కిట్ కొనుక్కొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశామని మనవరాలు పరుల్ కన్వర్ తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికి వీల్‌ఛైర్ వచ్చిందని.. గాయలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు. తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. ఎడమవైపు భాగానికి పక్షవాదం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోనని అనామానాలను డాక్టర్లు వ్యక్తం చేశారని పరుల్ తెలిపారు.
అయితే పరుల్ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసకోవడానికి ఫోన్ నంబర్, పూర్తి వివరాలు తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తయితే గాని తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరప బోనని పరుల్ తేల్చిచెప్పింది.