కోర్టులో కేసుండగా ఎలా వస్తారు.. ఓవర్ యాక్షన్ చేయకు
అడ్వొకేట్‌తో హైడ్రా కమిషనర్ వాగ్వాదం
కోర్టులో కేసు ఉండగా అక్కడికి ఎలా వస్తారని అడ్వొకేట్ హైడ్రా కమిషనర్ ను ప్రశ్నించారు. ఓవర్ యాక్షన్ చేయొద్దని సదరు అడ్వొకేట్‌ను హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. ఈ ఘటన అమీన్ పూర్ మండలం ఐలాపూర్ లో చోటు చేసుకుంది. ఐలాపూర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం సమావేశమయ్యారు. అడ్వొకేట్ ముఖిమ్ జోక్యం చేసుకొని సంబంధిత ఫ్లాట్ల వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని.. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఎలా వస్తారని రంగనాథ్ ను ప్రశ్నించారు. పేదలను మోసం చేసి ప్లాట్లు విక్రయిస్తే ఊరుకునేది లేదని.. ఓవర్ యాక్షన్ చేయొద్దని రంగనాథ్ న్యాయవాదిని హెచ్చరించారు. రెండు వారాల్లోగా ప్లాట్లకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తామని.. ఇరువర్గాలు చెప్పే అంశాలను వింటామని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. రెండు నెలల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.