రోగాలు తగ్గిస్తామంటూ తప్పుడు ప్రకటనలు..డీసీఏ ఝలక్‌

ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇస్తున్న వారిపై 176 కేసులు నమోదు

Advertisement
Update:2024-12-03 10:17 IST

కిడ్నీల్లో రాళ్లున్నాయా? ఈ ట్యాబ్‌లెట్‌ తీసుకుంటే రాళ్లన్నీ మటుమాయం.. షుగర్‌తో బాధపడుతున్నారా? ఈ గోలి వేసుకుంటే తగ్గిపోతుంది. ఈ మందు తీసుకుంటే క్యాన్సర్‌ పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా రకరకాల ప్రకటనలతో రోగులను తప్పుదోవ పట్టిస్తున్న అక్రమార్కులకు డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) ఝలక్‌ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇస్తున్న వారిపై 176 కేసులు నమోదు చేసింది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారికి చెక్‌ పెట్టింది. ఇవేగాకుండా పలురకాల అంశాలకు సంబంధించి మొత్తం 494 కేసులు నమోదు చేసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ దాడులు చేసింది. వివరాలను డ్రగ్స్‌ కంట్రోల్‌ శాఖ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మందుల విలువ 3.06 కోట్లు ఉంటుందన్నారు. చాలామంది డీసీఏ నుంచి అనుమతులు తీసుకోకుండానే మెడికల్‌ షాప్‌లు నిర్వహిస్తున్నారు. కొందరు ఆర్‌ఎంపీల పేరుతో మెడికల్‌ సర్వీసులు అందిస్తూ మందుల నిల్వలు పెట్టుకుంటున్నారు. కొందరైతే అనుమతులు తీసుకోకుండానే మందులను కూడా తయారుచేసి అడ్డదారుల్లో సరఫరా చేస్తున్నట్లు డీసీఏ గుర్తించింది.

కేసుల సంఖ్య వివరాలు ఇలా ఉన్నాయి. నకిలీ మందుల విక్రయాలు-8, ఎక్కువ ధరలకు అమ్మకాలు-75, మెడిసిన్స్‌పై తప్పుడు ప్రకటనలు-176, అనుమతులు లేకుండా అమ్మకాలు-61, మందుల అక్రమ నిల్వ-124, అనుమతులు లేకుండా మెడిసిన్స్‌ తయారీ-41, లైసెన్స్‌ లేకుండా కాస్మోటిక్స్‌ తయారీ-5, ఇతర కేసులు-4 నమోదయ్యాయి.

Tags:    
Advertisement

Similar News