లోన్ యాప్ దుర్మార్గాలపై రంగంలోకి దిగిన ఈడీ.. వెనుక పెద్ద స్టోరీనే ఉంది.!

దేశంలో ఎన్‌బీఎఫ్‌సీ పేరుతో లైసెన్సులు పొంది.. చైనీస్ యాప్‌ల ద్వారా లోన్లు ఇస్తున్నట్లు ఈడీ తేల్చింది. చైనా యాప్ సంస్థలతో లింక్ అయిన సదరు సంస్థల లైసెన్సులను క్యాన్సిల్ చేయాలని ఆర్బీఐకి ఈడీ లేఖ రాసింది.

Advertisement
Update:2022-07-27 08:15 IST

చైనాకు చెందిన లోన్ యాప్ ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇన్‌స్టంట్ లోన్ అని చెప్పి ముందు వినియోగదారులను ఆకట్టుకొని.. ఆ తర్వాత భారీ వడ్డీలతో భయపెడుతున్నాయి. అంతే కాకుండా ఒక్క రోజు లేటైనా అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు, ఫోన్‌లోని కాంటాక్ట్ నెంబర్లకు కూడా అసభ్యకరంగా మెసేజెస్ పెడుతున్నారు. లోన్ తీసుకున్న వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను వాట్సప్‌లో షేర్ చేస్తున్నారు. దీంతో లోన్ తీసుకున్న కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. రాచకొండ పోలీసులకు దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో లోన్ యాప్‌లపై గత ఏడాది నుంచే కఠినంగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ఈ లోన్ యాప్‌లకు సంబంధించిన కేసులో రంగంలోకి దిగింది. ఇప్పటికే చైనీస్ లోన్‌యాప్‌లకు దేశంలో సహకరిస్తున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్‌బీఎఫ్‌సీ) సంస్థలను గుర్తించారు. దేశంలో ఎన్‌బీఎఫ్‌సీ పేరుతో లైసెన్సులు పొంది.. చైనీస్ యాప్‌ల ద్వారా లోన్లు ఇస్తున్నట్లు ఈడీ తేల్చింది. చైనా యాప్ సంస్థలతో లింక్ అయిన సదరు సంస్థల లైసెన్సులను క్యాన్సిల్ చేయాలని ఆర్బీఐకి ఈడీ లేఖ రాసింది.

చైనా యాప్స్ అన్నీ ఒకే రకమైన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నాయి. వేర్వేరు పేర్లతో ప్లే స్టోర్‌లో వాటిని ఉంచారు. వాటి బ్యాక్ ఎండ్ సాఫ్ట్‌వేర్ మాత్రం ఒకటే అని.. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇండియాలోని కొన్ని ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. పైకి చైనా యాప్‌లే అయినా.. వాటిని నడిపిస్తుంది మాత్రం ఇండియాకు చెందిన చిన్న లోన్ సంస్థలే అని ఈడీ అధికారులు అంటున్నారు. అందుకే ఈ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్ సంస్థకు కూడా ఈడీ లేఖ రాసింది. అయితే ప్లే స్టోర్ నుంచి సదరు యాప్స్ తొలగించే అధికారం గూగుల్ ఇండియాకు లేదని.. యూఎస్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తేనే కానీ తొలగించలేమని తెలిపింది. దీంతో ఈడీ అమెరికాలోని కార్యాలయానికి కూడా లేఖ రాసినట్లు తెలుస్తున్నది.

హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటినీ ఈడీ తీసేసుకున్నది. వీటిని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద మార్చి కేసులు నమోదు చేసింది. 400 చైనీస్ యాప్స్, 50 ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలపై ఈడీ పంజా విసిరింది.

ఏస్‌మనీ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీకి దాదాపు 18 లోన్ యాప్‌లతో సంబంధం ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఆర్బీఐ నుంచి ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ తీసుకొని చైనీస్ యాప్ సహాయంతో అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు ఈడీ చెప్తోంది. ఇదే విషయాన్ని పూర్తిగా వివరిస్తూ ఆర్బీఐకి లేఖ రాసింది. వెంటనే సదరు సంస్థ లైసెన్స్ రద్దు చేయాలని కోరింది.

ఇండియాలో 2019 నుంచి అనేక చైనా కంపెనీలు వడ్డీ వ్యాపారం మొదలు పెట్టాయి. కేవలం ఆన్‌లైన్‌లో ఫిన్‌టెక్ యాప్స్ లాగా నమోదు చేసుకొని రంగంలోకి దిగాయి. అయితే అప్పట్లో ఆర్బీఐ వీటికి ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో సదరు చైనీస్ ఫిన్‌టెక్ యాప్స్.. స్థానిక ఎన్‌బీఎఫ్‌సీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ తర్వాత ఫేక్ డాక్యుమెంట్లతో ఇక్కడే కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలను నెలకొల్పి రుణాలు ఇవ్వడం మొదలు పెట్టినట్లు ఈడీ చెప్తోంది.

కాగా, 2020 ఏప్రిల్‌లో కేంద్రం ఒక పాలసీ తీసుకొని వచ్చింది. చైనా నుంచి ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్లను నిలిపివేసింది. అదే సమయంలో యాప్స్ కూడా బ్యాన్ చేసింది. దీంతో చాలా మంది చైనా జాతీయులు స్థానిక ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల బోర్డు నుంచి తప్పుకున్నారు. కానీ వారి స్థానంలో ఇండియాకు చెందిన డమ్మీ డైరెక్టర్లను రంగంలోకి దించారు. ఇలా నకిలీ డైరెక్టర్లతో వ్యాపారం చేస్తున్న వాటిలో ఏస్‌మనీ సంస్థే 18 యాప్‌లను తయారు చేసి లోన్లు ఇస్తుండటం గమనార్హం.

2016లో ఆర్వోసీ ఢిల్లీలో ఏస్‌మనీ ఇండియా లిమిటెడ్‌ను రూ. 10 కోట్ల మూల ధనంతో రిజిస్టర్ చేయించారు. మొదట్లో పెద్దగా లోన్లు ఇవ్వని ఈ సంస్థ 2020 జూన్ నుంచి మాత్రం భారీగా వ్యాపారం పెరిగినట్లు తెలిపింది. 18 చైనీస్ యాప్‌లతో జత కలిసిన తర్వాతే వారి వ్యాపారం అభివృద్ధి చెందినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటి వరకు 11,73,520 లోన్ అప్లికేషన్లను ప్రాసెస్ చేసినట్లు ఈడీ అధికారులు చెప్తున్నారు. ఈ ఏస్‌మనీ సంస్థ ఏ ఒక్క కస్టమర్‌కు కూడా ప్రత్యక్షంగా లోన్ ఇవ్వలేదని.. పూర్తిగా చైనీస్ యాప్‌ల పైనే ఆధారపడిందని ఈడీ అంటోంది.

ఏస్‌మనీకి ఉన్న ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సును చైనా కంపెనీలు వాడుకొని మైక్రో ఇన్‌స్టంట్ లోన్ బిజినెస్‌ను చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఏస్‌మనీ ద్వారా పేమెంట్ గేట్‌వే లను సంపాదించారని అంటోంది. ఒక్క ఏస్‌మనీ సంస్థే కాకుండా మరో 49 సంస్థలు కూడా ఇలాగే తమ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సులను చైనా కంపెనీలకు ఇచ్చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పుడు వాటన్నిటిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News