తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగింది

క్రైం వార్షిక నివేదికను విడుదల సందర్బంగా డీజీపీ జితేందర్‌ వెల్లడి

Advertisement
Update:2024-12-29 14:25 IST

ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని తెలంగాణ డీజీపీ జితేందర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన క్రైం వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఈ ఏడాది 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి అన్నారు. డ్రగ్స్‌ లేని తెలంగాణ సాధనే పోలీస్‌ శాఖ లక్ష్యమని చెప్పారు. మోసాలకు పాల్పడుతున్న 1800 వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌లను బ్లాక్‌ చేసినట్లు తెలిపారు.

ఈ ఏడాదిలో 33,618 సైబర్‌ క్రైమ్‌ కేసులు

కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చామన్నారు. డిజిటల్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ ఏడాది 33,618 సైబర్‌ క్రైమ్‌ కేసులను నమోదు చేశాం. 1425 కిడ్నాప్‌, 703 చోరీ, 58 దోపిడీ, 856 హత్య, 2945 అత్యాచారాల కేసులు నమోదు చేశాం. డయల్‌ 100కు 16,92,173 ఫిర్యాదులు వచ్చాయి. కొత్త చట్టం వచ్చిన తర్వాత 85,190 కేసులు నమోదు చేశాం. కొత్త చట్టం ప్రకారం సైబరాబాద్‌ పరిధిలో 15,360, హైదరాబాద్‌లో 10,501, రాచకొండలో 10,251 కేసులను నమోదు చేశాం. సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో రూ. 180 కోట్లను తిరిగి బాధితులకు అప్పగించాం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా142.95 కోట్ల మాదకద్రవ్యాలను సీజ్‌ చేశాం. డ్రగ్స్‌ కేసుల్లో 4,628 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

వ్యక్తిగత కారణాలతోనే పోలీసుల ఆత్మహత్యలు

వ్యక్తిగతంగా లేదా కుటుంబ సమస్యలతో పోలీసుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పోలీస్‌ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నారు. చాలా చోట్ల వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. సంధ్య థియేటర్‌ ఘటన కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణ జరుగుతున్నది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐకి లేఖ రాశాం. నిందితులను విదేశాల నుంచి భారత్‌కు రప్పించాలంటే ఇంటర్నేషనల్‌ ప్రాసెస్‌ జరుగుతున్నది. దీనికి ఇంటర్‌ పోల్‌ సాయం తీసుకుంటున్నాం. కేసులో ప్రధాన నిందితులు, స్పెషల్‌ ఇంటలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావును హైదరాబాద్‌కు తీసుకురావడానికి సమయం పడుతుందని డీజీపీ జితేందర్‌ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News