బాబా సిద్ధిఖీ హత్య వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం!
హీరో సల్మాన్‌ఖాన్ టార్గెట్ చేసిన ఆ గ్యాంగ్ అతని స్నేహితుడైన సిద్ధిఖీని హత్య చేయడంపై పలు అనుమానాలు
మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఉత్తరప్రదేశ్, హర్యానాకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, యూపీకి చెందిన ధర్మరాజ్ కశ్యప్‌లు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవాళ్లమని పేర్కొన్నట్లు పోలీస్‌వర్గాలు వెల్లడించాయి. బాంద్రా ఈస్ట్‌లోని షూటింగ్ స్పాట్‌లో వీరు సుమారు నెల రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయంపై బిష్ణోయ్ గ్యాంగ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
'వై కేటగిరీ భద్రత కల్పించిన కొన్నిరోజులకే
బాబా సిద్ధిఖీకి ప్రాణహాని ఉన్నదని ఆయన సన్నిహితులు పేర్కొనడంతో 15 రోజుల కిందటే ఆయనకు 'వై కేటగిరీ భద్రత కల్పించినట్లు పోలీసులు తెలిపారు. భద్రత ఉన్న రాజకీయ నాయకులకే రక్షణ లేకపోతే సామన్య ప్రజల పరిస్థితి ఏమిటని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన రాజకీయవర్గాల్లో కలకలం సృష్టిస్తున్నది.
బిష్ణోయ్ గ్యాంగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులకు పాల్పడింది. కొంతకాలంగా సల్మాన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ గ్యాంగ్ అతని స్నేహితుడైన బాబా సిద్ధిఖీని హత్య చేయడం పలు అనుమానాలకు దారితీస్తున్నది. అయితే పోలీసులు మాత్రం సిద్ధిఖీకి బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి బెదిరింపులు రాలేదని పేర్కొన్నారు. ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
'మహా'లో శాంతిభద్రతలు పూర్తిగా పతనమయ్యాయి: రాహుల్
ఎన్సీపీ నేత సిద్ధిఖీ హత్య ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. 'ఈ హత్య చాలా బాధాకరమైన విషయం. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు మద్దతుగా ఉంటాం. ఈ ఘటన చూస్తుంటే మహారాష్ట్రలో శాంతిభద్రతలు పూర్తిగా పతనమయ్యాయని స్పష్టమౌతున్నది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి' అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన ఆస్పత్రికి సల్మాన్
తన స్నేహితుడు సిద్ధిఖీ హత్యకు గురైనప్పుడు సల్మాన్‌ఖాన్ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్‌లో ఉన్నారు. మరణవార్త విన్న వెంటనే మిగిలిన షూటింగ్ రద్దు చేసుకుని హుటాహుటిన ఆస్పత్రికి బయల్దేరారు.
కన్నీటి పర్వంతమైన శిల్పాశెట్టి
బాబా సిద్ధిఖీకి నివాళులు అర్పించడానికి రాజకీయనాయకులు, సినీ ప్రముఖలు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. సినీ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా నివాళులు అర్పించారు. ఆస్పత్రి నుంచి బైటికి రాగానే శిల్పాశెట్టి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్వంతమయ్యారు.