నాలుగేళ్ల బాలికపై ఎస్‌ఐ లైంగిక దాడి
బాధిత చిన్నారికి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చిన్నారికి న్యాయం చేయాలంటూ స్థానికులు పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు.
సమాజంలో ప్రజలకు రక్షణ కల్పిస్తూ.. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న ఓ వ్యక్తి కామంతో కళ్లుమూసుకుపోయి వ్యవహరించాడు. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అకృత్యానికి పాల్పడింది ఏకంగా సబ్ ఇన్‌స్పెక్టర్ కావడం గమనార్హం. రాజస్థాన్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో గల రహువాస్ పోలీస్‌స్టేషన్‌లో భూపేంద్రసింగ్ అనే వ్యక్తి ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. శుక్రవారం అతను డ్యూటీలో ఉండగానే.. తన సహోద్యోగి అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లాడు. పక్కనే ఉంటున్న ఓ నాలుగేళ్ల బాలిక ఆడుకుంటూ అక్కడకు వద్దకు వచ్చింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఎస్‌ఐ భూపేంద్రసింగ్ ఆ చిన్నారికి చిరుతిళ్లు ఇస్తానని ఆశ చూపించి గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాధిత బాలిక ఈ దారుణాన్ని తన తల్లికి వివరించడంతో విషయం వెలుగుచూసింది. బాలిక కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధిత చిన్నారికి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చిన్నారికి న్యాయం చేయాలంటూ స్థానికులు పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు.