మలయాళ నటుడు ప్రతాప్ పోతన్ మృతి
ప్రముఖ మలయాళ నటుడు,చిత్రనిర్మాత ప్రతాప్ పోతన్ శుక్రవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. అతని వయస్సు 69. దర్శకుడు భరతన్ 1978లోరూపొందించిన ఆరవం సినిమాతో ప్రతాప్ అరంగేట్రం చేశాడు.
ప్రముఖ మలయాళ నటుడు,చిత్రనిర్మాత ప్రతాప్ పోతన్ శుక్రవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. అతని వయస్సు 69. దర్శకుడు భరతన్ 1978లోరూపొందించిన ఆరవం సినిమాతో ప్రతాప్ అరంగేట్రం చేశాడు. థకారం, ఆరోహణం, పన్నీర్ పుష్పంగల్, తన్మాత్ర వంటివి ఆయన నటించిన కొన్ని ప్రసిద్ధ మలయాళ చిత్రాలు. ఆయన మలయాళంలో రితుభేదం, డైసీ, ఒరు యాత్రమొళి అనే మూడు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1980ల నుంచి ప్రతాప్ మళయాళం, తమిళం, తెలుగు,హిందీ చిత్ర సీమలో స్క్రిప్ట్ రైటర్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు.
ప్రతాప్ 1952, ఆగస్టు 13న జన్మించారు. 15 యేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఊటీ లో లారెన్స్, లవ్‌డేల్ స్కూల్స్ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీనుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం ముంబైలో యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్ గా కెరీర్ ప్రారంభించారు. ఆయనకు గ్రీన్ యాపిల్ పేరుతో ఓ యాడ్ ఏజెన్సీ కూడా ఉంది. చివరిగా ఆయన మమ్ముట్టితో కలిసి ' సిబి15 ది బ్రెయిన్' అనే చిత్రంలో నటించారు.
ఆయన సినీ నటి రాధికను వివాహం చేసుకున్నారు. అయితే యెడాదిలోనే ఆ బంధం తెగిపోవడంతో ప్రతాప్ అమలా సత్యనాథ్ ను పునర్వివాహం చేసుకున్నారు. 22 యేళ్ళ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ వీరిద్దరూ 2012లో విడాకులు తీసుకున్నారు. వీరికి కేయ అనే కూతురు ఉంది.ప్రతాప్ పోతన్ మృతికి చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతావం వ్యక్తం చేస్తున్నారు.