4DX అంటే ఏమిటి? అదెలా పని చేస్తుంది?

What is 4DX: ఈ మధ్య సినిమా టెక్నాలజీకి సంబంధించి 4DX అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. 2D, 3D టెక్నాలజీలు తెలిసిందే. 2D సినిమాలు ప్రారంభమయిన నాటి నుంచీ అందరికీ తెలిసిన అనుభవమే.

Advertisement
Update:2022-11-29 11:19 IST

4DX అంటే ఏమిటి? అదెలా పని చేస్తుంది?

ఈ మధ్య సినిమా టెక్నాలజీకి సంబంధించి 4DX అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. 2D, 3D టెక్నాలజీలు తెలిసిందే. 2D సినిమాలు ప్రారంభమయిన నాటి నుంచీ అందరికీ తెలిసిన అనుభవమే. ఇది సాంప్రదాయ సినిమా అనుభవం. ఇందులో వెండితెర మీద బొమ్మ పొడవు- వెడల్పు కలిగి వుంటుంది. లోతు వుండదు. కనుక పొడవు వెడల్పులతో 2 డైమెన్షనల్ గా వుంటుంది. దీనికి టెలివిజన్ స్క్రీన్‌, సినిమా థియేటర్‌లోని పెద్ద స్క్రీన్‌ తెలిసిన ఉదాహరణలు.

3D వచ్చేసి మూడవ కోణాన్ని కలిగి వుంటుంది. అంటే బొమ్మ పొడవు వెడల్పులతో బాటు మెరుగైన లోతు (డెప్త్) ని కలిగి వుంటుంది. మరో మాటలో చెప్పాలంటే, వాస్తవ ప్రపంచంలోని వస్తువుల్ని మనం ఎలా గ్రహిస్తామనే దానికి ఇది మరింత వాస్తవిక దృశ్యమాన అనుభవాన్ని అందిస్తుంది. ఈ రకమైన చలన చిత్రాన్ని అనుభవించడానికి సాధారణంగా ప్రత్యేకమైన 3D కళ్ళద్దాలు అవసరం. ఇలా 3D కళ్ళద్దాలు పెట్టుకుని చాలా సినిమాలు చూశాం. ఇది కూడా అందరికీ తెలిసిన టెక్నాలజీ.

ఇప్పుడు 4D అంటే ఏమిటి? ఇది 3D కి అదనంగా మోషన్ అంటే చలనాన్ని జోడిస్తుంది. తెరమీద బొమ్మ పొడవు- వెడల్పు- లోతు అనే మూడు డైమెన్షన్లకి కదలిక అనే నాల్గో డైమెన్షన్ ని జోడిస్తుంది. అంటే, సినిమాలో జరిగే సంఘటనలని భౌతికంగా మనం అనుభవించేట్టు కూర్చున్న సీట్లలో కదలిక వుంటుంది. దీన్ని డైనమిక్ సీట్ సిస్టమ్‌ అంటారు.

మరి 4DX అంటే? ఇది బొమ్మ పొడవు- వెడల్పు- లోతు (3D) కి, సీట్ల కదలిక (4డి) ని జోడించుకున్నాక, అనుబంధంగా ఇంద్రియాలని ప్రభావితం చేస్తుంది. అంటే గాలి స్పర్శని, చలి- మంచు అనుభవాన్ని, వాసననీ ఫీలయ్యేట్టు చేస్తుంది. తెరమీద దృశ్యంలో గాలి వీస్తున్నట్టు వుంటే, ఆ గాలి మనకి తాకుతున్నట్టు ఫీలవుతాం. దృశ్యంలో పాత్రలకి చలి వేస్తూంటే ఆ చలిని మనమూ ఫీలవుతాం. మంచు కురుస్తూంటే మంచులో తడుస్తునట్టూ ఫీలవుతాం.

ఇలా మొత్తం 21 ఎఫెక్ట్స్ ని అనుభవిస్తాం. ఈ సీట్లు వేర్వేరు వేగ నియంత్రణతో వుంటాయి. ఆకస్మిక థ్రస్ట్ లేదా టిల్ట్ వంటి ఎఫెక్ట్స్ ని అనుభవించడానికి బహుళ దిశల్లో ఈ సీట్లు కదలగలవు. యాక్షన్ సినిమాల్లో భూకంపాలు, పోరాట దృశ్యాల ఎఫెక్ట్స్ కోసం ఈ సీట్లు వైబ్రేట్ కూడా అవుతాయి.

ఇలా ఆధునిక 4DX అనుభవాన్నిచ్చే సినిమాలుగా హాలీవుడ్ నుంచి టాప్ గన్ సీక్వెల్, బ్లాక్ పాంథర్ ; వాకాండా ఫర్ ఎవర్, అవతార్2 వెలువడ్డాయి. టాప్ గన్ సీక్వెల్ లో టామ్ క్రూజ్ విమానం టేకాఫ్‌ చేసినప్పుడు, ప్రేక్షకులు కూర్చున్న సీట్లు విపరీతంగా కంపించాయి. ఇంకా ఎఫెక్ట్ కి సరిపోయేలా సీట్లు చుట్టూ తిరిగాయి. 4DX ని మొదటిసారిగా 2009 లో ప్రవేశపెట్టినా, మన దేశంలో 2021 చివర్లో తొలిసారిగా కేరళలోని లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌లో, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్‌ని 4DX ఫార్మాట్‌లో ప్రదర్శించారు.

4DX ఫార్మాట్ లైసెన్స్ దక్షిణ కొరియా సినిమా చైన్ సీజేసీజీవీ యాజమాన్యంతో వుంది. ఈ సంస్థే ఇతర దేశాలకి ఈ టెక్నాలజీని అందిస్తోంది. మన దేశంలో 4DX స్క్రీన్స్ ని పీవీఆర్ సినిమాస్, సినీపోలిస్ సంస్థలు అందిస్తున్నాయి. ప్రస్తుతానికి మన హైదరాబాద్ తో బాటు ముంబాయి, నోయిడా, చెన్నై, బెంగళూరు మొదలైన కొన్ని ప్రధాన నగరాల్లో ఈ థియేటర్‌లున్నాయి.

అయితే ప్రతి 4DX సినిమాలో అన్ని 4DX ఎఫెక్ట్స్ అందుబాటులో వుండవు. 4DX సినిమాల్ని నాలుగు వర్గాలుగా విభజించారు - 4DX ప్రైమ్, 4DX ప్రో, 4DX స్టాండర్డ్, 4DX ఎకానమీ. 4DX ప్రైమ్ 4DX ప్రో మొత్తం 21 ఎఫెక్ట్స్ ని కలిగి వుంటాయి. అందుకే ఈ టిక్కెట్‌లు అత్యంత ఖరీదైనవిగా కూడా వుంటాయి. 4DX ప్రో 12 ఎఫెక్ట్స్ ని కలిగి వుంటుంది, 4DX ఎకానమీ ఫార్మాట్ రోల్, పిచ్, బాటమ్ షేకర్, సువాసనలు, వర్షపు తుఫాను, గాలి, మంచు, మెరుపు, పొగమంచు, బుడగలు వంటి 10 ఎఫెక్ట్స్ తో వుంటుంది.

ప్రేక్షకులు వుంటున్న నగరంలో, లేదా సమీపంలోని నగరంలో 4DX సినిమా చూడాలనుకుంటే బుక్ మై షో, పేటీఏం మూవీస్ నుంచి టికెట్లు పొంద వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం- డిసెంబర్ 16 న అవతార్ 2 4DX టికెట్లు ఇప్పుడే బుక్ చేసుకోండి. హైదరాబాద్ పీవీఆర్ లో టికెట్టు ధర రూ. 350 వుంది.


Full View


Tags:    
Advertisement

Similar News