శేఖర్‌బాషాపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య
డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న లావణ్య మరోసారి నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో శేఖర్‌బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు.
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించేందుకు మస్తాన్‌సాయి, శేఖర్‌బాషా యత్నిస్తున్నారని లావణ్య ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు.140 గ్రాముల డ్రగ్స్ తన ఇంట్లో పెట్టి ఇరికించేందుకు చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మస్తాన్ సాయి, శేఖర్ బాషా కాల్ సంభాషణలను అందజేశారు. పలువురు మహిళల అభ్యంతరకర వీడియోలు కలిగి ఉన్నారని మస్తాన్ సాయిపై నిన్న లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మస్తాన్‌సాయి గతంలో హైదరాబాద్, విజయవాడలో నమోదైన డ్రగ్స్ కేసుల్లో నిందితుడు. సినీ నటుడు రాజ్‌తరుణ్ తనను పెళ్లి పేరిట మోసగించాడని లావణ్య గతంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలోనే మస్తాన్‌సాయి వ్యవహారం బయటకొచ్చింది.
లావణ్య రెండు డ్రగ్స్ కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. మస్తాన్ సాయి సుమారు 100 మందికి పైగా మహిళలను మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు అభ్యంతరకర వీడియోలతో మహిళలను బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మహిళలను బ్లాక్‌మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా నిర్ధారించారు. యువతులను అసభ్యంగా దూషిస్తూ మానసిక క్షోభకు గురి చేసినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించిన వారిని కూడా బెదిరించినట్లు గుర్తించారు. మస్తాన్ సాయిని మరోసారి కస్టడీకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. మస్తాన్ సాయి బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.