బాలీవుడ్ కష్టాలకి కారణాలెన్నో!

ఉత్తరాది రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రమాదంలో పడుతోంది. నగరాల్లో మల్టీ ప్లెక్సులే గాకుండా, పట్టణాల్లో థియేటర్లు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

Advertisement
Update:2023-07-13 17:26 IST

బాలీవుడ్ కష్టాలకి కారణాలెన్నో!

ఉత్తరాది రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల మనుగడ ప్రమాదంలో పడుతోంది. నగరాల్లో మల్టీ ప్లెక్సులే గాకుండా, పట్టణాల్లో థియేటర్లు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నగరాల్లో నిలదొక్కుకునేందుకు పీవీఆర్- ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ సంస్థలు కొరియన్ సినిమాలని దేశంలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇలా హిందీ సినిమాలు బాక్సాఫీసు ఫ్లాపులుగా నష్టాల్ని చవిచూడడంతో సినిమా హాళ్ళు పెద్ద సంక్షోభంలో పడ్డాయి. కోవిడ్ లాక్ డౌన్ల కారణంగా ఇరుక్కున్న సమస్యల్లోంచి లాక్ డౌన్ల అనంతరం కూడా కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది ఫ్లాపుల దెబ్బతో.

ఈ ఏడాది ఇప్పటి వరకూ చూసినా కేవలం ‘పఠాన్’, ‘ది కేరళ స్టోరీ’ రెండే బాక్సాఫీసు హిట్లుగా నిలిచాయి. మిగిలిన సినిమాలకి ప్రేక్షకులు లేకపోవడంతో థియేటర్ల యజమానులు నష్టాల్లో పడుతున్నారు. ఇటీవల పీవీఆర్- ఐనాక్స్ సైతం మార్చి 31, 2023 తో ముగిసిన త్రైమాసికానికి రూ. 333.99 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే ఆరు నెలల్లో నష్టాల్లో వున్న దాదాపు 50 స్క్రీన్‌లని మూసివేయాలని యోచిస్తున్నట్టు కూడా వెల్లడించింది.

ఈ పరిస్థితుల్లో ప్రస్తుతానికి, అతిపెద్ద నష్ట జాతకులు నిర్మాతలు లేదా పంపిణీదారులు కాదు, ఎగ్జిబిటర్లే. సినిమాలు ఆడనప్పుడు మొదట దెబ్బతినేది థియేటర్ల యజమానులే (ఎగ్జిబిటర్లు). నిర్మాత సమయం తీసుకుని తర్వాతి సినిమాల్ని ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని సినిమాల్ని నిర్దిష్ట కాలానికి విడుదల చేయకూడదని పంపిణీదారులూ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎగ్జిబిటర్లకి ప్రతి వారం ఒకటి లేదా రెండు సినిమాలు అందుతూ వుండాల్సిందే. ఫీడింగ్ కోసం అందిన సినిమాలు ఆడకపోతే నష్టపోయేది ఎగ్జిబిటర్లే. థియేటర్ ఆడిస్తే నష్టం, మూసేస్తే నష్టం. ఆడకత్తెరలో పోకచెక్క.

ఓర్మాక్స్ నివేదిక ప్రకారం, హిందీ సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య 5 కోట్ల 80 లక్షలు. ఇది కోవిడ్ ముందు సమయంతో పోలిస్తే 21.5 శాతం తగ్గిపోయింది. మొత్తం దేశ బాక్సాఫీసు ఆదాయం రూ. 10 వేల కోట్లు. 21.5 శాతం హిందీ ప్రేక్షకులు తగ్గిపోవడంతో ఆదాయంలో బాలీవుడ్ వాటా కూడా తగ్గిపోయింది. ఒక్క సౌత్ ఆదాయమే 7 వేల 800 కోట్లు వుంది.

ఒక ట్రేడ్ పండిట్ ప్రకారం, 2023-2024 మొదటి త్రైమాసికం 2018-2019 త్రైమాసికంతో పోలిస్తే 30-35 శాతం బాలీవుడ్ ఆదాయంలో వెనుకబడి వుంది. ప్రేక్షకులు తగ్గడానికి ఖరీదైన టిక్కెట్ ధరలే కారణం. ఇంకో ట్రేడ్ నిపుణుడి ప్రకారం, షారూఖ్ ఖాన్ సినిమాని రూ. 600 ఖర్చు చేసి చూడగలరు గానీ, చిన్న మధ్యస్థ బడ్జెట్ సినిమాల్ని ఇంతే ఖర్చు చేసి చూడలేరు. ఇది కూడా ప్రేక్షకులు తగ్గడానికి కారణం. అయితే హిందీ సినిమాల నాణ్యత కూడా కారణమనేది ఒప్పుకుని తీరాలి. మంచి మంచి నాణ్యత గల సినిమాల్ని అందిస్తూ వచ్చిన మలయాళ పరిశ్రమ ఇప్పుడు చావకబారు సినిమాలతో ఏ పరిస్థితి తెచ్చుకుందో అదే పరిస్థితి హిందీ సినిమాలదీ. వీటి కంటీ హిందీ వెబ్ సిరీస్ దృఢంగా వుంటున్నాయి.

ఇకపోతే, హిందీ సినిమాలకి ప్రేక్షకులు తగ్గిపోవడానికి ఇంకో అంశం కూడా కారణం కావచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఎవరైనా కుటుంబంతో కలిసి వెళ్ళి సినిమా చూస్తే కూల్ డ్రింకులు, సమోసాలు కలిపి 20, 30 రూపాయలకి వచ్చేస్తాయి. మల్టీప్లెక్సుల్లో ఇలా కాదు. గతవారం నోయిడా లోని ఒక మల్టీప్లెక్స్ లో సినిమా చూసిన ప్రేక్షకుడు తడిసి మోపెడయిన స్నాక్స్ బిల్లుని వైరల్ చేశాడు. ఓ 55 గ్రాముల చిటికెడు చీజ్ పాప్ కార్న్ ధర రూ. 460, ఓ 600 మీ.లీ. వుండే పెప్సీ డ్రింకు ధర రూ. 360. మొత్తం కలిపి రూ. 820 క్షవరమైంది టికెట్టు ఖర్చుగాక. ఇదే మల్టీప్లెక్స్ సంస్థ హిందీ సినిమాలకి ప్రేక్షకులు రాక రూ 333 కోట్లు నష్టపోయామని కన్నీరు కారుస్తోంది. ప్రేక్షకుల్ని థియేటర్లకి రాకుండా చేస్తున్న మల్టీప్లెక్సుల వడ్డనలు కూడా బాలీవుడ్ సంక్షోభానికి కారణమేమో దర్యాప్తు చేయాలి.

ఈరోజుల్లో సినిమా థియేటర్లలో తినుబండారాల ధరలు పోష్ కేఫ్‌ల కంటే తక్కువేమీ కాదనీ, మల్టీప్లెక్స్ లో పాప్‌కార్న్ బ్యాగ్ కొనడానికి కిడ్నీ లేదా ఆస్తిని అమ్మకానికి పెట్టాల్సిన అవసరం గురించి కడుపు మండిన ఒక ప్రేక్షకుడు కూడా ట్వీట్ చేశాడు.

ఇలా వుండగా, సినిమా హాళ్ళ మూసివేతకి హిందీ సినిమాల్ని నిందించడం తప్పని దర్శకుడు అనీస్ బాజ్మీ అభిప్రాయపడ్డాడు. సినిమా హాళ్ళు సంక్షోభాన్ని ఎదుర్కొన్న సందర్భాలు గతంలోనూ వున్నాయని, కొన్ని హిందీ సినిమాలు బాగా లేనందు వల్ల థియేటర్లకి నష్టాలు వాటిల్లుతున్న మాట నిజమేననీ, ఏవో కొన్ని సినిమాలు బాగాలేవని ప్రేక్షకులు ఓటీటీలకి అలవాటు పడుతున్నారనీ, అంతేగానీ మొత్తంగా హిందీ సినిమాలే బాగాలేని కారణంగా సినిమా హాళ్ళు మూతపడుతున్నాయనడం సరికాదనీ అన్నాడు. ఇందులో ఇంకా అనేక అంశాలు ముడి పడి వున్నాయని చెప్పాడు.

Tags:    
Advertisement

Similar News