నగరాల్లో మార్కెట్ నిండింది, పల్లెలకు పోదాం!
ప్రాంతీయ భాషల మార్కెట్ సారవంతంగా వున్న మాట నిజమే. అలాగని ప్రాంతీయ భాషల్లోకి దూసుకెళ్ళి పోయి నాసిరకం కంటెంట్ ని గుమ్మరిస్తే బెడిసి కొడుతుంది.
ఓర్మాక్స్ మీడియా ఆడియన్స్ రిపోర్టు 2023 ప్రకారం, దేశంలో ఓటీటీ ప్రేక్షకులు 2022లో 20% పెరుగుదలతో వుంటే, 2023లో 13.5% మాత్రమే పెరిగారు. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఇంకా ఇతర ప్రధాన వేదికలతో ఇప్పటికే మెట్రో నగరాలు సంతృప్త స్థాయికి చేరుకుని రద్దీగా వున్నాయి. ప్రధాన వేదికలు అక్కడ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కాబట్టి చిన్న ఓటీటీ వేదికలు స్థానిక - అంటే ప్రాంతీయ భాషల మార్కెట్‌లపై దృష్టి పెట్టడం సరైనదని రిపోర్టు పేర్కొంటోంది.
ప్రాంతీయ భాషల మార్కెట్ సారవంతంగా వున్న మాట నిజమే. అలాగని ప్రాంతీయ భాషల్లోకి దూసుకెళ్ళి పోయి నాసిరకం కంటెంట్ ని గుమ్మరిస్తే బెడిసి కొడుతుంది. ప్రాంతీయ ప్రేక్షకులంటే తక్కువ నాణ్యతతో సరిపెట్టుకునే ప్రేక్షకులు కాదు. వాళ్ళు కూడా అధిక నాణ్యత గల కంటెంట్ కి అర్హులే. లోతట్టు ప్రాంతాల ప్రేక్షకుల కోసం కంటెంట్‌ని సృష్టించేటప్పుడు అనేక వేదికలు ఎదుర్కొనే ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రేక్షకులు మెట్రో ప్రాంతాల్లో వున్నంత ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా వున్నారా అనేది. మంచి ఓటీటీ కంటెంట్ ని అందిస్తే ప్రాంతీయ ప్రేక్షకులు చెల్లింపు విషయంలో వెనుకాడరని సమాధానం. ఆకర్షణీయ- నాణ్యమైన కంటెంట్ ని అందించినప్పుడు సభ్యత్వాలు తీసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే వుంటారు.
అయినా కొన్ని రాజీలు తప్పనిసరి కావచ్చు. ఎలాగంటే, ప్రొడక్షన్ విలువలు బడ్జెట్ ని బట్టి సాధారణంగా వుండడం, తారాగణంలో స్టార్లు లేకపోవడం మొదలైన ఆకర్షణలతో రాజీపడక తప్పని పరిస్థితి వుంటుంది. దీనికి సమాధానం కూడా వుంది. లైబ్రరీని పరిపుష్టం చేసుకోవడమే. ప్రాంతీయ భాషల్లో కంటెంట్ తో కూడిన గొప్ప లైబ్రరీని సృష్టించుకుంటే, ప్రేక్షకులు ఆకర్షితులవవచ్చు. ఈ వ్యూహం జీ5, ఆల్ట్ బాలాజీ వంటీ ఓటీటీలకి బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతోంది.
ఇటీవలి ఫిక్కీ (భారత పరిశ్రమల సమాఖ్య) నివేదిక ప్రకారం, 2023లో దాదాపు 200,000 గంటల కంటెంట్ ని సృష్టించడం జరిగింది. ఇందులో 96% టీవీ కంటెంట్, 2% ఓటీటీ కంటెంట్, మిగిలిన 2% సినిమాలు. ఈ 2% దాదాపు 4,000 గంటలకి సమానమవుతుంది. కంటెంట్‌లో 51% ప్రాంతీయమైనది. ఇది రాబోయే మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో 55%కి పెరుగుతుందని అంచనా. కాబట్టి ప్రాంతీయ భాషల ఓటీటీలకి మంచి భవిష్యత్తే వుంటుంది.
పరిశ్రమ నిపుణుల ప్రకారం, మార్కెట్ లోకి విస్తృతంగా చేరుకోవాలనే లక్ష్యమున్న ఏ ఓటీటీ వేదికలకైనా ప్రాంతీయ భాషలు అవసరం. కనీసం ఆరు నుంచి ఎనిమిది భాషల్లో కంటెంట్‌ని అందించాల్సి వుంటుంది. ప్రతి భాషలో సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు అయినా ఎనిమిది నుంచి పది భాగాల కంటెంట్‌ని కలిగి వుండాలి. ప్రస్తుతం ఓటీటీల్లో చాలా సినిమాలు దక్షిణాది నుంచి వస్తున్నాయి. వీటితో పోలిస్తే ప్రాంతీయ భాషా వెబ్ సిరీస్‌ల సంఖ్య చాలా తక్కువగా వుంది. అధిక నాణ్యత గల వెబ్ సిరీస్ కంటెంట్ ని ఎలా రూపొందించాలో అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ప్రాంతీయ కంటెంట్ జాతీయ స్థాయిలో వుంటేనే మార్కెట్ నుంచి తగిన లాభాలు వస్తాయి.
మార్కెట్ చూస్తే, కేరళలో 85% ఇంటర్నెట్ వ్యాప్తితో, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్‌ని యాక్సెస్ చేసే పరిస్థితి వుంది. పానిండియా ఓటీటీలతో పోలిస్తే, కేరళలో ప్రతిరోజూ అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఓటీటీల్లో నిమగ్నమవుతున్నారని సర్వేలు చూపిస్తున్నాయి. అత్యంత స్థానికీకరించిన డిజిటల్ కంటెంట్‌పై దృష్టి పెట్టడం వల్లే కేరళలో ఈ అభివృద్ధి జరిగింది. కంటెంట్ వీలైనంత స్థానికంగా వుండాలి. వీక్షకులు అర్థం చేసుకునేలా వుంటూ, పరాయీకరణకి గురికాకుండా వుండేలా చూసుకోవాలి. ఈ విధానం వల్లనే ఈ రోజు దేశంలో ప్రాంతీయ కంటెంట్ అభివృద్ధి చెందే అవకాశముంది.
ప్రాంతీయ మార్కెట్లు ప్రాంతీయ కంటెంట్‌కి మాత్రమే ప్రతిస్పందిస్తాయనే నమ్మకానికి విరుద్ధమైన అభిప్రాయాన్ని అందిస్తూ, పట్టణ మార్కెట్లు కూడా మూలంతో సంబంధం లేకుండా నాణ్యమైన కంటెంట్ కోసం ఆసక్తితో వున్నాయని సర్వే తెలుపుతోంది.
పోతే, ఇంకోవైపు ఇప్పుడు ‘మాస్టర్ షెఫ్ ఇండియా’ వంటి రియాలిటీ షోలని పెద్ద ఓటీటీలు ఇంగ్లీషు, హిందీయే కాకుండా ఇతర భాషల్లోనూ కంటెంట్‌ని సృష్టిస్తున్నాయి. కాబట్టి నేటి నినాదం ప్రాంతీయ కంటెంట్ తో ఛలో పల్లెకు పోదామనే!