ఎన్టీఆర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత

ప్రముఖ నిర్మాత, నటి కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు

Advertisement
Update:2025-02-16 11:30 IST

ప్రముఖ నిర్మాత, నటి కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో వయోభారంతో కన్నుమూశారు. కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు నటన అన్నా, డాన్స్ అన్నా అభిమానంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. చిన్న వయసులోనే నాటకాలలో నటించటం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణని బాలనటిగా ‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు. హీరోయిన్‌గా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజా వారితో పరిచయమైంది.

కృష్ణవేణి హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత ‘మహానంద’ చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు.1949 నవంబరు 24వ తేదీన మనదేశం చిత్రం విడుదలైంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ ఓ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయన నటన విశ్వరూపంతో ఓ అసమాన చరిత్రను లిఖించాడు. రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న కృష్ణవేణి నందమూరి తారక రామారావును సినిమా రంగానికి పరిచయం చేశారు. నటి కృష్ణవేణి మరణం బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. స్టూడియో అధినేతగా, పలు ఉత్తమ చిత్రాలను నిర్మించిన కృష్ణవేణి తెలుగు సినీ కీర్తిని చాటారని చెప్పారనికృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Tags:    
Advertisement

Similar News