తమన్‌కు బాలకృష్ణ సర్‌ప్రైజ్ గిఫ్ట్
వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్‌కు పోర్షే కారు బహుమతి
మూజిక్ డైరెక్టర్ తమన్‌కు నటుడు బాలకృష్ణ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తమన్ టాలెంట్‌ను అభినందిస్తూ భారీ కానుక అందించారు. ఈ మేరకు తాజాగా ఖరీదైన పోర్షే కారును కొనుగోలు చేసి తమన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. కెరీర్ పరంగా మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. హైదరాబాద్‌లో క్యాన్సర్ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవంలో ఆయన తమన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమన్ నాకు తమ్ముడితో సమానం. వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు బహుమతి ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది అన్నారు.
హీరో బాలకృష్ణ-మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబోకు మంచి క్రేజ్ ఉన్న విషయం విదితమే. బాలయ్య నటించిన 'డిక్టేటర్', 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' ఇటీవల విడుదలైన 'డాకు మహారాజ్' మూవీస్‌కు తమన్ స్వరాలు అందించారు. ఆయా సినిమాల విజయంలో సంగీతం ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నది. ఈ నేపథ్యంలోనే డాకు మహారాజ్ ఈవెంట్‌లో తమన్‌ను ఉద్దేశించి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి తమన్ కాదు.. ఎన్బీకే (నందమూరి బాలకృష్ణ) తమన్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్‌కు కొత్త పేరు పెట్టారు. బాలయ్య నటిస్తున్న కొత్త మూవీ అఖండ-2 కు తమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.