తమిళ హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి
విశాల్‌కు వ్యతిరేకులైన వ్యక్తులే ఆయన ఇంటిపై రాళ్ల దాడి చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. విశాల్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై ఆయన మేనేజర్ హరి కృష్ణన్ అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తమిళ హీరో విశాల్ ఇంటిపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో విశాల్ ఇంటి అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. విశాల్ చెన్నైలోని అన్నానగర్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి రెడ్ కలర్ కారులో వచ్చిన కొంతమంది గుర్తు తెలియని దుండగులు విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఇంటికి ఉన్న అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయారు. విశాల్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన సమయంలో ఆయన ఇంట్లో లేడు. షూటింగ్ నిమిత్తం బయటకు వెళ్లారు.
విశాల్ సినీ సంఘం అయిన నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఈ సంఘం తరఫున ఎంతో యాక్టివ్‌గా పని చేసే విశాల్‌కు ప్రత్యర్థి వర్గం కూడా ఉంది. ఈ రెండు వర్గాల మధ్య తరచూ వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన సమయంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన అన్నానగర్ శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని విశాల్ అనుకున్నారు. అయితే అప్పట్లో ఆయన వేసిన నామినేషన్ తిరస్కారానికి గురైంది. విశాల్‌కు వ్యతిరేకంగా ఉన్న ఓ రాజకీయ పార్టీ కుట్ర వల్ల ఆయన వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైందని అప్పట్లో ప్రచారం జరిగింది.
విశాల్‌కు వ్యతిరేకులైన వ్యక్తులే ఆయన ఇంటిపై రాళ్ల దాడి చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. విశాల్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై ఆయన మేనేజర్ హరి కృష్ణన్ అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగులు రాళ్ల దాడి చేసే సమయంలో సీసీ టీవీలో నమోదైన ఫుటేజీని ఆయన పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.